Union Ministry of Environment
-
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో గుంటూరుకు మూడో ర్యాంకు
నెహ్రూనగర్(గుంటూరుఈస్ట్): కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్.క్యాప్) జాతీయ స్థాయిలో చేపట్టిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో గుంటూరు నగరానికి మూడో ర్యాంక్ దక్కింది. దక్షిణ భారతదేశం నుంచి గుంటూరు నగరానికి మాత్రమే ర్యాంకు దక్కిందని మేయర్ కావటి శివనాగ మనోహర్‌నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి గురువారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 131 నగరాలు పోటీ పడగా, అందులో 10 లక్షల లోపు జనాభా కేటగిరిలో గుంటూరు నగరానికి 3వ ర్యాంక్ దక్కిందన్నారు. జాతీయ కాలుష్య నియంత్రణ మండలి 131 నగరాల్లో స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లోని అంశాలను పరిశీలించి 2023–24 ఆర్థిక సంవత్సరానికి ఉత్తమ నగరాలను సిఫార్సు చేసిందన్నారు. ఈ అవార్డును సెపె్టంబర్ 7న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి చేతుల మీదుగా అందుకోనున్నట్లు చెప్పారు. -
గుడ్డ సంచీకి వెల్కం
మార్కెట్‌కెళ్తే సామాన్లు క్యారీ బ్యాగుల్లో ఇస్తారు లెమ్మనుకునే రోజులు రేపటితో పోయినట్టే. ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను కేంద్రం జూలై 1 నుంచి నిషేధించింది? ఇకపై మార్కెట్‌కెళ్తే గుడ్డ సంచీ వెంట ఉండాల్సిందే... ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ (ఎస్యూపీ)వాడకం, తయారీ, అమ్మకం, నిల్వ, పంపిణీ, దిగుమతి తదితరాలన్నింటినీ నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది శుక్రవారం నుంచే అమల్లోకి రానుంది. రీ సైక్లింగ్ కష్టమైన అన్ని రకాల ప్లాస్టిక్‌నూ నిషేధిత జాబితాలో చేర్చింది. 75 మైక్రోన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్‌ను 2021లోనే నిషేధించగా దాన్నిప్పుడు 100 మైక్రోన్లకూ వర్తింపజేసింది. ఇకపై వీటిని ఎవరు తయారు చేసినా, అమ్మినా సంస్థ లైసెన్లు రద్దు చేస్తారు. 120 మైక్రోన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ బ్యాగులు, తదితరాలనూ వచ్చే డిసెంబర్ 31 నుంచి నిషేధించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎందుకీ నిషేధం? ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ప్రపంచంలో మనది 98వ స్థానం. దేశంలో ఏటా 1.18 కోట్ల టన్నుల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తవుతోంది. ఇందులో 29 లక్షల టన్నులు ఎగుమతవుతోంది. ఏటా సగటున 56 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుంటున్నాయి. అంటే ఒక్కొక్కరు ఏకంగా 4 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి చేస్తున్నట్టు లెక్క! ప్రపంచవ్యాప్తంత్తేటా 38 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తవుతోంది. ఇందులో 91% రీ సైక్లింగ్‌కు అవకాశం లేనిదే. ఈ ప్లాస్టిక్ భూమిలో కలిసేందుకు వెయ్యేళ్లకు పైగా పడుతుంది. అందుకే దేశౠలన్నీ ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి సారించాయి. హానికారక ప్లాస్టిక్ ఉత్పత్తిని దశలవారీగా ఆపేయాలని భారత్ సహా 124 దేశాలతో కూడిన ఐరాస ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ తీర్మానించింది. ఎస్యూపీతో యమ డేంజర్ ఎస్యూపీ అంటే ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్. షాంపూ పాకెట్ల నుంచి కరీ పాయింట్లలో కూరలు కట్టిచ్చే కవర్ల దాకా అన్నీ ఈ బాపతే. ఇవి ఆరోగ్యానికి , పర్యావరణానికి అత్యంత హానికరం. ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ప్లాస్టిక్‌లో మూడో వంతు ఎస్యూపీనే. ఇది భూమిలో కలవకపోగా పర్యావరణాన్ని నేరుగా విషతుల్యం చేస్తుంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను పారేయడం, కాల్చేయడం, కొండ ప్రాంతాల్లో పడేయడం జరిగిందని ఓ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఎస్యూపీ ఉత్పత్తి ఇలాగే కొనసాగితే 2050 నాటికి పర్యావరణంలో కలిసిపోయే కర్బన ఉద్గారాల్లో 10 శాతం ఇదే ఉంటుందని ఐరాస అంచనా. ఎస్యూపీ బ్యాగుల్లోని ఆహార పదార్థాలను ఏళ్ల తరబడి తింటే రక్తంలోనూ ప్లాస్టిక్ కణాలు కలిసిపోతాయట. ఇది కేన్సర్ సహా పలు ప్రాణాంతక రోగాలకు దారి తీస్తుంది. భూమ్మీద సకల జీవజాలానికీ ప్లాస్టిక్ ముప్పుగానే మారింది. ఇతర దేశాల్లో.. బంగ్లాదేశ్ ప్రపంచంలో తొలిసారి 2002లోనే ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విధించింది. 2019 జులైలో న్యూజిలాండ్ ఇదే బాట పట్టింది. 68 దేశాలు రకరకాల మందమున్న ప్లాస్టిక్‌ను నిషేధించాయి. 2020లో చైనా దశలవారీగా నిషేధం విధించింది. అమెరికాలో రాష్ట్రాన్ని బట్టి నిషేధముంది. నిషేధిత వస్తువులివే... ► ప్లాస్టిక్ పుల్లలతో కూడిన ఇయర్ బడ్స్ ► బెలూన్లలో వాడే ప్లాస్టిక్ పుల్లలు ► ప్లాస్టిక్ జెండాలు ► చాక్లెట్లు, ఐస్‌క్రీముల్లో వాడే ప్లాస్టిక్ పుల్లలు ► డెకరేషన్‌కు వాడే థర్మోకోల్ ► ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, స్పూన్లు, కత్తులు, స్ట్రా, ట్రేలు ► స్వీటు బాక్సులు, ఇన్విటేషన్ కార్డులు, సిగరెట్ పేకెట్లపై ప్లాస్టిక్ ర్యాపింగ్ ► ద్రవ పదార్థాలను కలపడానికి వాడే ప్లాస్టిక్ స్టిక్స్ ► 100 మైక్రోన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ వస్తువులు (వీసీ బ్యానర్లు) – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘భోగాపురం’ అనుమతులు సరైనవే
సాక్షి, అమరావతి: ప్రజా ప్రయోజనాల నిమిత్తం ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపనంత వరకు ఆ నిర్ణయంలో న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు జోక్యం చేసుకోలేవని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన పర్యావరణ అనుమతులను రద్దు చేసేందుకు నిరాకరించింది. అనుమతులు రద్దుకు సహేతుక కారణాలు లేవని స్పష్టంచేసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, నిపుణుల కమిటీ సిఫారసుల ఆధారంగానే కేంద్ర మంత్రిత్వ శాఖ అనుమతులిచ్చిందని తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నీటి వనరుల విషయంలో మాత్రమే తాము జోక్యం చేసుకుంటున్నామంది. తాము నిర్దేశించిన పరిమితికి మించి నీరు అవసరమైతే పర్యావరణ మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకుని నిబంధనల్లో మార్పు కోరవచ్చని తెలిపింది. ఈ మేరకు ఎన్జీటీ చెన్నై బెంచ్ జుడిషియల్ సభ్యులు జస్టిస్ కె.రామకృష్ణన్, ఎక్స్పర్ట్ సభ్యుడు డాక్టర్ సత్యగోపాల్ కొర్లపాటితో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. భోగాపురం విమానాశ్రయానికి పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ విశాఖపట్నం రాంనగర్‌కు చెందిన దాట్ల శ్రీదేవీ దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి తీర్పునిచ్చింది. ప్రభుత్వం తరఫున సయ్యద్ నూరుల్లా షరీఫ్, దొంతిరెడ్డి మాధురీరెడ్డి తదితరులు వాదనలు వినిపించారు. భోగాపురం విమానాశ్రయానికి ఎంత భూమి అవసరమన్న వివరాలను దాచిపెట్టారన్న పిటిషనర్ వాదనను ఎన్జీటీ తోసిపుచ్చింది. ‘పౌర విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఉండకూడదన్న నిషేధం ఏదీ లేదు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న ఎయిర్‌పోర్టు భోగాపురం విమానాశ్రయానికి 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుత విమానాశ్రయం నావికాదళానికి సంబంధించింది. పౌర విమానాశ్రయంగా దానిని నిర్వహించే విషయంలో కొన్ని పరిమితులున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా ఓ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలన్న విధానపరమైన నిర్ణయం తీసుకుంది.’ అని ట్రిబ్యునల్ తన తీర్పులో పేర్కొంది. -
పర్యావరణహితంగా ‘వైఎస్సార్ స్టీల్’
సాక్షి, అమరావతి: ఎటువంటి కాలుష్యం లేకుండా.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం ద్వారా పర్యావరణహితంగా వైఎస్సార్ స్టీల్ ప్లాంట్‌ను నిర్మించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ ప్లాంట్ నిర్మాణానికి ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మాణ పనులు చేపట్టడానికి అవసరమైన సీఎఫ్ఈ (కన్సంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్)ను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మంజూరు చేసింది. సీఎఫ్ఈ సర్టిఫికెట్‌ను వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్‌కు జారీ చేసినట్లు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) చైర్మన్ అశ్వినీకుమార్ పరిడా గురువారం తెలిపారు. వెనుకబడిన రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ఈ ప్లాంట్ ఏర్పాటు లక్ష్యం. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు సమీపంలో ఈ స్టీల్ ప్లాంట్‌కు 2019 డిసెంబర్లో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 3,591 ఎకరాల్లో రూ.16,986 కోట్లతో అంచనాతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు పరిడా పేర్కొన్నారు. ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన ముడి ఇనుమును సరఫరా చేయడానికి జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ)తో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టడానికి ఎస్సార్ స్టీల్ ముందుకు వచ్చింది. కాలుష్యాన్ని తగ్గించే పరిజ్ఞానం పర్యావరణహితంగా వైఎస్సార్ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాజెక్టస్ డైరెక్టర్ బలరామ్ ‘సాక్షి’కి వివరించారు. సాధారణంగా స్టీల్ ప్లాంట్ల్లో వాయుకాలుష్యం 50 ఎంజీ/ఎన్ఎం3 వరకు అనుమతిస్తారని తెలిపారు. అయితే అత్యాధునిక పరిజ్ఞానం వినియోగించడం ద్వారా దీన్ని 30 ఎంజీ/ఎన్ఎం3కే పరిమితం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిశ్రమ వ్యర్థాలు ఒక చుక్క కూడా బయటకు వెళ్లకుండా శుద్ధి చేసి పూర్తిగా వినియోగించుకుంటామని చెప్పారు. ప్లాంట్ దక్షిణం వైపు రిజర్వ్ ఫారెస్ట్ ఉందని.. దానిపై కాలుష్యం ప్రభావం పడకుండా అర కిలోమీటరు వరకు చెట్లను పెంచుతామన్నారు. ప్రధాన ప్లాంట్ చుట్టూ 30 నుంచి 50 మీటర్ల వరకు పచ్చదనాన్ని పెంపొందిస్తామని తెలిపారు. ఈ ప్రతిపాదనను పరీడా నేతృత్వంలోని సీఎఫ్ఈ కమిటీకి వివరించగా.. సానుకూలంగా స్పందించి అనుమతులు మంజూరు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం ప్రధాన ప్లాంట్‌కు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్ట్ సిద్ధమవుతోందన్నారు. త్వరలోనే ఎస్సార్ స్టీల్‌తో ఒప్పందం చేసుకొని నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. -
రాయలసీమ ఎత్తిపోతలకు అనుమతులు అవసరం లేదు
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 2006 పర్యావరణ ప్రభావ అంచనా నిబంధనలు వర్తించవు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదు. అదనపు ఆయకట్టు ఏర్పాటు కావడం లేదు. ఇది ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు. విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు అంతకన్నా కాదు. జలాశయం, విద్యుదుత్పత్తి ప్రాజెక్టును విస్తరించడం లేదా ఆధునీకరించడం చేయడం లేదు. గ్రావిటీ నుంచి పంపింగ్‌కు మారడాన్ని పర్యావరణ అనుమతుల మార్పుగా పరిగణించడం సాధ్యం కాదు. తనకు కేటాయించిన నీటినే ఆంధ్రప్రదేశ్ వాడుకుంటున్నంత వరకు పర్యావరణ అనుమతుల ప్రసక్తే తలెత్తదు –ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్లో కేంద్ర పర్యావరణ శాఖ సాక్షి, అమరావతి: పర్యావరణ ప్రభావ అంచనా(ఈఐఏ) నోటిఫికేషన్ పరిధిలోకి ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ రాదని, అందువల్ల దీనికి పర్యావరణ అనుమతులేవీ అవసరం లేదని కేంద్ర అటవీ, పర్యావరణశాఖ శుక్రవారం జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)కు నివేదించింది. రాయలసీమ ఎత్తిపోతల కొత్త ప్రాజెక్టు కాదని తేల్చిచెప్పింది. నిపుణుల కమిటీ కూడా ఇదే అంశంపై ముందస్తు పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఎన్జీటీకి నివేదికివ్వడం తెలిసిందే. తాజాగా ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర పర్యావరణశాఖ తన వైఖరిని స్పష్టంగా తెలియచేసింది. అన్ని విషయాలు పరిగణించాకే... ► తెలుగుగంగ ప్రాజెక్టు, శ్రీశైలం కుడికాలువలకు 1994 ఈఐఏ నోటిఫికేషన్ ప్రకారం పర్యావరణ అనుమతులిచ్చారు. ఆ అనుమతుల్లో నీటి సరఫరాను పంపింగ్ ద్వారా చేస్తారా? గ్రావిటీ ద్వారా చేస్తారా? అనే ప్రస్తావన లేదు. గాలేరు నగరి సుజల స్రవంతి ఈఐఏ పర్యావరణ అనుమతుల్లో 38 టీఎంసీల నీటి సరఫరా ప్రస్తావన ఉంది. ► తెలుగుగంగ, శ్రీశైలం కుడికాలువ, గాలేరు నగరి సుజల స్రవంతి వేర్వేరు సమయాల్లో ఏర్పాటయ్యాయి. పర్యావరణ, అటవీశాఖ నుంచి వేర్వేరుగా అనుమతులు తీసుకున్నారు. ► ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రివర్ వ్యాలీ, హైడ్రో ప్రాజెక్ట్ నిపుణుల కమిటీ జూలై 29న సమావేశమై చర్చించింది. 2006 ఈఐఏ నోటిఫికేషన్ ప్రకారం చర్చలు జరిగాయి. ► అన్ని విషయాల్ని పరిగణనలోకి తీసుకున్నాక ప్రాథమిక ఆధారాలనుబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ముందస్తు పర్యావరణ అనుమతులు అక్కర్లేదని కమిటీ స్పష్టంగా చెప్పింది. తెలంగాణ సర్కారు అభ్యంతరం.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ముందస్తు పర్యావరణ అనుమతులు అవసరం లేదంటూ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై తెలంగాణ సర్కారు అభ్యంతరం తెలిపింది. ఈ పథకానికి పర్యావరణ అనుమతులు లేవని, దీనివల్ల పలు ప్రాజెక్టుల ఆయకట్టుతోపాటు హైదరాబాద్‌కు తాగునీటి సమస్య ఏర్పడుతుందంటూ తెలంగాణ, నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ఎన్జీటీలో పిటిషన్ వేశారు. దీన్ని హరిత ట్రిబ్యునల్ శుక్రవారం మరోసారి విచారించింది. ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్.వెంకటరమణి, న్యాయవాదులు దొంతిరెడ్డి మాధురిరెడ్డి, తుషారా జేమ్స్‌లు విచారణకు హాజరవగా, తెలంగాణ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు, స్పెషల్ జీపీ ఎ.సంజీవ్‌కుమార్, పిటిషనర్ తరఫున కె.శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. దీనిపై తదుపరి విచారణను ట్రిబ్యునల్ సెప్టెంబర్ 3కు వాయిదా వేసింది. అదేరోజు ఏపీ వాదన వింటామని తెలిపింది. -
మొదలు కానున్న ‘తుపాకులగూడెం’!
పర్యావరణ క్లియరెన్స్‌లతో బ్యారేజీ నిర్మాణ పనులకు లైన్‌క్లియర్ సాక్షి, హైదరాబాద్: గోదావరిలో నికర, మిగులు జలాలను వాడుకునేందుకు చేపట్టిన కంతనపల్లి ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణ పనులు త్వరలో మొదలు కానున్నాయి. ఈ ప్రాజెక్టు పరిధిలో పర్యావరణ అనుమతులు తెచ్చుకు నేందుకు ఇటీవలే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ బ్యారేజీ పనులకు అను మతిని ఇవ్వడంతో.. పనులు చేపట్టేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇక ప్రాజెక్టు పరిధిలో 233 ఎకరాల భూసేకరణ అవసరం ఉండగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం సేకరించేందుకు అధికారులు సిద్ధమవు తున్నారు. 2.28 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుతో మొత్తం 50 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోసి దేవాదుల, ఎస్సారెస్పీల కింద ఉన్న 6 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ఆ గ్రామాల ముంపు కారణంగానే.. కంతనపల్లి బ్యారేజీ నీటి నిల్వలను 85 మీటర్లకు నిర్ణయించ డంతో ఎఫ్ఆర్ఎల్లోని 100 మీటర్ల పరిధిలో 12 గ్రామాలు ముంపునకు గురవుతుండగా, 11వేల ఎకరాల భూసేకరణ అవసరం. దీంతో ప్రాజెక్టు ప్రతిపాదనను కంతనపల్లి నుంచి మార్చి తుపాకులగూడెం వద్ద నిర్మించాలని నిర్ణయించారు. కంతనపల్లి బ్యారేజీ నిర్మాణానికి రూ.1809 కోట్లతో అంచనా ఉండగా దాన్ని ఓ కాంట్రాక్టు సంస్థ 9% లెస్తో రూ.1643.67 కోట్లకు పనులు దక్కించుకుంది. అనంతరం మారిన ప్రతిపాదన కారణంగా తుపాకులగూడెం బ్యారేజీ అంచనాలను కొత్తగా రూ.2121 కోట్లతో సిద్ధం చేశారు. -
అడిగినన్ని అటవీ భూములివ్వం
ఇపుడు తీసుకున్న 13 వేల హెక్టార్లను ఎలా వినియోగిస్తారో చెప్పండి రాజధానికి అటవీ భూములపై సీఆర్డీఏకు కేంద్రం ఝలక్ వైఎస్ఆర్, ప్రకాశం జిల్లాల్లోని చూపిన భూమిలో అడవులు పెరగవు పలు కొర్రీలతో రాష్ట్ర ప్రతిపాదనలను తిప్పి పంపిన వైనం సాక్షి, అమరావతి: నూతన రాజధాని పేరుతో వేల ఎకరాల రైతుల భూమిని అవసరం లేకపోయినా ప్రైవేట్ బడా సంస్థల కోసం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. వేలాది ఎకరాల అటవీ భూమిని కూడా తీసుకునేందుకు వేసిన ఎత్తులను చిత్తు చేస్తూ కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ సీఆర్డీఏకు ఝలక్ ఇచ్చింది. రాజధానిలో అటవీ భూమికి బదులు ఇతర చోట్ల 32,240 ఎకరాల అటవీ భూమి ఇవ్వాలని, అందుకు అనుమతి కోసం కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు సీఆర్డీఏ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏడాది క్రితం ప్రతిపాదనలను పంపింది. సీఆర్డీఏ పంపిన ప్రతిపాదనలపై పలు కొర్రీలను వేస్తూ ఇటీవల కేంద్రం తిరిగి వెనక్కు పంపించింది. రాజధాని రీజియన్ కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏకంగా 13 వేల హెక్టార్ల (32,240 ఎకరాలు) భూమి ఎందుకు అవసరమని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేపిటల్ సిటీ కోసం అవసరమైతే అటవీ భూమిని డీ నోటిఫై చేస్తామని చట్టంలో పేర్కొన్నాం తప్ప కేపిటల్ రీజియన్ కోసం కాదని కేంద్రం తెలిపింది. అయినా కేపిటల్ సిటీ కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున భూములను సేకరించినందున మళ్లీ అటవీ భూమి ఎందుకని ప్రశ్నించింది. పదేళ్లలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి 32 వేల హెక్టార్ల అటవీ భూమి వినియోగ మార్పిడిని కోరితే ఏపీ ప్రభుత్వం ఒక ఏడాదిలోనే 13 వేల హెక్టార్ల అటవీ భూమి వినియోగం మార్పిడి కోరడం ఏంటని నిలదీసింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 13 వేల హెక్టార్ల అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్, ప్రకాశం జిల్లాల్లో చూపిన భూమి పూర్తిగా రాళ్లతో నిండి ఉందని, అక్కడ అడవి పెంచడం సాధ్యం కాదంది. అడవి పెంచడానికి యోగ్యమైన భూములతో పాటు అడవి పెంచడానికయ్యే వ్యయాన్ని తొలుత కేంద్రానికి డిపాజిట్ చేయాలని తెలిపింది. కాగా రూ.2,000 కోట్ల మేర కేంద్రానికి డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత మేర డిపాజిట్ చేయడం సాధ్యం కాదని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఆ భూములను ఎలా వినియోగిస్తారో చెప్పండి.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 13 వేల హెక్టార్ల అటవీ భూమిలో ఏమి చేపడతారు, ఎలాంటి కార్యకలాపాలకు ఆ భూమిని వినియోగిస్తారో హెక్టార్ వారీగా మాస్టర్ ప్రణాళికను కూడా పంపించాల్సి ఉంటుందని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆ మేరకు మాస్టర్ ప్రణాళికను రూపొందించాల్సిందిగా సీఆర్డీఏను కోరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ పరిణామంతో ప్రస్తుత కేంద్ర అటవీ పర్యావరణ మంత్రి అనిల్ మాధవ్ దవే అటవీ ప్రాంతాన్ని ఇతర అవసరాలకు వినియోగించేందుకు అంగీకరించలేదని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో కేపిటల్ రీజియన్ అవసరాలకు అటవీ భూమిని తీసుకుని బడా పారిశ్రామిక వేత్తలకు, వాణిజ్య కార్యకలాపాలకు ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల యత్నాలకు గండిపడినట్లేనని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.