రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 2006 పర్యావరణ ప్రభావ అంచనా నిబంధనలు వర్తించవు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదు. అదనపు ఆయకట్టు ఏర్పాటు కావడం లేదు. ఇది ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు. విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు అంతకన్నా కాదు. జలాశయం, విద్యుదుత్పత్తి ప్రాజెక్టును విస్తరించడం లేదా ఆధునీకరించడం చేయడం లేదు. గ్రావిటీ నుంచి పంపింగ్‌కు మారడాన్ని పర్యావరణ అనుమతుల మార్పుగా పరిగణించడం సాధ్యం కాదు. తనకు కేటాయించిన నీటినే ఆంధ్రప్రదేశ్ వాడుకుంటున్నంత వరకు పర్యావరణ అనుమతుల ప్రసక్తే తలెత్తదు
–ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్ర పర్యావరణ శాఖ
సాక్షి, అమరావతి: పర్యావరణ ప్రభావ అంచనా(ఈఐఏ) నోటిఫికేషన్ పరిధిలోకి ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ రాదని, అందువల్ల దీనికి పర్యావరణ అనుమతులేవీ అవసరం లేదని కేంద్ర అటవీ, పర్యావరణశాఖ శుక్రవారం జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్‌జీటీ)కు నివేదించింది. రాయలసీమ ఎత్తిపోతల కొత్త ప్రాజెక్టు కాదని తేల్చిచెప్పింది. నిపుణుల కమిటీ కూడా ఇదే అంశంపై ముందస్తు పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఎన్‌జీటీకి నివేదికివ్వడం తెలిసిందే. తాజాగా ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర పర్యావరణశాఖ తన వైఖరిని స్పష్టంగా తెలియచేసింది.
అన్ని విషయాలు పరిగణించాకే...
► తెలుగుగంగ ప్రాజెక్టు, శ్రీశైలం కుడికాలువలకు 1994 ఈఐఏ నోటిఫికేషన్ ప్రకారం పర్యావరణ అనుమతులిచ్చారు. ఆ అనుమతుల్లో నీటి సరఫరాను పంపింగ్ ద్వారా చేస్తారా? గ్రావిటీ ద్వారా చేస్తారా? అనే ప్రస్తావన లేదు. గాలేరు నగరి సుజల స్రవంతి ఈఐఏ పర్యావరణ అనుమతుల్లో 38 టీఎంసీల నీటి సరఫరా ప్రస్తావన ఉంది.
► తెలుగుగంగ, శ్రీశైలం కుడికాలువ, గాలేరు నగరి సుజల స్రవంతి వేర్వేరు సమయాల్లో ఏర్పాటయ్యాయి. పర్యావరణ, అటవీశాఖ నుంచి వేర్వేరుగా అనుమతులు తీసుకున్నారు.
► ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రివర్ వ్యాలీ, హైడ్రో ప్రాజెక్ట్ నిపుణుల కమిటీ జూలై 29న సమావేశమై చర్చించింది. 2006 ఈఐఏ నోటిఫికేషన్ ప్రకారం చర్చలు జరిగాయి.
► అన్ని విషయాల్ని పరిగణనలోకి తీసుకున్నాక ప్రాథమిక ఆధారాలనుబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ముందస్తు పర్యావరణ అనుమతులు అక్కర్లేదని కమిటీ స్పష్టంగా చెప్పింది.
తెలంగాణ సర్కారు అభ్యంతరం..
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ముందస్తు పర్యావరణ అనుమతులు అవసరం లేదంటూ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై తెలంగాణ సర్కారు అభ్యంతరం తెలిపింది. ఈ పథకానికి పర్యావరణ అనుమతులు లేవని, దీనివల్ల పలు ప్రాజెక్టుల ఆయకట్టుతోపాటు హైదరాబాద్‌కు తాగునీటి సమస్య ఏర్పడుతుందంటూ తెలంగాణ, నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ఎన్‌జీటీలో పిటిషన్ వేశారు. దీన్ని హరిత ట్రిబ్యునల్ శుక్రవారం మరోసారి విచారించింది. ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్.వెంకటరమణి, న్యాయవాదులు దొంతిరెడ్డి మాధురిరెడ్డి, తుషారా జేమ్స్‌లు విచారణకు హాజరవగా, తెలంగాణ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు, స్పెషల్ జీపీ ఎ.సంజీవ్‌కుమార్, పిటిషనర్ తరఫున కె.శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. దీనిపై తదుపరి విచారణను ట్రిబ్యునల్ సెప్టెంబర్ 3కు వాయిదా వేసింది. అదేరోజు ఏపీ వాదన వింటామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment