మానవతా దృక్పథంతో ఆదుకుందాం | CM YS Jagan Mandate to Collectors and SPs In Review On Godavari Floods | Sakshi
Sakshi News home page

మానవతా దృక్పథంతో ఆదుకుందాం

Published Wed, Aug 19 2020 2:45 AM | Last Updated on Wed, Aug 19 2020 1:10 PM

CM YS Jagan Mandate to Collectors and SPs In Review On Godavari Floods - Sakshi

వరద బాధితులకు తక్షణమే సాయాన్ని అందచేయాలి. ముంపు బాధితుల పట్ల మానవత్వంతో ఉదారంగా వ్యవహరించాలి. మన ఇంట్లో సమస్యగానే భావించి వారికి అండగా నిలవాలి. ఖర్చు విషయంలో ఎక్కడా వెనుకాడవద్దు. సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న వారిని బాగా చూసుకోవాలి. వారి నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాకూడదు. మూగజీవాల కోసం పశువుల దాణా కూడా అందించాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: గోదావరి వరద ముంపు బాధిత కుటుంబాలకు రూ.2,000 చొప్పున ప్రత్యేకంగా ఆర్ధిక సాయాన్ని అందించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు సాధారణంగా ఇచ్చే సాయానికి అదనంగా  ఈ ప్రత్యేక ఆర్థిక సాయాన్ని తక్షణమే అందచేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గోదావరి వరద బాధిత కుటుంబాలకు రూ.2 వేల చొప్పున ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని కలెక్టర్లకు సూచిస్తూ విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. వరద పరిస్థితి, సహాయక చర్యలపై మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ సమీక్షించారు. ముంపు బాధితుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని సీఎం సూచించారు. దీన్ని మన ఇంట్లో సమస్యగానే భావించి వారికి అండగా నిలవాలని, ఖర్చు విషయంలో వెనుకాడవద్దని స్పష్టం చేశారు. ముందు నిర్ణయించిన ప్రకారం స్పందన కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాల్సి ఉన్నా భారీ వర్షాల నేపథ్యంలో దీన్ని మూడు జిల్లాలకే పరిమితం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..

గోదావరి ముంపుపై క్యాంపు కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం జగన్‌ 

► సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్న వారిని బాగా చూసుకోవాలి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన గ్రామాలపై ప్రత్యేకశ్రద్ధ వహించి పూర్తి స్థాయిలో సాయం అందించాలి. అధికారులంతా సహాయ, పునరావాస కార్యక్రమాల్లో నిమగ్నమైనందున వరద పరిస్థితిని పరిశీలించేందుకు నేనే ఏరియల్‌ సర్వే నిర్వహిస్తా. అధికార యంత్రాంగం తమ పనులను యథావిధిగా కొనసాగించాలి. 
► వరద సహాయ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఇతర  ప్రజా ప్రతినిధులను భాగస్వాములుగా చేసి వారు ఇచ్చే సమాచారంపై వెంటనే స్పందించాలి. ఇందుకోసం ఒక అధికారిని నియమించాలి.

ఒక్క ఫిర్యాదూ రాకూడదు..
► సహాయక శిబిరాల్లో ఉన్నవారి నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాకూడదు. శిబిరాల పర్యవేక్షణ బాధ్యతను జేసీకి అప్పగించాలి. శానిటేషన్, ఆహారం, వసతుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. సహాయక చర్యల కోసం అవసరమైతే మరికొంత మంది ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలి. 
► రేషన్‌ సరుకుల సరఫరాలో ఏ లోటూ ఉండకూడదు. మూగజీవాల కోసం పశువుల దాణా కూడా అందించాలి.
తగ్గాక మరో పోరాటం..
► వరద తగ్గిన తర్వాత మరో పోరాటం చేయాల్సి ఉంటుంది. ముమ్మరంగా పారిశుధ్య పనులు నిర్వహించాలి. తాగునీటిని క్లోరినేషన్‌ చేయాలి. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. రోగాలు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి. 
► వరద తగ్గుముఖం పట్టగానే 10 రోజుల్లో పంట నష్టం అంచనాలు పంపించాలి. విద్యుత్, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను త్వరగా పునరుద్ధరించాలి
► భద్రాచలంలో క్రమంగా వరద తగ్గుముఖం పడుతోంది. మంగళవారం రాత్రి కల్లా గోదావరిలో వరద 17 లక్షల క్యూసెక్కులకు తగ్గవచ్చని అంచనాలు వెల్లడిస్తున్నాయి. బుధవారం 12 లక్షల క్యూసెక్కులకు, గురువారం 8 లక్షల క్యూసెక్కులకు తగ్గే అవకాశం ఉంది. 
► సహాయక శిబిరాల్లో కోవిడ్‌ పరీక్షలు చేస్తున్నామని, చింతూరు లాంటి సుదూర లంక గ్రామాల్లో చిక్కుకున్నవారికి పాలు, కూరగాయలు సరఫరా చేస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. 

95 శిబిరాల్లో 14,477 మంది
► తూర్పుగోదావరి జిల్లాలో 95 సహాయక శిబిరాల్లో  14,477 మందికి వసతి కల్పించామని, 105 గ్రామాలలో వరద ప్రభావముందని, 77 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని, ఆయా గ్రామాలలో 30 వేల కుటుంబాలు ఉన్నాయని కలెక్టర్‌ వివరించారు.
► పశ్చిమ గోదావరి జిల్లాలో 26 శిబిరాలు నిర్వహిస్తుండగా 5 వేల మంది వసతి పొందుతున్నారని అధికారులు తెలిపారు. 71 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోగా, ఆయా గ్రామాలలో 10 వేల కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. సహాయ పనుల కోసం లాంచీలు, బోట్లు వినియోగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2 లక్షల మంచినీటి ప్యాకెట్లు ఇచ్చామని, గిరిజనులకు లాంచీలలో కూరగాయలు సరఫరా చేశామని తెలిపారు. సీఎం సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వరద ప్రాంతాల్లో సీఎం ఏరియల్‌ సర్వే
యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలకు ఆదేశం
రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో సమీక్ష

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: వరద ముంపు బాధితులను ఆదుకోవడంలో ఎలాంటి జాప్యం చేయకుండా పక్కా ప్రణాళికతో యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలను చేపట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు.  గోదావరి వరద ముంపు ప్రాంతాలను మంగళవారం ఏరియల్‌ సర్వే ద్వారా సీఎం జగన్‌ పరిశీలించారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని గ్రామాలతోపాటు కోనసీమ లంక ప్రాంతాలను ఏరియల్‌ సర్వేలో వీక్షించారు. అనంతరం రాజమహేంద్రవరం ఎయిర్‌ పోర్టులో కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, ఇతర అధికారులతో సహాయక చర్యలపై సమీక్షించారు.
మంగళవారం తూర్పుగోదావరి జిల్లాలో నీటమునిగిన పంట పొలాలను ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

అందరి ఆరోగ్యాన్ని పరిరక్షించాలి: సీఎం  
► వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తక్షణమే ప్రతి గ్రామంలో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించాలి. శానిటేషన్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనపై ఉంది. వరదలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన పది రోజుల్లోగా రోడ్లు, కమ్యూనికేషన్‌ ఇతర సౌకర్యాలన్నీ అందుబాటులోకి రావాలి.
► విలీన మండలాలు, కోనసీమ లంక ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలనుఈ సందర్భంగా కలెక్టర్‌ సీఎంకు వివరించారు. సీఎం వెంట హోంమంత్రి మేకతోటి సుచరిత, సమాచార, ప్రసార శాఖ మంత్రి పేర్ని నాని, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా, ఎంపీ భరత్‌ తదితరులున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement