మార్కెట్‌కెళ్తే సామాన్లు క్యారీ బ్యాగుల్లో ఇస్తారు లెమ్మనుకునే రోజులు రేపటితో పోయినట్టే. ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను కేంద్రం జూలై 1 నుంచి నిషేధించింది? ఇకపై మార్కెట్‌కెళ్తే గుడ్డ సంచీ వెంట ఉండాల్సిందే...
ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ (ఎస్‌యూపీ)వాడకం, తయారీ, అమ్మకం, నిల్వ, పంపిణీ, దిగుమతి తదితరాలన్నింటినీ నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది శుక్రవారం నుంచే అమల్లోకి రానుంది. రీ సైక్లింగ్ కష్టమైన అన్ని రకాల ప్లాస్టిక్‌నూ నిషేధిత జాబితాలో చేర్చింది. 75 మైక్రోన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్‌ను 2021లోనే నిషేధించగా దాన్నిప్పుడు 100 మైక్రోన్లకూ వర్తింపజేసింది. ఇకపై వీటిని ఎవరు తయారు చేసినా, అమ్మినా సంస్థ లైసెన్లు రద్దు చేస్తారు. 120 మైక్రోన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ బ్యాగులు, తదితరాలనూ వచ్చే డిసెంబర్ 31 నుంచి నిషేధించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఎందుకీ నిషేధం?
ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ప్రపంచంలో మనది 98వ స్థానం. దేశంలో ఏటా 1.18 కోట్ల టన్నుల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తవుతోంది. ఇందులో 29 లక్షల టన్నులు ఎగుమతవుతోంది. ఏటా సగటున 56 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుంటున్నాయి. అంటే ఒక్కొక్కరు ఏకంగా 4 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి చేస్తున్నట్టు లెక్క! ప్రపంచవ్యాప్తంత్తేటా 38 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తవుతోంది. ఇందులో 91% రీ సైక్లింగ్‌కు అవకాశం లేనిదే. ఈ ప్లాస్టిక్ భూమిలో కలిసేందుకు వెయ్యేళ్లకు పైగా పడుతుంది. అందుకే దేశౠలన్నీ ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి సారించాయి. హానికారక ప్లాస్టిక్ ఉత్పత్తిని దశలవారీగా ఆపేయాలని భారత్ సహా 124 దేశాలతో కూడిన ఐరాస ఎన్విరాన్‌మెంట్ అసెంబ్లీ తీర్మానించింది.
ఎస్‌యూపీతో యమ డేంజర్
ఎస్‌యూపీ అంటే ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్. షాంపూ పాకెట్ల నుంచి కరీ పాయింట్లలో కూరలు కట్టిచ్చే కవర్ల దాకా అన్నీ ఈ బాపతే. ఇవి ఆరోగ్యానికి , పర్యావరణానికి అత్యంత హానికరం. ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ప్లాస్టిక్‌లో మూడో వంతు ఎస్‌యూపీనే. ఇది భూమిలో కలవకపోగా పర్యావరణాన్ని నేరుగా విషతుల్యం చేస్తుంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను పారేయడం, కాల్చేయడం, కొండ ప్రాంతాల్లో పడేయడం జరిగిందని ఓ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఎస్‌యూపీ ఉత్పత్తి ఇలాగే కొనసాగితే 2050 నాటికి పర్యావరణంలో కలిసిపోయే కర్బన ఉద్గారాల్లో 10 శాతం ఇదే ఉంటుందని ఐరాస అంచనా. ఎస్‌యూపీ బ్యాగుల్లోని ఆహార పదార్థాలను ఏళ్ల తరబడి తింటే రక్తంలోనూ ప్లాస్టిక్ కణాలు కలిసిపోతాయట. ఇది కేన్సర్ సహా పలు ప్రాణాంతక రోగాలకు దారి తీస్తుంది. భూమ్మీద సకల జీవజాలానికీ ప్లాస్టిక్ ముప్పుగానే మారింది.
ఇతర దేశాల్లో..
బంగ్లాదేశ్ ప్రపంచంలో తొలిసారి 2002లోనే ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విధించింది. 2019 జులైలో న్యూజిలాండ్ ఇదే బాట పట్టింది. 68 దేశాలు రకరకాల మందమున్న ప్లాస్టిక్‌ను నిషేధించాయి. 2020లో చైనా దశలవారీగా నిషేధం విధించింది. అమెరికాలో రాష్ట్రాన్ని బట్టి నిషేధముంది.
నిషేధిత వస్తువులివే...
► ప్లాస్టిక్ పుల్లలతో కూడిన ఇయర్ బడ్స్
► బెలూన్లలో వాడే ప్లాస్టిక్ పుల్లలు
► ప్లాస్టిక్ జెండాలు
► చాక్లెట్లు, ఐస్‌క్రీముల్లో వాడే ప్లాస్టిక్ పుల్లలు
► డెకరేషన్‌కు వాడే థర్మోకోల్
► ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, స్పూన్లు, కత్తులు, స్ట్రా, ట్రేలు
► స్వీటు బాక్సులు, ఇన్విటేషన్ కార్డులు, సిగరెట్ పేకెట్లపై ప్లాస్టిక్ ర్యాపింగ్
► ద్రవ పదార్థాలను కలపడానికి వాడే ప్లాస్టిక్ స్టిక్స్
► 100 మైక్రోన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ వస్తువులు (వీసీ బ్యానర్లు)
– సాక్షి, నేషనల్ డెస్క్
జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్.. ఈసారి కచ్చితంగా అమలు!
Published Wed, Jun 29 2022 10:04 AM | Last Updated on Thu, Jun 30 2022 5:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment