రాజధాని పనులు కోసం నిర్మాణ సంస్థలు నిల్వ ఉంచిన ఇసుక గుట్టలు
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనులు పొందిన పలు బడా నిర్మాణ సంస్థలు చిల్లర పనులు చేస్తున్నాయి. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) తీర్పుతో ఏర్పడిన ఇసుక కొరతను ఇవి సొమ్ము చేసుకుంటున్నాయి. రాజధాని పనులకు ప్రభుత్వం నుంచి ఉచితంగా పొందిన ఇసుకను ఈ సంస్థలు ప్రస్తుత కొరతను ఆసరాగా చేసుకుని తమ వద్ద పెద్ద మొత్తంలో ఉన్న ఇసుకను ఇతర సంస్థలకు అధిక రేట్లకు అమ్ముకుంటున్నాయి. ట్రాక్టరు ఇసుక విజయవాడ, గుంటూరులో రూ.3 వేల నుంచి రూ.5 వేలకు, ఇతర ప్రాంతాలకు లారీ ఇసుకను రూ.20 నుంచి రూ.25 వేలకు (రవాణా చార్జీలతో కలిపి) అమ్ముకుంటున్నాయి. పదిరోజులుగా ఈ నిర్మాణ సంస్థల్లో కొన్ని తమ ప్రధాన పనులను నిలిపివేసి ఇతర నిర్మాణ సంస్థలకు ఇసుక అమ్ముకునే పనిలో పడ్డాయి. దీంతో పదిహేను రోజుల క్రితం వరకు 60–70 అడుగుల ఎత్తులో ఉన్న ఇసుక నిల్వలు ఏ పనులు చేయకుండానే రోజురోజుకీ తరుగుతున్నాయి. దీనిపై అధికారులెవరూ ప్రశ్నించకపోవడంతో విచ్చలవిడిగా ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయి.
ఇష్టారాజ్యంగా తవ్వకాలు
నిజానికి రాజధాని పరిధిలో నిర్మాణ పనులు పొందిన పలు సంస్థలకు కృష్ణా, గుంటూరు పరిధిలోని నదీ ప్రవాహ ప్రాంతాల్లో ఉచితంగా ఇసుక తవ్వుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ సంస్థలన్నీ దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన పనులు పొందాయి. వాస్తవంగా ఆ పనులకు అంచనాలు వేసిన సమయంలో ఇసుక ఎంత మేరకు అవసరం అవుతుందో అంతే ఇసుకను ఆ సంస్థలు తీసుకోవాలి. అయితే, ఇవన్నీ ప్రభుత్వ అనుకూల సంస్థలు కావడంతో అవి ఎంత ఇసుక తవ్వుతున్నాయి.. పనులకు ఎంత వాడుతున్నాయి.. ఇతర సంస్థలకు ఎంత అమ్ముకుంటున్నాయి అనే విషయాలను అధికారులు పట్టించుకోలేదు. గతంలోనూ ఇసుక కొరత ఏర్పడినప్పుడు కొన్ని సంస్థలు రెడీమిక్స్ ప్లాంట్లకు అమ్ముకున్నాయి. ఇప్పుడు అనేక సంస్థలు ఇసుకను ఇష్టారీతిన అమ్ముకుంటున్నాయి. ఆ సంస్థలకు ప్రభుత్వం పెద్దఎత్తున బిల్లులు బకాయి పడటంతో కొన్ని సంస్థలు నామమాత్రంగా పనులు చేస్తుంటే మరికొన్ని పూర్తిగా పనులు నిలిపివేసి, బ్లాక్‌లో ఇసుక అమ్ముకునే పనిలో పడ్డాయి.
ఫ్రీగా పొంది అధిక రేట్లకు అమ్మకాలు
ఇదిలా ఉంటే.. కృష్ణా నదిలో విచ్చలవిడిగా ఇసుక తోడేయడం వలన పర్యావరణం దెబ్బతింటుందని ఈ ప్రాంతానికి చెందిన కొందరు పర్యావరణ ప్రేమికులు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ)ను ఆశ్రయించారు. దీంతో నెల రోజుల క్రితం నదిలో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ఎన్‌జీటీ తీర్పునిచ్చింది. గుంటూరు జిల్లాలోని 37 రీచ్‌లను, కృష్ణా జిల్లాలోని సూరాయిపాలెం, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం రీచ్‌లలో ఇసుక తవ్వకాలను నిలిపివేశారు. మరోవైపు.. ఇసుక కొరత ఉన్నప్పటికీ కొన్ని నిర్మాణ సంస్థలు రాజధాని పనులు పొందిన పలు నిర్మాణ సంస్థల నుంచి అధిక ధరకు ఇసుకను కొని పనులను కొనసాగిస్తున్నాయి. కాగా, ఇసుక అక్రమ అమ్మకాలు తమ ద్టృష్టికి రాలేదని కృష్ణా, గుంటూరు జిల్లాల మైనింగ్ అధికారులు చెప్పారు. రాజధాని పనులను పొందిన సంస్థలపై పర్యవేక్షణ తమ పరిధిలోని అంశం కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment