
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పరిశీలించేందుకు సంయుక్త కమిటీని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ చెన్నై ప్రాంతీయ కార్యాలయ సీనియర్ అధికారి లేదా హైదరాబాద్ అధికారి, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ శాస్త్రవేత్త, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్, జియాలజీ మైనింగ్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ లేదా డైరెక్టర్ సూచించిన సాయిల్ టెక్నాలజీ సీనియర్ అధికారి, నేషనల్ ఎన్విరానిమెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ శాస్త్రవేత్తలను ఇందులో సభ్యులుగా పేర్కొంది. ఉల్లంఘనలు గుర్తిస్తే కేంద్ర జల సంఘం సీనియర్ అధికారిని అదనపు సభ్యుడిగా చేర్చనున్నట్లు ఎన్జీటీ తెలిపింది.
తాగునీటి ప్రాజెక్టు అయినా.. సాగు కోసం తెలంగాణ ప్రభుత్వం రిజర్వాయర్లు నిర్మిస్తూ నిబంధనలు ఉల్లంఘించిందంటూ మరో పిటిషన్‌లో ఆరోపించిన విషయాన్ని ఎన్జీటీ ప్రస్తావించింది. ఈ అంశంపై కూడా కమిటీ పరిశీలించాలని సూచించింది. ‘తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ చట్టాల ఉల్లంఘన చేసిందా? పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ) అధ్యయనం చేయకుండా, పర్యావరణ నిర్వహణ ప్రణాళిక లేకుండా, ఈఐఏ నోటిఫికేషన్, 2006 నిబంధనలను ఉల్లంఘించిందా? పర్యావరణ నష్టం ఎంత? తాగునీటి కోసమే చేపడుతున్నారా లేదా సాగునీటికి కూడా విస్తరించే అవకాశం ఉందా? ప్రాజెక్టు నిమిత్తం ప్రజలను తరలించారా?’అనే అంశాలు కమిటీ పరిశీలించాలని ఎన్జీటీ ఆదేశించింది. తనిఖీ కోసం మహబూబ్‌నగర్ జిల్లా కాకుండా ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తే ఆయా జిల్లాల కలెక్టర్లను కో–ఆప్ట్ సభ్యులుగా చేర్చుకోవచ్చని తెలిపింది. ఆగస్టు 27 లోగా కమిటీ నివేదిక ఇవ్వాలని పేర్కొంది. కడప జిల్లాకు చెందిన డి.చంద్రమౌళీశ్వరరెడ్డి సహా 9 మంది రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఈనెల 15న జస్టిస్ కె.రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్య గోపాల్ విచారించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment