Tupakula gudem barrage
-
సమ్మక్క బ్యారేజీ సిద్ధమవుతోంది!
సాక్షి, హైదరాబాద్ : గోదావరి నది జలాల సమర్థ వినియోగం, దేవాదుల ఎత్తిపోతల పథకానికి నీటి లభ్యత పెంచే ఉద్దేశంతో చేపట్టిన తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజీ శరవేగంగా సిద్ధమవుతోంది. ఈ ఖరీఫ్ సీజన్లోనే గోదావరి నీటిని నిలిపేలా పనులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తూ పనుల పూర్తిపై మార్గదర్శనం చేస్తున్నారు. గేట్లు అమర్చే ప్రక్రియ ఆరంభం.. గోదావరిలో 100 టీఎంసీల మేర నీటి వాటా హక్కుగా ఉన్న కంతనపల్లి ప్రాజెక్టుతో వరంగల్, కరీంగనర్ జిల్లాల పరిధిలో 7.5 లక్షల ఎకరాలకు నీటిని అందించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్ణయించారు. అయితే కంతనపల్లితో 8 గ్రామాలు పూర్తిగా, మరో 12 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతుండటంతో ప్రాజెక్టు ప్రతిపాదనను తుపాకులగూడెం ప్రాంతానికి మార్చారు. ఇక్కడ నీటి లభ్యత గరిష్టంగా 470 టీఎంసీలకు పైగా ఉంటుందని, ఇక్కడ 83 మీటర్ల ఎత్తులో 6.94 టీఎంసీల నిల్వ సామర్థ్యం, 1,132 మీటర్ల పొడవు, 59 గేట్లతో బ్యారేజీ పనులు చేపట్టారు. రూ.2,121 కోట్లతో పరిపాలనా అనుమతులివ్వగా, రూ.1,700 కోట్లతో ఏజెన్సీలతో ఒప్పందం కుదిరింది. ఈ పనుల్లో ఇప్పటికే రూ.1,100 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మట్టి, కాంక్రీట్ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. 59 గేట్లలో 58 గేట్ల తయారీ పూర్తయింది. ఆదివారం నుంచి వాటిని అమర్చే ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ చివరి నాటికి ఈ గేట్లు అమర్చే ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రోడ్ బ్రిడ్జి స్లాబ్‌లు సైతం 40 వరకు పూర్తయ్యాయి. 30 పియర్ నిర్మాణాలు పూర్తవ్వగా, వాటి మధ్యలోంచే ప్రస్తుతం గోదావరి నీటి ప్రవాహాలు దిగువకు వెళ్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఇక్కడ నీటి నిల్వ చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఇంజనీర్లను ఆదేశించారు. దీని ఎగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజీ నీటి నిల్వలను ఈ ఏడాది ఏప్రిల్‌లో ఖాళీ చేసి పూర్తి స్థాయి మరమ్మతులు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మేడిగడ్డ మరమ్మతులపై బ్యారేజీ గేట్లు ఎత్తిన పక్షంలో నీరు దిగువన తుపాకులగూడెం చేరుతుంది. మేడిగడ్డ నుంచి వచ్చే నీరంతా తుపాకులగూడెంలో నిల్వ ఉండేలా బ్యారేజీ స్లూయిస్ నిర్మాణం 70 నుంచి 71 మీటర్ల లెవల్ వరకు పూర్తి చేయాలని, ఈ లెవల్లో 2.90 టీఎంసీ నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుందని సీఎం గతంలోనే సూచించగా, ఈ పనులను ఇటీవలే ముగించారు. వరద మొదలయ్యే నాటికి ఒక్క టీఎంసీ నీటిని కూడా దిగువకు వదలొద్దన్న ఉద్దేశంతో జూలై, ఆగస్టు నాటికి బ్యారేజీ ఎఫ్ఆర్ఎల్ 83 మీటర్ల మేర నీటిని 6.94 టీఎంసీల నిల్వ చేసేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించగా, ఆ పనులు వేగిరమయ్యాయి. ఈ పనులు పూర్తయితే దేవాదుల ఎత్తిపోతలకు నీటి లభ్యత పెరగనుంది. దీనికింద నిర్ణయించి 6.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించడం సులభతరం కానుంది. అయితే దేవాదులలోని మూడో దశ పనులు పూర్తయితేనే పూర్తి ఆయకట్టుకు నీరందించే అవకాశాలుండటంతో ఆ పనులను వేగిరం చేశారు. -
కొట్టుకుపోయిన కాఫర్‌డ్యాం
సాక్షి, భూపాలపల్లి: దేవాదుల పథకానికి గుండెకాయలా భావిస్తున్న తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణ పనులు మళ్లీ మొదలు కావాలంటే మరో రెండు మూడు నెలల సమయం పట్టేలా ఉంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బ్యారేజీ వద్ద పనులు పూర్తిగా నిలిచిపోయాయి. నిర్మాణం సజావుగా సాగడానికి ఏర్పాటు చేసిన కాఫర్‌డ్యాం (మట్టికట్ట) గోదావరి వరద కారణంగా గురువారం రాత్రి తెగిపోయింది. నిర్మాణంలో ఉన్న పిల్లర్లు నీట మునిగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నాయిగూడెం మండల పరిధిలోని తుపాకులగూడెం వద్ద నిర్మాణం చేపడుతున్న బ్యారేజీ పనులకు ఆది నుంచీ అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. నది ప్రవాహాన్ని నిలువరించేందుకు, దేవాదులకు మోటార్ల పంపింగ్‌కు అవసరమైన 71 మీటర్ల నీటి మట్టాన్ని కొనసాగించేందుకు నది ప్రవాహానికి సగభాగం వరకు మట్టితో కాఫర్‌డ్యాం కట్టారు. ప్రస్తుతం గోదావరి వరద తీవ్రతకు కాఫర్‌డ్యాం పూర్తిగా కొట్టుకుపోయింది. బ్యారేజీ నిర్మాణం కోసం గతంలో నిర్మించిన 8 పిల్లర్లు నీటిలో మునిగిపోయాయి. వీటి పక్కనే కొత్తగా మరో 11 పిల్లర్ల నిర్మాణం చేపట్టారు. వీటి రక్షణ కోసం నిర్మించిన కాఫర్‌డ్యాం తెగిపోవడంతో భారీగా వరదనీరు చేరి దాదాపు అన్ని పిల్లర్లు నీటిలో కనిపించకుండా మునిగిపోయాయి. వృథాగా పోతున్న వరదనీరు.. భారీగా కురుస్తున్న వర్షాలతో గోదావరి వరదనీరు వృథాగా సముద్రం పాలవుతోంది. దేవాదుల ప్రాజెక్ట్‌లో తగినంత నీటిని నిల్వచేసే ఉద్దేశంతో ప్రస్తుతం తుపాకులగూడెం బ్యారేజీని నిర్మిస్తున్నారు. వరుసగా వరదలు రావడం, నిధుల లేమితో నిర్మాణం నెమ్మదిగా సాగుతోంది. తాజాగా తెగిన కాఫర్‌డ్యాం కారణంగా 4,20,000 క్యూసెక్కుల నీరు వృ«థాగా పోయిందని అధికారులు చెబుతున్నారు. 2019 సంవత్సరానికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆలోపు పూర్తయ్యేలా కనిపించడంలేదు. పనులు నెల రోజులు ఆగినట్టే.. జగదీశ్, ఈఈ, తుపాకులగూడెం బ్యారేజీ కాఫర్‌డ్యామ్‌ను 83 అడుగుల ఎత్తుతో నిర్మించారు. అంతకు మించి వరద రావడంతో గురువారం రాత్రి కొట్టుకుపోయింది. వరద తగ్గిన తర్వాత తిరిగి కాఫర్ డ్యాం నిర్మించి బ్యారేజీ పనులు కొనసాగిస్తాం. కనీసం ముప్పై నుంచి నలభై రోజుల పాటు పనులు నిలిచిపోతాయి. -
అక్కడ అలా.. ఇక్కడ ఇలా..!
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాళేశ్వరం ప్రాజెక్టు అహో.. ఓహో అంటూ అందరూ కితాబిస్తున్నారు. కానీ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆయువు పట్టు అయిన మేడిగడ్డ బ్యారేజీకి 30 కి.మీ.ల దిగువన నిర్మిస్తున్న తుపాకులగూడెం పురోగతిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. 10లక్షల ఎకరాలకు సాగునీరందిం చే ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. 20 ఏళ్ల నుంచి.. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల పరిధిలో సుమారు 10 లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో 20 ఏళ్ల క్రితం దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మొత్తం 3 దశల్లో ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. అప్పటి ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా పదేళ్ల పాటు శ్రమించి తొలి దశ పనులు ప్రారంభించారు. దేవాదుల ఎత్తిపోతల పథకంలో ఏడాదిలో 171 రోజులు నీటిని ఎత్తిపోయడం ద్వారా 10 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకువచ్చే లక్ష్యంతో డిజైన్ చేశారు. మోటార్ల ద్వారా తోడి పోయాలంటే గోదావరిలో కనీస నీటిమట్టం 71 అడుగులు ఉండాలి. వరదలు వచ్చినప్పుడు తప్ప ఈ స్థాయిలో నీటి మట్టాలు గోదావరిలో లేకపోవడంతో 40 రోజులకు మించి ప్రాజెక్టు ద్వారా నీటిని లిఫ్ట్ చేయడం సాధ్యపడలేదు. దేవాదుల వద్ద కనీస నీటి మట్టం స్థాయిని ఉంచేలా దిగువన కంతనపల్లి వద్ద బ్యారేజీ నిర్మిం చేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించారు. ఈ మేరకు పీవీ నర్సింహారావు సుజల స్రవంతి పేరుతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఆయన మరణంతో ఈ ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రాజెక్టు రీ డిజైనింగ్‌లో భాగంగా పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌తో ఇబ్బంది లేకుండా పూర్తిగా ముంపు లేకుండా కంతనపల్లికి 17 కి.మీ.ల ఎగు వన తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మాణానికి రూపకల్పన చేశారు. బ్యారేజీ నిర్మాణానికి 2,121 కోట్లు కేటాయించారు. నత్తనడకన పనులు: కంతనపల్లి రద్దయి తుపాకులగూడెం బ్యారేజీ తెరపైకి రాగా.. గతంలో అగ్రిమెంట్ చేసుకున్న సూ–రిత్విక్ కంపెనీకే పనులు అప్పగించారు. మారిన పరిస్థితులు, డిజైన్‌కు అనుగుణంగా 2016లో అక్టోబర్‌లో అగ్రిమెంట్ కాగా.. 2020 కల్లా ప్రాజెక్టును పూర్తి చేయా ల్సి ఉంది. 2017 ఫిబ్రవరి నుంచి పనులు ప్రారం భించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు రాకెట్ వేగంతో దూసుకుపోతుంటే తుపాకులగూడెం పనులు తాబేలు నడకను తలపిస్తున్నాయి. పనులు ప్రారంభించి ఏడాది దాటినా ఇప్పటి వరకు ఫౌండేషన్ పనులు పూర్తి కాలేదు. డౌన్ స్ట్రీమ్ ర్యాఫ్ట్, డౌన్ స్ట్రీమ్ స్పిల్‌వే పనుల వరకే అయ్యాయి. అవి కూడా నదిలో సగం వరకే పూర్తయ్యాయి. మిగిలిన సగం ప్రాంతంలో అసలు పనులు మొదలు పెట్టలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే అన్నారం బ్యారేజీకి గేట్లు బిగిస్తుండగా మేడిగడ్డ, సుందిళ్ల వద్ద ఫౌండేషన్ పనుల దశ ఎప్పుడో దాటి పోయింది. -
జనవరి నుంచే నీటి మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: గోదావరిలోని నికర, మిగులు జలాలను వాడుకునేందుకు, దేవాదులకు పుష్కలంగా నీటి లభ్యతను ఉంచే లక్ష్యంతో తుపాకులగూడెం బ్యారేజీ కింద వచ్చే జనవరి నుంచే నీటిని మళ్లించి యాసంగి పంటలకు సాగు నీరిచ్చేలా నీటి పారుదల శాఖ కసరత్తు చేస్తోంది. బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తికాకున్నా, ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం నిర్మించిన కాఫర్‌డ్యామ్ వద్ద షీట్‌ఫైల్స్ ఏర్పాటు చేయడంతో పాటు అదనంగా మరో తాత్కాలిక కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి 72 మీటర్ల నుంచి గోదావరి నీటిని దేవాదులకు తీసుకునే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. వరంగల్, కరీంనగర్‌కు జిల్లాలకు నీటిని అందించే తుపాకులగూడెం ప్రాజెక్టులో 24 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టిపని ఉండగా, 18 లక్షల మేర పూర్తయింది. మరో 13 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని జరగాల్సి ఉండగా, 2వేల క్యూబిక్ మీటర్ల పని మాత్రమే జరిగింది. కాంక్రీట్ పని చేపట్టే సమయానికే గోదావరి వరద 85 మీటర్ల లెవల్లో ప్రవహించడంతో పనులకు ఆటంకం జరిగింది. అయితే దేవాదుల పంపుల ద్వారా తుపాకులగూడెంలో నిల్వ చేసే నీటిని తీసుకోవాలంటే 72 మీటర్ల వద్ద గోదావరి నీటిని ఆపాల్సి ఉంటుంది. ప్రస్తుతం అక్కడ 71 మీటర్ లెవల్లో గోదావరి ప్రవహిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 72 మీటర్ల వద్ద నీటిని ఆపేలా తాత్కాలిక కాఫర్‌డ్యామ్ నిర్మాణం చేయాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. దీనికి అనుబంధంగా ఇప్పటికే ఉన్న కాఫర్ డ్యామ్ వద్ద షీట్‌ఫైల్స్ ఏర్పాటు చేయనుంది. ఈ ఏర్పాటుతో దేవాదులలోని పంపుల ద్వారా కనిష్టంగా 5 నుంచి 6 టీఎంసీల నీటిని తరలించి 200ల నుంచి 300ల చెరువులు నింపి, వాటికింది ఆయకట్టుకు నీరందించనుంది. -
మొదలు కానున్న ‘తుపాకులగూడెం’!
పర్యావరణ క్లియరెన్స్‌లతో బ్యారేజీ నిర్మాణ పనులకు లైన్‌క్లియర్ సాక్షి, హైదరాబాద్: గోదావరిలో నికర, మిగులు జలాలను వాడుకునేందుకు చేపట్టిన కంతనపల్లి ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణ పనులు త్వరలో మొదలు కానున్నాయి. ఈ ప్రాజెక్టు పరిధిలో పర్యావరణ అనుమతులు తెచ్చుకు నేందుకు ఇటీవలే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ బ్యారేజీ పనులకు అను మతిని ఇవ్వడంతో.. పనులు చేపట్టేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇక ప్రాజెక్టు పరిధిలో 233 ఎకరాల భూసేకరణ అవసరం ఉండగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం సేకరించేందుకు అధికారులు సిద్ధమవు తున్నారు. 2.28 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుతో మొత్తం 50 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోసి దేవాదుల, ఎస్సారెస్పీల కింద ఉన్న 6 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ఆ గ్రామాల ముంపు కారణంగానే.. కంతనపల్లి బ్యారేజీ నీటి నిల్వలను 85 మీటర్లకు నిర్ణయించ డంతో ఎఫ్ఆర్ఎల్లోని 100 మీటర్ల పరిధిలో 12 గ్రామాలు ముంపునకు గురవుతుండగా, 11వేల ఎకరాల భూసేకరణ అవసరం. దీంతో ప్రాజెక్టు ప్రతిపాదనను కంతనపల్లి నుంచి మార్చి తుపాకులగూడెం వద్ద నిర్మించాలని నిర్ణయించారు. కంతనపల్లి బ్యారేజీ నిర్మాణానికి రూ.1809 కోట్లతో అంచనా ఉండగా దాన్ని ఓ కాంట్రాక్టు సంస్థ 9% లెస్తో రూ.1643.67 కోట్లకు పనులు దక్కించుకుంది. అనంతరం మారిన ప్రతిపాదన కారణంగా తుపాకులగూడెం బ్యారేజీ అంచనాలను కొత్తగా రూ.2121 కోట్లతో సిద్ధం చేశారు.