
సాక్షి, న్యూఢిల్లీ : తూత్తుకుడి స్టెరిలైట్ పరిశ్రమను తిరిగి ప్రారంభించడాన్ని అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న ‘స్టెరిలైట్’రాగి ప్లాంట్‌ను శాశ్వతంగా మూసేయాలని ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి ఆదేశాలు జారీ చేయగా.. వేదాంత గ్రూప్ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన ఎన్జీటీ తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలను తప్పుబట్టింది. మళ్లీ స్టెరిలైట్ కర్మాగారాన్ని తెరువాలంటూ గత డిసెంబర్ 15 ఆదేశాలు ఇచ్చింది. కంపెనీ లైసెన్స్‌ను పునరుద్ధరించాలని, మూడు వారాల్లో కర్మాగారాన్ని పునఃప్రారంభించేందుకు వీలుగా అనుమతులన్నీ జారీచేయాలని తమిళనాడు కాలుష్య నియంత్రణ సంస్థకు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీచేసింది. తాజాగా ఎన్జీటీ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం తిరస్కరించడంతో పర్యావరణ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర కాలుష్యానికి కారణమవుతున్న ఈ కంపెనీని మూసివేయాలంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా.. పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment