గోదావరిలో నికర, మిగులు జలాలను వాడుకునేందుకు చేపట్టిన కంతనపల్లి ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా
పర్యావరణ క్లియరెన్స్‌లతో బ్యారేజీ నిర్మాణ పనులకు లైన్‌క్లియర్
సాక్షి, హైదరాబాద్: గోదావరిలో నికర, మిగులు జలాలను వాడుకునేందుకు చేపట్టిన కంతనపల్లి ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణ పనులు త్వరలో మొదలు కానున్నాయి. ఈ ప్రాజెక్టు పరిధిలో పర్యావరణ అనుమతులు తెచ్చుకు నేందుకు ఇటీవలే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ బ్యారేజీ పనులకు అను మతిని ఇవ్వడంతో.. పనులు చేపట్టేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.
ఇక ప్రాజెక్టు పరిధిలో 233 ఎకరాల భూసేకరణ అవసరం ఉండగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం సేకరించేందుకు అధికారులు సిద్ధమవు తున్నారు. 2.28 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుతో మొత్తం 50 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోసి దేవాదుల, ఎస్సారెస్పీల కింద ఉన్న 6 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు.
ఆ గ్రామాల ముంపు కారణంగానే..
కంతనపల్లి బ్యారేజీ నీటి నిల్వలను 85 మీటర్లకు నిర్ణయించ డంతో ఎఫ్‌ఆర్‌ఎల్‌లోని 100 మీటర్ల పరిధిలో 12 గ్రామాలు ముంపునకు గురవుతుండగా, 11వేల ఎకరాల భూసేకరణ అవసరం. దీంతో ప్రాజెక్టు ప్రతిపాదనను కంతనపల్లి నుంచి మార్చి తుపాకులగూడెం వద్ద నిర్మించాలని నిర్ణయించారు. కంతనపల్లి బ్యారేజీ నిర్మాణానికి రూ.1809 కోట్లతో అంచనా ఉండగా దాన్ని ఓ కాంట్రాక్టు సంస్థ 9% లెస్‌తో రూ.1643.67 కోట్లకు పనులు దక్కించుకుంది. అనంతరం మారిన ప్రతిపాదన కారణంగా తుపాకులగూడెం బ్యారేజీ అంచనాలను కొత్తగా రూ.2121 కోట్లతో సిద్ధం చేశారు.