సాక్షి, న్యూఢిల్లీ: ఘన, ద్రవ వ్యర్థాలు శుద్ధిచేయడంలో విఫలమైందంటూ తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ ప్రధాన ధర్మాసనం రూ.3,825 కోట్ల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. వ్యర్థాల నిర్వహణలో గతంలో జారీ చేసిన మార్గదర్శకాలు అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 1996లో దేశంలోని పలు మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య వ్యర్థాల నిర్వహణ సరిగాలేదంటూ పర్యావరణ సురక్షా స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్జీటీకి బదిలీ చేసింది. 351 నదీ పరీవాహక ప్రాంతాలు, 124 నగరాలు, 100 కాలుష్య కారక పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య కారకాలు, ఇసుక అక్రమ మైనింగ్‌లపై చర్యలు తీసుకోవాలని సంస్థ కోరింది.
జస్టిస్ ఆదర్శ కుమార్ గోయల్ నేతృత్వంలోని ఎన్జీటీ ప్రధాన ధర్మాసనం ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేయడంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను వివరణ కోరింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణకు సంతృప్తి చెందని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘1824 ఎంఎల్‌డీ లిక్విడ్ వేస్ట్/సీవేజీ నిర్వహణలో అంతరాలకు గానూ రూ.3,648 కోట్లు, సాలిడ్ వేస్ట్ నిర్వహణలో వైఫల్యానికి గానూ రూ.177 కోట్లు కలిపి మొత్తం రూ.3,825 కోట్లు పరిహారంగా చెల్లించాలి. రెండు నెలల్లో ప్రత్యేక ఖాతాలో ఆ మొత్తం డిపాజిట్ చేయాలి.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల ప్రకారం పునరుద్ధరణ చర్యలకు వినియోగించాలి. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వాముల నుంచి నిధుల సేకరణ చేసుకోవచ్చు. పునరుద్ధరణ ప్రణాళికలు అన్ని జిల్లాలు/నగరాలు/పట్టణాలు/ గ్రామాల్లో మరింత సమయానుకూలంగా ఒకేసారి అమలు చేయాలి. ఉల్లంఘనలు కొనసాగితే అదనపు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అమలు పర్యవేక్షణ నిమిత్తం సాంకేతిక నిపుణుల బృందంతో సీనియర్ నోడల్ స్థాయి సెక్రటరీని వెంటనే నియమించాలి. ఆరునెలల తర్వాత పురోగతిని ఎన్జీటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ ద్వారా పంపాలి. సీపీసీబీ ప్రత్యేకంగా నివేదిక ఇవ్వాలి’’ అని ఎన్జీటీ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి: జేఈఈ పేపర్ లీక్ కేసు: రష్యన్ వ్యక్తి అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment