
సాక్షి, హైదరాబాద్: గోదావరిలోని నికర, మిగులు జలాలను వాడుకునేందుకు, దేవాదులకు పుష్కలంగా నీటి లభ్యతను ఉంచే లక్ష్యంతో తుపాకులగూడెం బ్యారేజీ కింద వచ్చే జనవరి నుంచే నీటిని మళ్లించి యాసంగి పంటలకు సాగు నీరిచ్చేలా నీటి పారుదల శాఖ కసరత్తు చేస్తోంది. బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తికాకున్నా, ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం నిర్మించిన కాఫర్‌డ్యామ్ వద్ద షీట్‌ఫైల్స్ ఏర్పాటు చేయడంతో పాటు అదనంగా మరో తాత్కాలిక కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి 72 మీటర్ల నుంచి గోదావరి నీటిని దేవాదులకు తీసుకునే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. వరంగల్, కరీంనగర్‌కు జిల్లాలకు నీటిని అందించే తుపాకులగూడెం ప్రాజెక్టులో 24 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టిపని ఉండగా, 18 లక్షల మేర పూర్తయింది.
మరో 13 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని జరగాల్సి ఉండగా, 2వేల క్యూబిక్ మీటర్ల పని మాత్రమే జరిగింది. కాంక్రీట్ పని చేపట్టే సమయానికే గోదావరి వరద 85 మీటర్ల లెవల్‌లో ప్రవహించడంతో పనులకు ఆటంకం జరిగింది. అయితే దేవాదుల పంపుల ద్వారా తుపాకులగూడెంలో నిల్వ చేసే నీటిని తీసుకోవాలంటే 72 మీటర్ల వద్ద గోదావరి నీటిని ఆపాల్సి ఉంటుంది. ప్రస్తుతం అక్కడ 71 మీటర్ లెవల్‌లో గోదావరి ప్రవహిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 72 మీటర్ల వద్ద నీటిని ఆపేలా తాత్కాలిక కాఫర్‌డ్యామ్ నిర్మాణం చేయాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. దీనికి అనుబంధంగా ఇప్పటికే ఉన్న కాఫర్ డ్యామ్ వద్ద షీట్‌ఫైల్స్ ఏర్పాటు చేయనుంది. ఈ ఏర్పాటుతో దేవాదులలోని పంపుల ద్వారా కనిష్టంగా 5 నుంచి 6 టీఎంసీల నీటిని తరలించి 200ల నుంచి 300ల చెరువులు నింపి, వాటికింది ఆయకట్టుకు నీరందించనుంది.
Comments
Please login to add a commentAdd a comment