ఒక్క ప్రాణమూ పోవద్దు.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలు | CM KCR Review Meeting on Floods Affected Areas | Sakshi
Sakshi News home page

ఒక్క ప్రాణమూ పోవద్దు.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలు

Published Sun, Jul 24 2022 1:26 AM | Last Updated on Sun, Jul 24 2022 8:16 AM

CM KCR Review Meeting on Floods Affected Areas - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి నది తన జన్మస్థానమైన మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం నుంచి బంగాళాఖాతం వరకు ఉధృతంగా ప్రవహిస్తోందని, ఉప నదులు సైతం భారీ వరదతో పోటెత్తుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ప్రకృతి విపత్తుల నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడం.. ప్రభుత్వ యంత్రాంగానికి పరీక్షా కాలమని స్పష్టం చేశారు. ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై శనివారం ఆయన ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.  

ఎక్కడా వరద నీటిని ఆపొద్దు
‘ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టే ప్రాజెక్టుల గేట్లను ఎత్తి కిందికి విడుదల చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో నీటిని ఆపకూడదు. గేట్లు లేకుండా మత్తడి దూకి ప్రవహించే డిండి, పాకాల, వైరా, పాలేరు రిజర్వాయర్ల విషయంలో మరింత అప్రమ త్తంగా ఉండాలి. అత్యవసర సేవలందించే శాఖలతో పాటు, వానలు వరదల సందర్భంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అన్ని శాఖల అధికారులు వారి వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్రాలను వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదు. ఈ మేరకు సీఎస్‌ తక్షణమే సర్క్యులర్‌ జారీ చేయాలి..’ అని సీఎం సూచించారు. 

ప్రజా ప్రతినిధులూ అప్రమత్తంగా ఉండాలి 
‘వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు కురిసే వానలతో గోదావరి నది ఆదివారం మధ్యాహ్నం నాటికి ఉధృతంగా మారే ప్రమాదముంది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులంతా అప్రమత్తంగా ఉండాలి. అన్నిశాఖల సిబ్బంది, అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మొన్నటి మాదిరిగానే వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అప్రమత్తమై ఉండాలి. ఇప్పటికే నేను అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి తగు సూచనలు ఇచ్చా. ఆగస్టు తొలివారం వరకు భారీ వర్షాలు కొనసాగే సూచనలున్నాయి..’ అని కేసీఆర్‌ తెలిపారు. 

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలి 
‘మిషన్‌ భగీరథ తాగునీరు ఎక్కడా కలుషితం కాకుండా చూసుకోవాలి. వైద్య, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్‌ అండ్‌ బీ, మున్సిపల్, మిషన్‌ భగీరథ తదితర శాఖలు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలి. ఎస్‌ఐ, సీఐలతో పాటు, పోలీసు సిబ్బంది హెడ్‌ క్వార్టర్స్‌ వదిలి వెళ్లకుండా డీజీపీ ఆదేశాలు జారీ చేయాలి..’ అని సీఎం చెప్పారు.

వరదల అంచనాకు సరికొత్త సాఫ్ట్‌వేర్‌ 
వరదల ముందస్తు అంచనాకు, నిర్వహణకు రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ‘ఫ్లడ్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ’ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. వర్షాలకు అనుగుణంగా గోదావరి నదీ ప్రవాహాన్ని, గంట గంటకూ మారే వరద పరిస్థితిని శాటిలైట్‌ ఆధారంగా రికార్డు చేసి విశ్లేషించే విధానాన్ని ఇరిగేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానానికి రూపకల్పన చేయడం దేశంలోనే తొలిసారి అని వివరించగా, సీఎం అభినందించారు.

జీహెచ్‌ఎంసీలో పరిస్థితిపై ఆరా 
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వరద కాల్వల పరిస్థితిని, నగరంతో పాటు జల్పల్లి, పీర్జాదిగూడ వంటి ప్రాంతాల్లో వరదలకు ఉప్పొంగే చెరువుల పరిస్థితిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రాణ నష్టం జరగకుండా, ప్రజలకు తలెత్తే అసౌకర్యాలను వీలైనంతగా తగ్గించే విధంగా చర్యలు తీసుకోవడంలోనే ప్రభుత్వ యంత్రాంగం ప్రతిభ ఇమిడి ఉంటుందని సీఎం పేర్కొన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తతపై, అధికారులు తీసుకున్న చర్యలపై ఆరా తీశారు.

భద్రాచలంలో బాగా పనిచేశారు 
భద్రాచలం వరద ముంపు ప్రాంతాల్లో వైద్యాధికారులు, సిబ్బంది బాగా పనిచేశారని, ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ సహా అధికారులను సీఎం కేసీఆర్‌ అభినందించారు. డెంగ్యూ ప్రతి ఐదేండ్లకోసారి సైకిల్‌గా వస్తోందని, ఇలాంటి వ్యాధులను ముందస్తుగానే గుర్తించి, తగు చర్యలు తీసుకోవడం ద్వారా అరికట్టాలని మంత్రిని, వైద్యాధికారులను ఆదేశించారు. మున్సిపల్‌ కమిషనర్లు, జెడ్పీ సీఈవోలు, ఎంపీడీఓలు, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్‌ తదితర శాఖల అధికారులు, ఈ రెండు రోజులు సెలవులు అని అలసత్వంగా వ్యవహరించవద్దని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వానలు వరదల కారణంగా కొట్టుకుపోతున్న రోడ్లను, రవాణా వ్యవస్థను ఎప్పటికప్పుడు పునరుద్ధరించాలని ఆదేశించారు. హైదరాబాద్‌ సహా రాష్ట్రం వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement