సాక్షి, హైదరాబాద్: ఫాంహౌస్ వ్యవహారంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు బుధవారం స్టే విధించింది. జీవో 111కు విరుద్ధంగా హైదరాబాద్ శివార్లలోని జన్వాడ ప్రాంతంలో మంత్రి కేటీఆర్ ఫాంహౌస్ నిర్మించారని ఆరోపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దాఖలు చేయడంతో కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా జీవో 111 ఉల్లంఘనలపై తేల్చేందుకు నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. (రేవంత్‌రెడ్డికి పోసాని హితవు)
అయితే ఎన్జీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా ఆ వివాదస్పద ఫాంహౌస్ తనది కాదని స్పష్టం చేస్తూ హైకోర్టుకు నివేదిక అందించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం రేవంత్ పిటిషన్‌పై ఎన్జీటీ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఇక అంతకుముందు ఎన్జీటీ జారీ చేసిన నోటీసులపై కేటీఆర్ ఆసహనం వ్యక్తం చేశారు. ఎన్జీటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకందని, ఇందులో రాజకీయ కక్షపూరిత పిటిషన్ అని ఆరోపించారు. నిజానిజాలు పరిశీలించకుండానే ఎన్జీటీ ఉత్తర్వులు జారీచేసిందని, దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తానని కేటీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. (పదవికి దూరంగా ఉండి నిరూపించుకోలేరా?)
ఇక జీవో 111కు విరుద్దంగా నగర శివార్లలో కేటీఆర్ ఫాంహౌస్ కట్టారని రేవంత్ రెడ్డి ఎన్టీటీని ఆశ్రయించారు. జస్టిస్ రామకృష్ణన్, సభ్య నిపుణుడు సైబల్ దాస్ గుప్తాతో కూడిన చెన్నై బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించింది. పిటిషనర్ న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. జీవోలు, చట్టాలు అమలు చేయాల్సిన మంత్రే వాటిని ఉల్లంఘించారని, జీవో 111 ఉల్లంఘనలపై గతంలో ఎన్జీటీ ఇచ్చిన తీర్పు అమలు కావడం లేదని నివేదించారు. నాలాను కబ్జా చేసి రోడ్డు నిర్మించారని చెప్పారు. దీనిపై ఎన్జీటీ స్పందిస్తూ.. అక్రమ నిర్మాణం, జీవో 111 ఉల్లంఘనలపై తేల్చేందుకు నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. (వివాదాస్పద ఫాంహౌస్‌పై నిజ నిర్ధారణ కమిటీ)
కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, హెచ్‌ఎండీఏ ప్రతినిధులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వెల్లడించింది. కట్టడం అక్రమమైతే పర్యావరణ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలు, వసూలు చేయాల్సిన పరిహారం అంచనా వేసి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 2018లో జీవో 111 ఉల్లంఘనలపై ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వుల అమలు నివేదికను కూడా ఇవ్వాలని ఎన్జీటీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment