సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఊరట లభించింది. రంగారెడ్డి జిల్లాలో జీవో 111ను ఉల్లంఘించి ఫాంహౌజ్ నిర్మాణం చేశారనే ఆరోపణలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపివేసింది. ఈ నెల 5న ఎన్జీటీ ఇచ్చిన నోటీసులను, కమిటీ ఏర్పాటుకు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. రిట్‌ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావుల ధర్మాసనం బుధవారం స్టే ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు ప్రతివాదులైన మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. ఆధారాలు లేకుండా రాజకీయ కక్షతో రేవంత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేస్తే ఎన్జీటీ నోటీసులివ్వడం రాజ్యాంగ వ్యతిరేకమని కేటీఆర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదించారు. ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయిందని, దీంతో రేవంత్ తన ఉనికి కోసం పిటిషనర్‌కు సంబంధం లేని నిర్మాణంపై ఎన్జీటీలో కేసు వేశారని చెప్పారు. జీవో 111ను ఉల్లంఘించి నిర్మాణం జరిగి ఉంటే ఆరు నెలల్లోగా ఎన్జీటీని ఆశ్రయించాలన్న చట్ట నిబంధనకు వ్యతిరేకంగా రేవంత్ కేసు వేశారని, ఈ విషయాలను ఎన్జీటీ పట్టించుకోకుండానే పిటిషనర్‌కు నోటీసు జారీ చేసి కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులిచ్చిందన్నారు.
తప్పుడు ఆరోపణలు చేసిన రేవంత్‌పై నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని, బెయిల్‌పై ఆయన విడుదలయ్యారని తెలిపారు. ఏనాడో జరిగిన నిర్మాణాలపై రేవంత్ తప్పుడు ఫిర్యాదు చేశారని, ఈ విషయంపై గూగుల్ మ్యాప్‌లను కూడా సమర్పించారని, వీటిని ఎన్జీటీ పరిగణనలోకి తీసుకోకుండానే ఉత్తర్వులిచ్చిందని పేర్కొన్నారు. పిటిషనరే నిర్మాణం చేసినట్లుగా ఆధారాలు లేకుండా రేవంత్ ఫిర్యాదు చేస్తే దానిపై ఎన్జీటీ ఉత్తర్వులు ఇవ్వడం చట్ట వ్యతిరేకమన్నారు. ఇదిలాఉండగా తనను ప్రతివాదిగా చేయకుండా ఎన్జీటీ ఉత్తర్వులు ఇవ్వడం చెల్ల దని, వాటిని కొట్టేయాలని ఫాంహౌజ్ యజమాని బి.ప్రదీప్‌రెడ్డి కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఫాంహౌజ్ ప్రదీప్‌రెడ్డిదని, ఆయనకు తెలియకుండానే ఎన్టీటీ ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదని సీనియర్ న్యాయవాది శ్రీరాం రఘురాం వాదించారు. వాదనల తర్వాత ఎన్జీటీ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది.
ఎన్జీటీ ఆదేశాల అమలు నిలిపివేత
Published Thu, Jun 11 2020 5:22 AM | Last Updated on Thu, Jun 11 2020 7:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment