బెంగళూరు: బెళెకెరి నౌకాశ్రయంలోని ఇనుప ఖనిజం దొంగతనం, అక్రమ ఎగుమతి కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ కృష్ణ సాయిల్‌కు ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.6 కోట్ల భారీ జరిమానా విధించింది. ప్రజాప్రతినిధులపై కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం సాయిల్‌తోపాటు ఆరుగురికి జైలు శిక్ష, భారీగా జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. శ్రీ మల్లికార్జున షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా ఉన్న సాయిల్(58) తాజా పరిణామంతో ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యే అవకాశముంది.
బళ్లారి గనిలో అక్రమంగా వెలికి తీసిన ఇనుప ఖనిజాన్ని 2010లో బెళెకెరి పోర్టులో అధికారులు నిల్వ ఉంచారు. దీనిపై కన్నేసిన సాయిల్, మరికొందరు కోట్లాది రూపాయల ఖనిజాన్ని దొంగచాటుగా చైనాకు ఎగుమతి చేశారు. తాజాగా దోషులుగా తేలిన వారిలో ప్రైవేట్ కంపెనీల నిర్వాహకులతోపాటు పోర్టుల డిప్యూటీ కన్జర్వేటర్ మహేశ్ జె బిలియె కూడా ఉన్నారు. ఈ నెల 24వ తేదీన తీర్పు వెలువడిన వెంటనే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు సాయిల్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment