వరద నీటితో మునిగిన తుపాకులగూడెం బ్యారేజీ పిల్లర్లు
సాక్షి, భూపాలపల్లి: దేవాదుల పథకానికి గుండెకాయలా భావిస్తున్న తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణ పనులు మళ్లీ మొదలు కావాలంటే మరో రెండు మూడు నెలల సమయం పట్టేలా ఉంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బ్యారేజీ వద్ద పనులు పూర్తిగా నిలిచిపోయాయి. నిర్మాణం సజావుగా సాగడానికి ఏర్పాటు చేసిన కాఫర్‌డ్యాం (మట్టికట్ట) గోదావరి వరద కారణంగా గురువారం రాత్రి తెగిపోయింది. నిర్మాణంలో ఉన్న పిల్లర్లు నీట మునిగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నాయిగూడెం మండల పరిధిలోని తుపాకులగూడెం వద్ద నిర్మాణం చేపడుతున్న బ్యారేజీ పనులకు ఆది నుంచీ అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. నది ప్రవాహాన్ని నిలువరించేందుకు, దేవాదులకు మోటార్ల పంపింగ్‌కు అవసరమైన 71 మీటర్ల నీటి మట్టాన్ని కొనసాగించేందుకు నది ప్రవాహానికి సగభాగం వరకు మట్టితో కాఫర్‌డ్యాం కట్టారు. ప్రస్తుతం గోదావరి వరద తీవ్రతకు కాఫర్‌డ్యాం పూర్తిగా కొట్టుకుపోయింది. బ్యారేజీ నిర్మాణం కోసం గతంలో నిర్మించిన 8 పిల్లర్లు నీటిలో మునిగిపోయాయి. వీటి పక్కనే కొత్తగా మరో 11 పిల్లర్ల నిర్మాణం చేపట్టారు. వీటి రక్షణ కోసం నిర్మించిన కాఫర్‌డ్యాం తెగిపోవడంతో భారీగా వరదనీరు చేరి దాదాపు అన్ని పిల్లర్లు నీటిలో కనిపించకుండా మునిగిపోయాయి.
వృథాగా పోతున్న వరదనీరు..
భారీగా కురుస్తున్న వర్షాలతో గోదావరి వరదనీరు వృథాగా సముద్రం పాలవుతోంది. దేవాదుల ప్రాజెక్ట్‌లో తగినంత నీటిని నిల్వచేసే ఉద్దేశంతో ప్రస్తుతం తుపాకులగూడెం బ్యారేజీని నిర్మిస్తున్నారు. వరుసగా వరదలు రావడం, నిధుల లేమితో నిర్మాణం నెమ్మదిగా సాగుతోంది. తాజాగా తెగిన కాఫర్‌డ్యాం కారణంగా 4,20,000 క్యూసెక్కుల నీరు వృ«థాగా పోయిందని అధికారులు చెబుతున్నారు. 2019 సంవత్సరానికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆలోపు పూర్తయ్యేలా కనిపించడంలేదు.
పనులు నెల రోజులు ఆగినట్టే..
జగదీశ్, ఈఈ, తుపాకులగూడెం బ్యారేజీ కాఫర్‌డ్యామ్‌ను 83 అడుగుల ఎత్తుతో నిర్మించారు. అంతకు మించి వరద రావడంతో గురువారం రాత్రి కొట్టుకుపోయింది. వరద తగ్గిన తర్వాత తిరిగి కాఫర్ డ్యాం నిర్మించి బ్యారేజీ పనులు కొనసాగిస్తాం. కనీసం ముప్పై నుంచి నలభై రోజుల పాటు పనులు నిలిచిపోతాయి.
Comments
Please login to add a commentAdd a comment