iron ore case
-
ఇనుప ఖనిజం అక్రమ ఎగుమతి కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఏడేళ్ల జైలు
బెంగళూరు: బెళెకెరి నౌకాశ్రయంలోని ఇనుప ఖనిజం దొంగతనం, అక్రమ ఎగుమతి కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ కృష్ణ సాయిల్కు ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.6 కోట్ల భారీ జరిమానా విధించింది. ప్రజాప్రతినిధులపై కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం సాయిల్తోపాటు ఆరుగురికి జైలు శిక్ష, భారీగా జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. శ్రీ మల్లికార్జున షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా ఉన్న సాయిల్(58) తాజా పరిణామంతో ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యే అవకాశముంది. బళ్లారి గనిలో అక్రమంగా వెలికి తీసిన ఇనుప ఖనిజాన్ని 2010లో బెళెకెరి పోర్టులో అధికారులు నిల్వ ఉంచారు. దీనిపై కన్నేసిన సాయిల్, మరికొందరు కోట్లాది రూపాయల ఖనిజాన్ని దొంగచాటుగా చైనాకు ఎగుమతి చేశారు. తాజాగా దోషులుగా తేలిన వారిలో ప్రైవేట్ కంపెనీల నిర్వాహకులతోపాటు పోర్టుల డిప్యూటీ కన్జర్వేటర్ మహేశ్ జె బిలియె కూడా ఉన్నారు. ఈ నెల 24వ తేదీన తీర్పు వెలువడిన వెంటనే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు సాయిల్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
కంప్లి ఎమ్మెల్యే సురేష్ బాబు అరెస్టు
కర్ణాటకలోని కంప్లి ఎమ్మెల్యే, బీఎస్సార్ పార్టీ అధ్యక్షుడు బి.శ్రీరాములు మేనల్లుడు సురేష్ బాబును సీబీఐ వర్గాలు అరెస్టు చేశాయి. కర్ణాటకలోని బెలెకెరి పోర్టు నుంచి ఇనుప ఖనిజం అక్రమ ఎగుమతుల కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. శుక్రవారం ఆయనను సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెడతారు. గురువారం నాడు సుదీర్ఘంగా సురేష్ బాబును ప్రశ్నించిన తర్వాత ఆయన్ను అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఉత్తర కన్నడ జిల్లాలోని బెలెకెరి పోర్టు నుంచి అక్రమంగా ఇనుప ఖనిజం ఎగుమతికి సంబంధించిన వివరాలను కర్ణాటక మాజీ లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే బయటపెట్టారు. 2006-07, 2010-11 సంవత్సరాల మధ్య దాదాపు 77.4 కోట్ల టన్నుల ఇనపు ఖనిజం అక్రమంగా ఎగుమతి అయ్యిందని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి శ్రీరాములు, సురేష్ బాబు ఇద్దరూ సన్నిహితులేనన్న విషయం తెలిసిందే.