
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లపై కాంగ్రెస్ సూత్రప్రాయ నిర్ణయం
మిగతా రెండు స్థానాలపై రాష్ట్ర నేతల్లో కుదరని ఏకాభిప్రాయం
ఎస్సీ, బీసీ, ఓసీ నేతల్లో ఇద్దరికి ఇవ్వాలనే యోచన
నేడు ఢిల్లీ పెద్దల సమక్షంలో చర్చలు.. రేపు అధికారికంగా అభ్యర్థుల ప్రకటన!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం అధికార కాంగ్రెస్ చేపట్టిన కసరత్తు తుదిదశకు చేరుకుంది. వచ్చే సోమవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగుస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను టీపీసీసీ వేగవంతం చేసింది. ఎమ్మెల్యేల కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు దక్కే అవకాశమున్న నేపథ్యంలో.. ఒక సీటును మిత్రపక్షమైన సీపీఐకి ఇవ్వాలని, మిగతా మూడింటిలో ఒక స్థానాన్ని ఎస్టీ వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. అందులోనూ మహిళకు అవకాశమివ్వాలని ఇటీవల సీఎం రేవంత్ నివాసంలో జరిగిన భేటీలో నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. మిగతా రెండింటి కోసం ఎస్సీ, ఓసీ, బీసీ వర్గాలకు చెందిన నేతల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
ఢిల్లీలో అభ్యర్థుల ఖరారు..
కేబినెట్ విస్తరణతో ముడిపెట్టి జరుగుతున్న కసరత్తులో భాగంగా ఈ మూడు సామాజిక వర్గాల నుంచి అవకాశం కలి్పంచాల్సి ఉంటుందని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో రెండు ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి, రెండు రాజ్యసభ ఎంపీ స్థానాల్లో ఒకటి చొప్పున బీసీలకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో.. ఈసారి బీసీ నేతలకు ఎమ్మెల్సీ అవకాశం ఉండకపోవచ్చని గాం«దీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే ఎస్టీ, ఎస్సీ, ఓసీ వర్గాల నేతలను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయవచ్చని అంటున్నారు. అభ్యర్థుల ఖరారు ప్రక్రియ శని, ఆదివారాల్లో ఢిల్లీ వేదికగా జరగనుంది.
అధిష్టానం పెద్దలు కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్‌తో భేటీ అయ్యేందుకు గాను సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ శనివారం మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ వెళుతున్నారు. ఆదివారం ఉదయం ఏఐసీసీ పెద్దలతో భేటీ అయి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. మధ్యాహా్ననికల్లా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
మిత్ర పక్షానికి..
ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా మిత్రపక్షం సీపీఐకి అవకాశం ఇవ్వడం దాదాపు ఖరారైనట్టేనని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుదిరిన పొత్తులో భాగంగా, నాడు ఇచ్చిన మాట ప్రకారం సీపీఐకి ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందని.. ఈ మేరకు టీపీసీసీ నాయకత్వానికి సమాచారం ఇచ్చిందని పేర్కొంటున్నాయి.