
హైదరాబాద్, సాక్షి: మేడిగడ్డ ప్రాజెక్టు కట్టింది.. కూలిపోయింది.. ఈ విషయాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికగా ఇచ్చిందని బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనేనని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదికపై తెలంగాణ సచివాలయంలో మంగళవారం పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారాయన.
తెలంగాణ ఆర్టిక వ్యవస్థకు సంబంధించింది బాధ్యత గల పౌరుడిగా మాట్లాడుతున్నా. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిరంతరం బీఆర్‌ఎస్‌వాళ్లు తప్పుడు ప్రచారాలు చేశారు. 16 లక్షల ఎకరాల ఆయకట్టు కోసం.. 38వేల కోట్లతో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం అనాడు వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం రీ ఇంజినీరింగ్, రీ డిజైనింగ్ చేసింది. కమిషన్ల కోసం ప్రాజెక్టు అంచనాలు పెంచింది. కమీషన్లకక్కుర్తి కోసం ప్రాణహిత డిజైన్ మార్చింది. చివరకు తుమ్మిడిహెట్టి వద్ద కట్టాల్సిన బ్యారేజి...మేడిగడ్డ వద్ద వంద మీటర్ల హైట్ తో కట్టారు. దీని వల్ల ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాకు తీవ్ర నష్టం జరిగింది.
తుమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చే బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. బ్యారేజీల నిర్మాణ సమయంలోనే లోపాలు తెలిసినప్పటికీ సరిదిద్దుకోలేదు. సుందిళ్ల, అన్నారం దగ్గర సాయిల్ టెస్ట్ చేయలేదు. ప్రారంభానికి ముందే లోపాలు బయటపడ్డాయి.. కానీ, బీఆర్‌ఎస్ ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర నష్టం జరిగింది. కాళేశ్వరం డిజైన్లు ఒకలా ఉంటే.. మరోలా నిర్మాణం చేశారు. ప్రాజెక్టు కోసం 85 వేల కోట్లు అంచనా వేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం లోన్లు ఇవ్వలేదు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ కూలింది.
NDSA మేడిగడ్డ పరిశీలనకు వచ్చింది గత ప్రభుత్వం పాలనలోనే. మేడిగడ్డ లో డిజైన్, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని NDSA రిపోర్ట్ గత ప్రభుత్వ హయంలోనే ఇచ్చారు. NDSA అథారిటీ బిల్లుకు పార్లమెంట్‌లో BRS మద్దతు పలికింది. దేశంలో 5600 బ్యారేజీలు, డ్యామ్‌లను ఎన్‌డీఎస్‌ఏ పర్యవేక్షిస్తోంది. దేశంలో ఏ బ్యారేజీకి ఎలాంటి సమస్య వచ్చినా NDSA నుంచే అభిప్రాయం చెప్తుంది. NDSA లో జాతీయ అంతర్జాతీయ నిపుణులు ఉన్నారు. అలాంటిది NDSA నిపుణులను సైతం BRS నాయకులు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రంపై లక్షన్నర కోట్ల భారం పడుతోంది. ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పులకు మిత్తి ఏడాదికి 16వేలు కట్టాల్సి వస్తోంది. మేం అధికారంలోకి వచ్చాక మేడిగడ్డపై ఎన్‌డీఎస్‌కు లేఖ చేశాం. 14 నెలలు పరిశీలించి నివేదిక రూపొందించింది. గత ప్రభుత్వ కక్కుర్తి వల్ల చాలా నష్టం జరిగింది తుమ్మెడిహట్టి దగ్గర రెండు ప్రాజెక్టులు కడతామన్నారు. తట్టెడు మట్టి కూడా పోయలేదు. పైగా అక్కడ నీటి లభ్యత లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
మేడిగడ్డ ప్రాజెక్టు.. లొకేషన్ పెద్ద మిస్టేక్. అది కూలినప్పుడు కేసీఆర్ సీఎంగా ఉన్నారు. వాల్స్, భీమ్స్‌లో రంధ్రాలు వచ్చాయని ఎన్‌డీఎస్‌ఏ పేర్కొంది. ఇంతకన్నా సిగ్గు చేటు ఉంటుందా?. సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి.. అనవసర మాటలు మాట్లాడుతున్నారు అని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు.
కాళేశ్వరాన్ని ఉపయోగించుకునే స్థితి లేదని ఎన్‌డీఎస్‌ఏ చెప్పింది. రీడిజైన్ చేసి నిర్మాణం చేయాలని చెప్పింది. రిపోర్ట్ ఆధారంగానే ముందుకు వెళ్తాం ప్రాజెక్టు తప్పిదాలకు కారణమైన అధికారుల పై చట్టప్రకారం చర్యలు ఉంటాయి. అధికారులు తప్పిదాలు చేయడానికి కారణమైన వ్యక్తి గత ప్రభుత్వ పెద్ద కేసీఆర్ . చట్టప్రకారం గత ప్రభుత్వ పాలకులు, అధికారులపై చర్యలు ఉంటాయి. రాబోయే కేబినెట్ భేటీలో NDSA రిపోర్ట్ పై చర్చ జరుపుతాం. క్యాబినేట్ లో చర్చించిన తర్వాత ప్రాజెక్టు పై తదుపరి కార్యాచరణ ప్రకటన చేస్తాం.