
న్యూఢిల్లీ: పర్యావరణానికి హాని కలిగించినందుకు జర్మనీ వాహన దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్‌కు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) రూ.500 కోట్ల జరిమానా వడ్డించింది. ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ తన డీజిల్ కార్లలో చీట్ డివైస్‌ను ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి హాని కలిగించిందని ఎన్‌జీటీ పేర్కొంది. పర్యావరణ పరీక్షలను తప్పుదోవ పట్టించే సాఫ్ట్‌వేర్‌ను ఫోక్స్‌వ్యాగన్ తన కార్లలో వినియోగించిందని, ఈ కార్ల అమ్మకాలను భారత్‌లో నిషేధించాలంటూ ఐలావాడి అనే స్కూల్ టీచర్, మరికొందరు ఫిర్యాదు చేశారు.
రెండు నెలల్లో జరిమానా డిపాజిట్ చేయండి
రూ.500 కోట్ల జరిమానాను రెండు నెలల్లో డిపాజిట్ చేయాలని జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ అధ్యక్షతన గల ఎన్‌జీటీ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని నేషనల్ క్యాపిటల్ రీజియన్‌తో పాటు అధికంగా కాలుష్యానికి గురైన ప్రాంతాల్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు ఖర్చు చేయాలని ఎన్‌జీటీ పేర్కొంది. కాగా తాము బీఎస్ ఫోర్ నిబంధనలను ఉల్లంఘించలేదని ఫోక్స్‌వ్యాగన్ పేర్కొంది. రహదారి పరీక్షలు ఆధారంగా తనిఖీలు జరిపారని, ఈ రహదారి పరీక్షలకు నిర్దేశిత ప్రమాణాలు లేవని వివరించింది.