
సాక్షి, అమరావతి: గోదావరి వరద పరిస్థితులపై ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద పరిస్థితులపై కలెక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ‘‘అధికారులంతా సహాయ పునరావాస కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. నేను ఏరియల్ సర్వేకు వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను కాబట్టి మీరు సహాయ పునరావాస కార్యక్రమాలను వదిలిరావాల్సిన అవసరంలేదు. అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నానని’ సీఎం జగన్ తెలిపారు.
ముంపు బాధితుల కుటుంబాలకు ఒక్కొంటికి రూ.2 వేల చొప్పున సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. ముంపు బాధితుల పట్ల మానవత్వంతో, ఉదారంగా వ్యవహరించాలని ఆయన కోరారు. మన ఇంట్లో సమస్యగానే భావించి వారికి అండగా నిలవాలని పేర్కొన్నారు. ఖర్చు విషయంలో వెనుకాడ వద్దని సీఎం స్పష్టం చేశారు.
‘‘వరద సహాయ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయండి. వారు ఇస్తున్న క్షేత్రస్థాయి సమాచారంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వారు ఇచ్చే సమాచారం తీసుకోవడంపై ఒక అధికారిని కూడా పెట్టండి. క్షేత్రస్థాయిలో వారు గమనించిన అంశాలను వెంటనే పరిష్కరించండి. ఈ రాత్రికి 17 లక్షల క్యూసెక్కులకు, రేపు ఉదయానికి 12 లక్షల క్యూసెక్కులకు, ఎల్లుండికి 8 లక్షల క్యూసెక్కులకు వరద తగ్గుతుందన్న సమాచారం వస్తోంది. వరద తగ్గుముఖం పట్టగానే 10 రోజుల్లో పంట నష్టం అంచనాలు పంపించాలి. ఎన్యుమరేషన్ 10 రోజుల్లోగా చేయాలి. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని’’ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment