సాక్షి, అమరావతి: ఎటువంటి కాలుష్యం లేకుండా.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం ద్వారా పర్యావరణహితంగా వైఎస్సార్ స్టీల్ ప్లాంట్‌ను నిర్మించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ ప్లాంట్ నిర్మాణానికి ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మాణ పనులు చేపట్టడానికి అవసరమైన సీఎఫ్‌ఈ (కన్సంట్ ఫర్ ఎస్టాబ్లిష్‌మెంట్)ను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మంజూరు చేసింది. సీఎఫ్‌ఈ సర్టిఫికెట్‌ను వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్‌కు జారీ చేసినట్లు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) చైర్మన్ అశ్వినీకుమార్ పరిడా గురువారం తెలిపారు.
వెనుకబడిన రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ఈ ప్లాంట్ ఏర్పాటు లక్ష్యం. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు సమీపంలో ఈ స్టీల్ ప్లాంట్‌కు 2019 డిసెంబర్‌లో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 3,591 ఎకరాల్లో రూ.16,986 కోట్లతో అంచనాతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు పరిడా పేర్కొన్నారు. ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన ముడి ఇనుమును సరఫరా చేయడానికి జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ)తో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టడానికి ఎస్సార్ స్టీల్ ముందుకు వచ్చింది.
కాలుష్యాన్ని తగ్గించే పరిజ్ఞానం
పర్యావరణహితంగా వైఎస్సార్ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాజెక్టస్ డైరెక్టర్ బలరామ్ ‘సాక్షి’కి వివరించారు. సాధారణంగా స్టీల్ ప్లాంట్‌ల్లో వాయుకాలుష్యం 50 ఎంజీ/ఎన్‌ఎం3 వరకు అనుమతిస్తారని తెలిపారు. అయితే అత్యాధునిక పరిజ్ఞానం వినియోగించడం ద్వారా దీన్ని 30 ఎంజీ/ఎన్‌ఎం3కే పరిమితం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిశ్రమ వ్యర్థాలు ఒక చుక్క కూడా బయటకు వెళ్లకుండా శుద్ధి చేసి పూర్తిగా వినియోగించుకుంటామని చెప్పారు. ప్లాంట్ దక్షిణం వైపు రిజర్వ్ ఫారెస్ట్ ఉందని.. దానిపై కాలుష్యం ప్రభావం పడకుండా అర కిలోమీటరు వరకు చెట్లను పెంచుతామన్నారు.
ప్రధాన ప్లాంట్ చుట్టూ 30 నుంచి 50 మీటర్ల వరకు పచ్చదనాన్ని పెంపొందిస్తామని తెలిపారు. ఈ ప్రతిపాదనను పరీడా నేతృత్వంలోని సీఎఫ్‌ఈ కమిటీకి వివరించగా.. సానుకూలంగా స్పందించి అనుమతులు మంజూరు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం ప్రధాన ప్లాంట్‌కు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్ట్ సిద్ధమవుతోందన్నారు. త్వరలోనే ఎస్సార్ స్టీల్‌తో ఒప్పందం చేసుకొని నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు.
పర్యావరణహితంగా ‘వైఎస్సార్ స్టీల్’
Published Fri, Oct 29 2021 4:31 AM | Last Updated on Fri, Oct 29 2021 4:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment