environmental damage
-
గడ్డ కట్టే చలిలో 16 రోజులుగా ‘‘క్లైమేట్ ఫాస్ట్"
లడఖ్‌కు చెందిన ప్రముఖ సామాజిక, వాతావరణ కార్యకర్త మెగసెసే అవార్డు గ్రహీత, సోనమ్ వాంగ్‌చుక్ 'లడఖ్‌ను రక్షించేందుకు' నిరాహార దీక్షకు దిగారు. పర్యావరణ పరిరక్షణోద్యమంలో స్వరాన్ని వినిపిస్తున్న సోనమ్ లడఖ్‌ను కాలుష్య కోరల నుంచి రక్షించాలంటూ గత కొంత కాలంగా పోరాడుతున్నారు. లడఖ్‌కు పూర్తి రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం రాజ్యాంగ భద్రత కల్పించాలన్న అంశంపై ప్రభుత్వం, లేహ్ అపెక్స్ బాడీ (LAB), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) నాయకుల మధ్య చర్చలు విఫలమైన నేపథ్యంలో వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. నాలుగేళ్లపాటు తూతూమంత్రంగా సాగిన వ్యూహాల తర్వాత, హామీలను నెరవేర్చేందుకు కేంద్రం నిరాకరించిందని వాంగ్‌చుక్ విమర్శించారు. వాతావరణ మార్పులను నిరసిస్తూ, లడఖ్‌లోని హిమాలయ ప్రాంతంలోని పర్యావరణ భద్రత, లడఖ్‌కు ప్రజాస్వామ్య హక్కుల రక్షణ డిమాండ్‌తో మార్చి 6వ తేదీన మొదలైన ఈ ‘‘క్లైమేట్ ఫాస్ట్" 21 రోజులు పాటు కొనసాగనుంది. అవసరమైతే ఈ దీక్షను ఆమరణ దీక్షగా పొడిగించవచ్చని తెలుస్తోంది. ఈ సందర్భంగా సోనమ్ వాంగ్‌చుక్ వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు. BEGINNING OF DAY 16 OF #CLIMATEFAST 120 people sleeping outdoors under clear skies. Temperature: - 8 °C 16 days of just water n salts is finally taking a toll. Feeling quite week. But I can still drag for another 25 days n perhaps will. I'm sure our path of truth will win… pic.twitter.com/jsTFlvgD4c — Sonam Wangchuk (@Wangchuk66) March 21, 2024 > సాదాసీదాగాజీవనాన్ని ఎంచుకోవాలని ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. సోనమ్ వాంగ్‌చుక్ క్లైమాట్ ఫాస్ట్‌కు దేశంలోని వివిధ ప్రాంతాల పౌరులు, రాజకీయ నాయకులు, సామాజిక-పర్యావరణ కార్యకర్తలు మద్దతుగి నిలిచారు. అలాగే ఈయనకు సంఘీభావంగా కాశ్మీర్ టూరిజం విభాగం కూడా 'క్లైమేట్ ఫాస్ట్'లో పా ల్గొనడం విశేషం. ఎప్పటికపుడు దీక్ష వివరాలను ట్వటర్లో షేర్ చేస్తున్నారు. 16 వ రోజు దీక్ష వివరాలను కూడా ఆయన పంచుకున్నారు. ‘‘8 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రత వద్ద 120 మంది ఆరుబయట నిద్రిస్తున్నారు. నీరు, లవణాలుకొద్దిగా తగ్గుతున్నాయి. నేను ఇంకా 25 రోజులు దీక్ష కొనసాగించగలను అని విశ్వసిస్తున్నాను. సత్యం గెలుస్తుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను’’ - సోనమ్ వాంగ్‌చుక్ కాగా ఇక్కడ పరిశ్రమల వల్ల పర్యావరణం దెబ్బ తింటోందని, రాబోయే రోజుల్లో హిమానీ నదాలు అంతరించి పోయే ప్రమాదం ఉందని ఇప్పటికే చాలా సార్లు హెచ్చరించిన సోనమ్ అనేక ఉద్యమాలు కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. ఎవరీ సోనమ్ వాంగ్‌చుక్ 1966లో ఆల్చి సమీపంలోని ఉలేటోక్పోలో పుట్టారు సోనమ్.విద్యాభ్యాసం కోసం వసతుల్లేక 1977లో ఢిల్లీకి తరలిపోయాడు. ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి 2011లో ఫ్రాన్స్‌లో ఎర్త్ ఆర్కిటెక్చర్ ను అధ్యయనం చేశారు. 1993 నుండి 2005 దాకా వాంగ్ చుక్ లడాగ్స్ మెలాంగ్ పత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు. అలాగే 2018లో రామన్ మెగసెసే అవార్డు , ఐసీఏ, సోషల్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్, రోలెక్స్, ఇంటర్నేషనల్ టెర్రా అవార్డుతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ఆయన దక్కించుకున్నారు. -
Egypt COP27: పర్యావరణ ప్రతినలు... లక్ష్యానికి ఆమడ దూరం
భూమి నానాటికీ వేడుక్కుతోంది. ఒకవైపు తీవ్ర కరువు. మరోవైపు పలు దేశాల్లో కనీవినీ ఎరగని వరదలు సృష్టిస్తున్న పెను బీభత్సం. ఇలాంటి ఉత్పతాలన్నింటికీ కారణం పర్యావరణ మార్పులు. ఇది రానురానూ తీవ్ర రూపు దాలుస్తూ మానవాళిని వణికిస్తోంది. ఎవరేం చెప్పినా, దేశాలు ఎన్ని చేసినా సమస్య నానాటికీ ముదురుతోందే తప్ప పరిస్థితిలో మెరుగుదల మాత్రం కన్పించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణం నానాటికీ విషతుల్యంగా మారుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ పర్యావరణానికి ముప్పు పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పర్యావరణ మార్పులపై సదస్సు (కాప్–27) ఆదివారం ఈజిప్టులో మొదలవుతోంది. 12 రోజుల పాటు జరిగే ఈ సదస్సులోనైనా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకునే దిశగా గట్టి ముందడుగు పడుతుందేమో చూడాలి... కాగితాల్లోనే ఒప్పందాలు గతేడాది స్కాట్లండ్‌లోని గ్లాస్గోలో జరిగిన కాప్–26లో దేశాలన్నీ మేధోమథనం చేసి గట్టి తీర్మానాలతో పర్యావరణ ఒప్పందమైతే ఆమోదించాయి. దీన్నో పెద్ద సానుకూల చర్యగా ప్రపంచమంతా కొనియాడింది. ఎందుకంటే శిలాజ ఇంధనాల వల్ల పర్యావరణానికి కలుగుతున్న తీవ్ర హానిని అంతర్జాతీయంగా తొలిసారిగా అధికారికంగా గుర్తించింది గ్లాస్గో సదస్సులోనే. వాటి వాడకాన్ని వీలైనంతగా తగ్గిస్తూ క్రమంగా పూర్తిగా నిలిపేయాలని దేశాలన్నింటికీ సదస్సు పిలుపునిచ్చింది. కానీ ఏడాది గడిచినా ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వాడకం నానాటికీ పెరుగుతోందే తప్ప తగ్గకపోవడం శోచనీయం. పులిమీద పుట్రలా యుద్ధం... రష్యా–ఉక్రెయిన్ యుద్ధం దెబ్బకు పరిస్థితి మరింతగా దిగజారింది. రష్యా నుంచి సహజవాయు సరఫరాలు భారీగా తగ్గిపోవడంతో యూరప్ సహా పలు దేశాలు మరో దారి లేక శిలాజ ఇంధనాల వాడకాన్ని పెంచేశాయి. అందులోనూ అత్యంత కాలుష్యకారకమైన బొగ్గు వాడకం విపరీతంగా పెరిగిపోతున్న వైనం కలవరపెడుతోంది. 2022లో బొగ్గు వాడకం 2013లో నమోదైన ఆల్‌టైం రికార్డును చేరడం ఖాయమని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) జోస్యం చెబుతోంది. ఒక్క యూరోపియన్ యూనియన్లోనే బొగ్గు డిమాండ్ కనీసం 6.5 శాతం పెరుగుతుందని అంచనా. మొత్తమ్మీద 2030 కల్లా అంతర్జాతీయ బొగ్గు వినియోగం 2021తోపోలిస్తే 8.7 శాతానికి మించి తగ్గకపోవచ్చంటున్నారు. ఈ లెక్కన 2050 నాటికి శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపేయాలన్న లక్ష్యం చేరడం అసాధ్యమే. అది జరగాలంటే 2030 నాటికి బొగ్గు వాడకం ఏకంగా 35 శాతం తగ్గాల్సి ఉంటుంది! గతేడాది సదస్సులో వర్ధమాన దేశాలన్నింటినీ బొగ్గు తదితర శిలాజ ఇంధనాలకు గుడ్‌బై చెప్పాలని కోరిన సంపన్న దేశాలే ఇప్పుడు ఆ దేశాలను మించి వాటిని వాడుతుండటం విషాదం. ఈ ధోరణికి వెంటనే అడ్డుకట్ట పడకుంటే 2100 నాటికి భూగోళం ఏకంగా మరో 2.6 డిగ్రీల మేరకు వేడెక్కుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూతాపోన్నతిని 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలన్న గ్లాస్గో ఒప్పందం అమలుకు సదస్సు ఏ చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరం. భద్రతా వలయంలో రిసార్టు పర్యావరణ కార్యకర్తల నిరసనల భయాల నడుమ సీఓపీ27కు వేదిక కానున్న సినాయ్ ద్వీపకల్పంలోని షర్మెల్ షేక్‌లోని రిసార్టు వద్ద ఈజిప్టు ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. కోరల్ రీఫ్‌లు, అత్యంత అందమైన సముద్ర తీరాలకు ఈ రిసార్టు నిలయం. స్థానికంగా టూరిజంలో పనిచేసే వాళ్లలో చాలామందిని తాత్కాలికంగా ఇళ్లకు పంపారు. మిగతా వారికి ప్రత్యేకమైన గుర్తింపు కార్డులిచ్చారు. సెలవులు గడిపేందుకు వస్తున్న టూరిస్టులను కూడా అడ్డుకుంటున్నారు. గతేడాది గ్లాస్గోలో సదస్సు జరిగిన వీధిలోకి ఏకంగా లక్షలమంది దూసుకొచ్చి నిరసనలకు దిగారు. కాప్ సదస్సు 1995 నుంచి ఏటా జరుగుతోంది. ఆర్థిక, సాంకేతిక సాయాలకు పట్టుబట్టనున్న భారత్ వాతావరణ మార్పులు, తద్వారా వస్తున్న విపత్తులను అరికట్టేందుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సాయాన్ని సంపన్న దేశాలు భారీగా పెంచాలని సదస్సులో భారత్ డిమాండ్ చేసే అవకాశం కన్పిస్తోంది. మన ప్రతినిధి బృందానికి కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ నేతృత్వం వహిస్తారు. మొత్తం 198 దేశాలు సదస్సులో పాల్గొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో పాటు 100 మందికి పైగా దేశాధినేతలు హాజరవనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడంపై స్పష్టత లేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాలిఫోర్నియా బీచ్‌లో ముడిచమురు లీక్.. పర్యావరణానికి తీవ్ర నష్టం!
కాలిఫోర్నియాలోని హంటింగ్టన్ బీచ్ సమీపంలో చమురు బావి నుంచి ముడి చమురు శనివారం ఉదయం పైకి ప్రవాహంలా తన్నుకు వచ్చింది. దీంతో అక్కడి ఇసుక తిన్నెల్లో మృతి చెందిన పక్షులు, చేపలతో పరిస్థితి హృదయ విదాకరంగా మారింది. అక్కడి చిత్తడి నేలలు కూడా చమురు పొరతో నిండిపోయాయి. బీచ్‌లన్నీ నిర్మాణుష్యమైపోయాయి. వార్షిక ఎయిర్ షోలు కూడా రద్దయ్యాయి. దాదాపుగా లక్ష 23 వేల గ్యాలన్లు లేదా 3 వేల బ్యారెల్స్ ముడి చమురు పసిఫిక్ మహాసముద్రంలో వచ్చిపడింది. బీచ్ సమీపంలోని దక్షిణ లాస్ ఏంజెల్స్ సిటీలో 40 మైళ్ల వరకు దీని ప్రభావం పడిందని అధికారులు తెలిపారు. దీంతో దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో గందర గోళ పరిస్థితి నెలకోంది. వాతావరణమంతా పెట్రోల్ దుర్గంధంతో నిండిపోయింది. హంటింగ్టన్ బీచ్ సమీపంలో గల చమురు బావిలో అయిల్ లీకవుతున్న విషయాన్ని గుర్తించిన ఇంజనీరింగ్ సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు. లీకేజీని అరికట్టే ప్రయత్నం చేశారు. కాగా హంటింగ్టన్ బీచ్ మేయర్ కిమ్ కార్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సముద్రం పై భాగంలో దాదాపుగా 13 చదరపు మైళ్ళ మేర చమురు పొర వ్యాపించి ఉండవచ్చని మేయర్ తెలిపారు. ఈ ఉపద్రవం వల్ల పెద్ద సంఖ్యలో సముద్ర జీవరాశి మరణించింది. పర్యావరణం పై తీవ్ర ప్రభావాన్ని చూపిందని పర్యావరణ వేత్తలు పేర్కోన్నారు. దీనిని పెద్ద పర్యావరణ విపత్తుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఈ లీక్ ఎక్కడ ఎందుకు సంభవించిందో తెలుసుకోవడానికి దర్యాప్తు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. చదవండి: అబ్బే ఏం లేదు.. నాకు కొంచెం సిగ్గెక్కువ.. అందుకే!! -
5జీ నెట్‌వర్క్‌తో పర్యావరణానికి పెనుముప్పు
న్యూఢిల్లీ: దేశంలో అత్యాధునిక 5జీ వైర్లెస్ నెట్‌వర్క్‌ను నెలకొల్పేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండడంపై బాలీవుట్ నటి, పర్యావరణవేత్త జుహీ చావ్లా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 5జీ నెట్‌వర్క్‌తో విపరీతమైన రేడియేషన్ వెలువడుతుందని, తద్వారా పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుందని చెప్పారు. ఇది మనుషుల మనుగడపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. విలువైన జంతుజాలం, పక్షులు అంతరించి పోయే ప్రమాదం ఉందన్నారు. 5జీ వైర్లెస్ నెట్‌వర్క్‌ను వ్యతిరేకిస్తూ జుహీ చావ్లా సోమవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ జస్టిస్ సి.హరిశంకర్ ముందుకు విచారణకు రాగా, ఆయన దాన్ని మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. జుహీ చావ్లా పిటిషన్‌పై జూన్ 2న ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగనుంది. 5జీ నెట్‌వర్క్‌తో రేడియేషన్ ఇప్పుడున్న దానికంటే 10 నుంచి 100 రెట్లు పెరిగిపోతుందని జుహీ చావ్లా పేర్కొన్నారు. భూమిపై ఉన్న ఏ ఒక్క మనిషి, జంతువు, పక్షి, కీటకం, చెట్టు ఈ రేడియేషన్ నుంచి తప్పించుకోలేవని తెలియజేశారు. అంతేకాకుండా మన పర్యావరణానికి శాశ్వతమైన నష్టం వాటిల్లుతుందన్నారు. -
ఫోక్స్‌వ్యాగన్‌పై 500 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: పర్యావరణానికి హాని కలిగించినందుకు జర్మనీ వాహన దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్‌కు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) రూ.500 కోట్ల జరిమానా వడ్డించింది. ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ తన డీజిల్ కార్లలో చీట్ డివైస్‌ను ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి హాని కలిగించిందని ఎన్జీటీ పేర్కొంది. పర్యావరణ పరీక్షలను తప్పుదోవ పట్టించే సాఫ్ట్‌వేర్‌ను ఫోక్స్‌వ్యాగన్ తన కార్లలో వినియోగించిందని, ఈ కార్ల అమ్మకాలను భారత్‌లో నిషేధించాలంటూ ఐలావాడి అనే స్కూల్ టీచర్, మరికొందరు ఫిర్యాదు చేశారు. రెండు నెలల్లో జరిమానా డిపాజిట్ చేయండి రూ.500 కోట్ల జరిమానాను రెండు నెలల్లో డిపాజిట్ చేయాలని జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ అధ్యక్షతన గల ఎన్జీటీ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని నేషనల్ క్యాపిటల్ రీజియన్‌తో పాటు అధికంగా కాలుష్యానికి గురైన ప్రాంతాల్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు ఖర్చు చేయాలని ఎన్జీటీ పేర్కొంది. కాగా తాము బీఎస్ ఫోర్ నిబంధనలను ఉల్లంఘించలేదని ఫోక్స్‌వ్యాగన్ పేర్కొంది. రహదారి పరీక్షలు ఆధారంగా తనిఖీలు జరిపారని, ఈ రహదారి పరీక్షలకు నిర్దేశిత ప్రమాణాలు లేవని వివరించింది. -
మచ్చ తొలగితేనే మంచి పేరు!
‘మనిషి సాంఘిక జంతువు’ అని రెండు వేల సంవత్సరాల కింద ఆరిస్టాటిల్ అన్న మాటకీ, ‘ప్రతిచోట విధ్వంసం సృష్టిస్తున్న జంతువు మనిషి’ అన్న హైకోర్టు తాజా వ్యాఖ్యకి ఎంతో తేడా ఉంది. మొదటిది, బుద్ధికలిగి సకల జీవులతో పరస్పర సహజీవనం సాగిస్తున్న ఉన్నతుడిగా మనిషికి ప్రశంస అయితే, రెండోది, స్వార్థంతో బుద్ధి మందగించి బాధ్యత మరచిన మనిషి ఇతర జీవులకు హాని చేస్తున్నాడనే అభిశంస! ఇందులో వ్యక్తులుగా, సమూహాలుగా, జాతులుగా, సంస్థలుగా, ప్రభుత్వాలుగా అందరి బాధ్యతా ఉంది. ‘మనిషి విధ్వంసకారి’అనే మాటను చెరిపేయాలి. ‘బుద్ధిజీవి’అనే మాటను నిలబెట్టాలి. అప్పుడే పృథ్వికి రక్ష, భవితకు భరోసా! ‘మనిషన్న జంతువు ప్రతిచోటా విధ్వంసం సృష్టిస్తోంది’ అంటూ హైకోర్టు ధర్మాసనం వెలి బుచ్చిన ధర్మాగ్రహం ప్రతి మనిషికీ తగలా ల్సిన పోటు! ఎక్కడో తగిలే ఉంటుంది, ఎవరికి అది ఎంత వరకు తగి లింది అనేదానికి కొలతలు లేవు. కానీ, పర్యావరణం అన్నది ఇక ఏ మాత్రం న్యాయస్థానాలకో, పరిశోధనాలయాలకో, శాస్త్రజ్ఞులకో, హరిత కార్యకర్తలకో మాత్రమే పరిమితమైన పదం కాదు. ఇది సామాన్యుల నుంచి రాజకీయ పార్టీల మేనిఫెస్టోల వరకు అత్యంత కీలకమైన ఎజెం డాగా మారిందనేది సత్యం. మన దేశ రాజధాని «ఢిల్లీలో ముప్పిరిగొం టున్న వాయు కాలుష్యం అత్యంత దుర్భరంగా తయారయింది. ఇది జీడీపీపై వ్యతిరేక ప్రభావం చూపడమే కాకుండా అక్కడ నివసించే ప్రతి మనిషి సగటు పదేళ్ల ఆయుర్ధాయాన్ని హరిస్తోందని అధ్యయనాలు చెబు తున్నాయి. ముఖ్యంగా భూతాపం, వాయుకాలుష్యం వంటివి అంచనా లకు మించిన వేగంతో దూసుకువస్తూ తెచ్చిన ‘వాతావరణ మార్పు’ల ప్రతికూల ప్రభావం ఇపుడు ప్రతి జీవినీ తడుముతోంది. ఇది విశ్వ పరి ణామం! ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పర్యావరణం భూమ్మీది జీవుల న్నింటి బతుకునీ ప్రభావితం చేస్తోంది. పరిణామ క్రమంలో ఉత్కృష్ట జీవిగా అవతరించిన ‘మనిషి’తన చర్యలవల్లో, చర్యల లేమివల్లో పర్యా వరణ విధ్వంసానికి కారణమవుతున్నాడు. ఇతర జీవులనీ నానా యాత నకి గురిచేస్తున్నాడు. తాను నియంత్రించి, నివారించ గలిగిన వాటిని కూడా నిర్లక్ష్యం చేస్తూ జీవుల మనుగడకు ముప్పు తెస్తున్నాడు. సహజ వనరుల్ని సర్వనాశనం చేసి భవిష్యత్తరాలకు ఓ భగ్న పృథ్విని అందించ నున్నాడు. ఇదే విషయాన్ని హైకోర్టు నొక్కి చెప్పింది. ‘మనిషి సాంఘిక జంతువు’ అని రెండు వేల సంవత్సరాల కింద ఆరిస్టాటిల్ అన్న మాటకీ, ‘ప్రతిచోట విధ్వంసం సృష్టిస్తున్న జంతువు మనిషి’ అన్న హైకోర్టు తాజా వ్యాఖ్యకి ఎంతో తేడా ఉంది. మొదటిది, బుద్ధికలిగి సకల జీవులతో పర స్పర సహజీవనం సాగిస్తున్న ఉన్నతుడిగా మనిషికి ప్రశంస అయితే, రెండోది, స్వార్థంతో బుద్ధి మందగించి బాధ్యత మరచిన మనిషి ఇతర జీవులకు హాని చేస్తున్నాడనే అభిశంస! ఇందులో వ్యక్తులుగా, సమూహా లుగా, జాతులుగా, సంస్థలుగా, ప్రభుత్వాలుగా అందరి బాధ్యతా ఉంది. అన్ని స్థాయిల్లో ఎవరి బాధ్యత వారెరిగి, జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిన అవసరం మనందరి పైనా ఉందనేది తిరుగులేని వాస్తవం. ఇది ఓటర్లముందున్న సవాల్ సగటు మనిషి జీవితపు ప్రతి పార్శా్వన్నీ శాసించే అధికారాన్ని తెలిసో, తెలియకో మనం మన రాజకీయ వ్యవస్థకు ధారాదత్తం చేశాం. అన్నీ వారు చెప్పినట్టు నడవాల్సిందే! పాలకులుగా అవతరించే రాజకీయ పార్టీలను ప్రజలు నిలదీసే, ప్రశ్నించే ఒకే ఒక సందర్భం ఎన్నికలు. అయి దారు మాసాల వెనకా, ముందు... ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఎన్నికల ముంగిట్లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనయితే పక్షం రోజుల్లోనే ఎన్ని కలు. ప్రధాన రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తు న్నాయి. కానీ, వాటిల్లో నిర్దిష్టత లోపిస్తోంది. ఓట్లనాకర్షించే ఆర్థికాంశాల కిచ్చే ప్రాధాన్యత ఇతర ముఖ్య అంశాలకు ఇవ్వటం లేదు. ‘పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం’ అనే సాధారణ ప్రకటన ఇవ్వడం, ఇతరే తర అంశాల కింద ప్రకటించే విధానాల్లో అస్పష్టత అంతిమంగా పర్యా వరణానికి భంగం కలిగించే సందర్భాలెన్నో! ఉదాహరణకి, పర్యావ రణం గురించి సదరు పద్దు కింద సానుకూల ప్రకటన చేసినా, ‘పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భూ వినియోగ విధానం’ లోని అస్పష్టత చివరకు పర్యావరణానికి హాని కలిగించేదిగా ఉంటోంది. పరిశ్రమల ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టుల కల్పన, రవాణా వ్యవస్థ, భూసేకరణ... ఇలా చాలా అంశాలూ పర్యావరణాన్ని ప్రభావితం చేస్తాయి. వీటిని నిశితంగా పరి శీలించి, విశాల జనహితంలో విపులంగా చర్చించాల్సిన అవసరం ఉంది. సామాజిక మాధ్యమాల విస్తృతి వల్ల వచ్చిన జనచేతన క్రమంగా వేర్వేరు అంశాల్లోకి వ్యాపించడమొక మంచి పరిణామం! పర్యావరణ విషయా ల్లోనూ ఆ జాగ్రత్త అవసరం. దీపావళి టపాసులు పండుగరోజు రాత్రి 8–10 గంటల మధ్యే కాల్చాలన్న సుప్రీం ఇటీవలి తీర్పు పదేళ్లకింద అయితే ఎలా ఉండేదో! అన్న సందేహం కలుగుతుంది. తెలంగాణలో కూటమికట్టి ఎన్నికల్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్, రేపో మాపో ప్రకటించ నున్న తన ఎన్నికల ప్రణాళికలో పర్యావరణాన్ని ఒక అంశంగా చేర్చింది. జీహెచ్ఎంసీ పరిధి ప్రతి కొత్త నిర్మాణాలకూ ‘ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్’ ప్రమాణాల్ని తప్పనిసరి చేస్తామని, కొత్తగా నిర్మించే ప్రతి వాణిజ్య, గృహ నిర్మాణాల్లో ఇంకుడు గుంతల్ని నిర్బంధం చేస్తామని, సోలార్ రూఫ్‌టాప్ రాయితీ పథకాన్ని కొనసాగిస్తామని, షెంజెన్ తర హాలో ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ క్యాబులు, ఎలక్ట్రిక్ ఆటోల విధానం తీసుకువస్తామని, ప్లాస్టిక్‌ను నియంత్రించి జూట్, బట్ట సంచుల వాడ కాన్ని తప్పనిసరి చేస్తూ సంబంధిత పరిశ్రమల్ని అభివృద్ధి పరుస్తామని... ఇలా ప్రకటించారు. పాలక తెరాస 2014 ఎన్నికల ప్రణాళికలో ప్రకటించ నప్పటికీ ‘హరితహారం’ ద్వారా విస్తృతంగా మొక్కలు నాటే పెద్ద కార్య క్రమాన్ని గత నాలుగేళ్లుగా అమలుపరచింది. హైదరాబాద్‌ను విశ్వనగ రంగా తీర్చిదిద్దుతామనే హామీలో భాగంగా మూసీనది, హుస్సేన్‌సాగర్ జలశుద్ది గురించి ఎంతో చెప్పింది. నగరంలోని చెరువుల పునరుద్ధరణ చేస్తామనీ ప్రకటించింది. కానీ, అవేవీ జరగలేదు. అప్పుడు జరిగిన ఉమ్మడి ఎన్నికలకు తమ ప్రణాళికను విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ పలు పర్యావరణ హామీలతో పాటు ప్లాస్టిక్ పైనా నిర్దిష్ట హామీ ఇచ్చింది. ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై నిషేధం విధిస్తాం, భూగర్భ మురుగు నీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. శిలాజ ఇంధనాల బదులు పునర్వినియోగ యోగ్యమైన శుద్ధ ఇంధనాల వినియోగాన్నే అభివృద్ధి పరుస్తామని బీజేపీ తన జాతీయ ఎన్నికల విధాన ప్రకటనలో తెలిపింది. సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా పర్యావరణ విధాన ప్రకటన చేశాయి. ఎవరెన్ని మాటలు చెప్పినా అమలులో చిత్తశుద్ధి అంతంతే! సమాజ శ్రేయస్సుకు పాలకులను నిలదీసి ఫలితాలు సాధించుకోవాల్సిన బాధ్యత పౌరులదే! ప్లాస్టిక్ వినియోగంపై నిర్దిష్ట చర్యలేవి? ప్రపంచ పర్యావరణాన్ని ఈ రోజు ప్లాస్టిక్ గడగడలాడిస్తోంది. వాడి విసిరి పారేశాక మట్టిపొరల్లోకి జారిపోయీ, వెయ్యేళ్లయినా నశించని దాని లక్షణం పెనుసవాల్ విసురుతోంది. నేల పైన, భూమి పొరల్లోనే కాకుండా అటు ఇటు తిరిగి సముద్రంలోనూ కోట్ల టన్నుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఎన్నెన్నో జీవుల మనుగడనే ఈ ప్లాస్టిక్ కల్లోల పరుస్తోంది. ప్రాణాలనూ హరిస్తోంది. ఇండోనేషియాలోని ఓ దీవి తీరానికి ప్రాణాలు కోల్పోయి ఇటీవల కొట్టుకొచ్చిన తిమింగలం సంచ లనం సృష్టించింది. తీరం నుంచి తొలగించేందుకు యత్నించినపుడు దాని పొట్టపగిలి ఎన్నెన్నో ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడ్డాయి. బాటిల్స్, కప్పులు, చెప్పులు, స్ప్రింగులు.. ఇలా లెక్కలేనంత ప్లాస్టిక్ కడుపులో పేరుకుపోయింది. అదే దాని చావుకు కారణమయిందని అధికారులు తేల్చారు. ఆసియా ఖండంలో ఉన్న 60 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్‌లాండ్ దేశాల్లోనే నిక్షిప్తమ య్యాయని ‘మెక్‌నెసీ సెంటర్ ఫర్ బిజినెస్ అండ్ ఎన్విరాన్మెంట్’ అనే సంస్థ అధ్యయనం చేసి నివేదించింది. ‘ప్లాస్టిక్ నియంత్రణ, నివారణకు మీరెలాంటి నిర్దిష్ట చర్యలు తీసుకుంటున్నారో తెలుపండ’ని రెండు తెలుగు రాష్ట్రాలను హైకోర్టు అడిగింది. తదుపరి విచారణ లోపు ఆయా ప్రభుత్వాలు ఏం చెబుతాయో చూడాలి. దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వ హణ సంక్లిష్టమవుతూ వస్తోంది. రోజూ సగటున 15000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు జమ అవుతున్నాయి. 60 శాతం పునర్వినియోగం(రీసైకిల్) అవుతుండగా 40 శాతం వ్యర్థాల్ని అభద్ర విధానంలో పారవేస్తున్నారు. అది ప్రమాదకరంగా పరిణమిస్తోంది. సరైన సేకరణ, నిర్వహణ పద్ధ తులు లేకపోవడం, విధానాల అమలు లోపాల వల్లే ఈ దుస్థితి! అభి వృద్ధి చెందిన దేశాల తలసరి ప్లాస్టిక్ వినియోగంతో పోల్చి చూస్తే మనది నామమాత్రమే! ప్రపంచ సగటు తలసరి ప్లాస్టిక్ వినియోగం 28 కిలోలు కాగా అమెరికా (109), ఐరోపా (65), చైనా (38), బ్రెజిల్ (32)ల ముందు భారత్ (11కిలోలు) వినియోగం ఎంతో తక్కువ. అయినా, పద్ధతిగా వాడటం, వ్యర్థాల్ని పోగుచేయడం, నిర్వహణ ఘోరంగా ఉండ టం వల్లే ఇబ్బందులు. 2022 నాటికి మనదేశంలోనూ తలసరి విని యోగం 20 కిలోలకు చేరవచ్చని ఇంధన శాఖ అంచనా. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016లో కొన్ని మార్పులు చేయాలని, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటయిన ఓ ఉన్నతస్థాయి కమిటీ కొన్ని సిఫార సులు చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, నిర్వహణ స్థానిక సంస్థలకు అప్పగించాలని, ఉత్పత్తి–వినియోగం చేసే వారి నుంచి సదరు ఫీజు వసూలు చేయాలనీ ఈ కమిటీ సిఫారసు చేసింది. మన దేశంలో అత్యధి కంగా ప్యాకేజింగ్ (35 శాతం), బిల్డింగ్స్–నిర్మాణం (23), రవాణా (8), ఎలక్ట్రానిక్స్ (8), వ్యవసాయ (7), ఇతర (19శాతం) రంగాల్లో ప్లాస్టిక్ వినియోగమవుతోంది. పాలనా వ్యవస్థను జవాబుదారీ చేయాలి పర్యావరణ పరిరక్షణకు మూడేళ్ల కింద సరిగ్గా ఇవే రోజుల్లో ‘ప్యారిస్ ఒప్పందం’ జరిగింది. మనదేశం కూడా పలు వాగ్దానాలు చేసింది. ఆ దిశలో గొప్పగా అడుగులు పడటం లేదు. వచ్చేనెల క్యాటోవైస్ (పోలాం డ్)లో భాగస్వాముల సదస్సు (కాప్) జరుగనుంది. ప్యారిస్ ఒప్పందం అమలుకు అక్కడ బ్లూప్రింట్ తయారు చేస్తారు. ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరుస్తున్నారో 2020 నుంచి లెక్కలు మొదలవుతాయి. జాతీయ స్థాయిలో విధానాల పరంగా, స్థానిక స్థాయి ఆచరణ పరంగా చర్యలుండాలి. ప్రజలు నిబద్ధత చూపాలి. అప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమౌతుంది. న్యాయస్థానం పేర్కొన్నట్టు ప్రభుత్వాలు బాధ్యత తీసు కోవాలి. ఖచ్చితత్వం పాటించాలి. ఎక్కడికక్కడ స్వచ్ఛంద సేవా సంస్థల భాగస్వామ్యంలో చర్యలు చేపట్టాలి. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ వంటి విషయాల్లో వ్యక్తులుగా పౌరులూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ‘మనిషి విధ్వంసకారి’అనే మాటను చెరిపేయాలి. ‘బుద్ధిజీవి’అనే మాటను నిలబెట్టాలి. అప్పుడే పృథ్వికి రక్ష, భవితకు భరోసా! దిలీప్ రెడ్డి, ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
మెసేజ్, కాల్స్‌తోనూ పర్యావరణానికి ముప్పు
టొరంటో: మెసేజ్, కాల్స్‌తో పర్యావరణానికి నష్టం ఎలాగా అని ఆలోచిస్తున్నారా..? ఈ రెండింటితోనే కాదు.. మీరు డౌన్లోడ్ లేదా అప్లోడ్ చేసే వీడియోలు, వీడియో కాల్స్, ఇంటర్నెట్ వినియోగం వీటన్నిటి వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎందుకంటే వీటిని ప్రాసెస్ చేయడానికి పెద్దఎత్తున డేటా కేంద్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు నిరంతరాయం పనిచేస్తుంటాయి. దీంతో ఈ కేంద్రాల నుంచి భారీగా వెలువడే కర్బన ఉద్గారాల వల్ల పర్యావరణానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 2040 నాటికి పర్యావరణానికి జరిగే నాశనంలో స్మార్ట్‌ఫోన్స్, డేటా సెంటర్లదే అధిక భాగం ఉంటుందని హెచ్చరించారు. దీనిలో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, డెస్క్‌టాప్స్, డేటా సెంటర్లు, ఇతర కమ్యూనికేషన్ నెట్‌వర్క్స్‌లో వినియోగించే కర్బన ఉద్గారాలపై వారు పరిశోధన చేపట్టారు. ప్రస్తుతం ఈ రంగం నుంచి వెలువడే కర్బన్ ఉద్గారాల శాతం 1.5 గా ఉందని.. 2040 నాటికి 14 శాతానికి చేరుకుంటుందన్నారు. -
‘95% ప్లాస్టిక్ వ్యర్థాలకు పది నదులే కారణం’
బెర్లిన్: ప్రపంచవ్యాప్తంగా కేవలం పది నదుల ద్వారానే 88–95 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో కలుస్తున్నాయని తేలింది. ఈ జాబితాలో గంగా, సింధు సహా 8 నదులు ఆసియాలో ఉండగా, మరో రెండు నదులు ఆఫ్రికా ఖండంలో ప్రవహిస్తున్నాయి. సరైన వ్యర్థాల నిర్వహణ పద్ధతులు పాటించకపోవడంతో ఏటా 5 ట్రిలియన్ పౌండ్ల ప్లాస్టిక్ సముద్రంలో చేరుతోందని ఈ పరిశోధనలో పాల్గొన్న డా.క్రిస్టియన్ ష్మిత్ తెలిపారు. తమ పరిశోధనలో భాగంగా 57 నదుల్లో, 79 చోట్ల నమూనాలు సేకరించామన్నారు. 5 మి.మీ కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రాల్లో కనుగొన్నామనీ, ఇది అక్కడి పర్యావరణానికి చాలా ప్రమాదకరమన్నారు. వీటిని నీటి నుంచి తొలగించడం కూడా అసాధ్యమన్నారు. ఇదే పరిమాణంలో వ్యర్థాలు చేరుతూపోతే 2050 నాటికి సముద్రాల్లో చేపల కంటే ప్లాస్టిక్ వ్యర్థాలే ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఈ వ్యర్థాల వల్ల 10 లక్షల సముద్రపు పక్షులు, లక్ష క్షీరదాలతో పాటు అసంఖ్యాకంగా చేపలు మృత్యువాత పడుతున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్‌లో చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, శ్రీలంకల వాటాయే 50 శాతానికిపైగా ఉంటుందన్నారు. జాబితాలోని తొలి 20 స్థానా ల్లో అమెరికా (1%) కూడా ఉందన్నారు. మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాల్లో 28% చైనా నుంచే సముద్రాల్లోకి చేరుతున్నాయన్నారు. వ్యర్థాలను చేరవేస్తున్న తొలి 10 నదులు: యాంగ్జీ, సింధు, యెల్లో రివర్, హైహీ (ఆసియా); నైలు (ఆఫ్రికా); గంగా, పెరల్, అముర్ (ఆసియా); నైజర్ (ఆఫ్రికా), మెకాంగ్ (ఆసియా). -
అభివృద్ధి పేరుతో పర్యావరణ హాని తగదు
జాతీయ సదస్సులో డీఎఫ్ఓ నాగరాజు వైవీయూ : అభివృద్ధి పేరుతో అడవులను నరికివేస్తూ పర్యావరణానికి హాని తలపెట్టడం తగదని కడప డీఎఫ్ఓ నాగరాజు అన్నారు. మంగళవారం నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయంప్రతిపత్తి)లో భూగర్భశాస్త్రం ఆధ్వర్యంలో ‘పర్యావరణ విపత్తు, కారణాలు - నిరోధక చర్యలు’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎఫ్ఓ నాగరాజు మాట్లాడుతూ పారిశ్రామికీకరణతో అభివృద్ధి జరుగుతున్నప్పటికీ దాని వెనుక అడవులు కోల్పోతూ పరోక్షంగా పర్యావరణానికి హాని కలిగిస్తున్నామన్నారు. నేడు అనేకచోట్ల తాగునీరు సైతం కొని తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. అడవులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. సుబ్బనరసయ్య మాట్లాడుతూ ప్రకృతిని ప్రేమించడంతో పాటు వాటి పరిరక్షణకు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. సదస్సు కన్వీనర్ డాక్టర్ ఎం. రవికుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ పట్ల సామాజిక దృక్పథం అవసరమని తెలిపారు. కర్నాటక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ ఎం. డేవిడ్ పర్యావరణ అసమతుల్యత, అరుదైన పక్షిజాతుల ఆవశ్యకత, క్రిమిసంహారక మందులను వినియోగించడం ద్వారా కలిగే అనర్థాలను వివరించారు. చెన్నై వేల్స్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ దినకరన్ మాట్లాడారు. రిమ్స్ డెరైక్టర్ సిద్దప్ప గౌరవ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతోనే దేశప్రగతి సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు, పెళ్లిరోజుల్లో ఒక మొక్కను నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషిచేయవచ్చన్నారు. వైవీయూ భూగర్భశాస్త్ర విభాగాధిపతి ఆచార్య రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే విపరీతమైన పరిణామాలు చోటుచేసుకుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వైవీయూ అధ్యాపకులు డాక్టర్ శ్రీధర్‌రెడ్డి, రఘుబాబు, రిటైర్డ్ అధ్యాపకులు వెంకటసుబ్బయ్య, ఎస్.ఎం. బాషా, యుగంధర్రాజు, సుశీల, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉదయశ్రీ, పీఆర్ఓ చెండ్రాయుడు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.