సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడలోని ఫాంహౌస్ మంత్రి కె.తారకరామారావుది కాదని, అయినా ఆయనే యజ మాని అంటూ తప్పుడు సమాచారంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ)లో పిటిషన్ దాఖలు చేశారని కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి హైకోర్టులో నివేదించారు. జీవో 111 పరిధిలోని జన్వాడ ఫాంహౌస్‌లో అక్రమనిర్మాణాలు చేపట్టారంటూ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఎన్‌జీటీ చెన్నై బెంచ్‌లో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలంటూ కేటీఆర్, ఫాంహౌస్ యజమాని ప్రదీప్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్‌లను న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది.
ఏవైనా నిర్మాణాలు చేపట్టినా 8 నెలల్లోగా ఎన్‌జీటీకి ఫిర్యాదు చేయాల్సి ఉందని, దాదాపు ఆరేళ్ల తర్వాత రేవంత్‌రెడ్డి ఎన్‌జీటీని ఆశ్రయించారని, కాలాతీతమైన తర్వాత దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించే పరిధి ఎన్‌జీటీకి లేదన్నారు. ఫాంహౌస్ యజమాని ప్రదీప్‌రెడ్డిని ప్రతివాదిగా చేర్చకుండా ఎన్‌జీటీలో పిటిషన్ దాఖలు చేశారని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరఘురాం వాదనలు వినిపించారు.
జలాశయాలను కాపాడేందుకే...
హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల క్యాచ్‌మెంట్ ఏరియాలో నిర్మాణాలు చేపట్టకుండా జీవో 111 తీసుకొచ్చారని రేవంత్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్‌ఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. 2020 ఫిబ్రవరిలో జన్వాడ ఫాంహౌస్‌లో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లుగా తెలిసిందని, పరిశీలించేందుకు అక్కడికి వెళ్తే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని తెలిపారు. జీవో 111 పరిధిలో అక్రమ నిర్మాణాలు జరగకుండా జలాశయాలను కాపాడేందుకే రేవంత్‌రెడ్డి ఎన్‌జీటీలో పిటిషన్ దాఖలు చేశారన్నారు.
ఎన్‌జీటీ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించారు. అయితే, ఎన్‌జీటీ ఉత్తర్వులపై రివ్యూ చేసే అధికారం ఈ కోర్టుకు ఉందని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ జె.రాంచందర్‌రావు నివేదించారు. సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. ఇదిలా ఉండగా రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఎన్‌జీటీ జన్వాడ ఫాంహౌస్ పరిధిలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయో లేదో పరిశీలించి నివేదిక సమర్పించేందుకు నిపుణులతో కమిటీ వేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఎన్‌జీటీ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment