అభివృద్ధి పేరుతో అడవులను నరికివేస్తూ పర్యావరణానికి హాని తలపెట్టడం తగదని కడప డీఎఫ్‌ఓ నాగరాజు అన్నారు.
జాతీయ సదస్సులో డీఎఫ్‌ఓ నాగరాజు
వైవీయూ : అభివృద్ధి పేరుతో అడవులను నరికివేస్తూ పర్యావరణానికి హాని తలపెట్టడం తగదని కడప డీఎఫ్‌ఓ నాగరాజు అన్నారు. మంగళవారం నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయంప్రతిపత్తి)లో భూగర్భశాస్త్రం ఆధ్వర్యంలో ‘పర్యావరణ విపత్తు, కారణాలు - నిరోధక చర్యలు’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎఫ్‌ఓ నాగరాజు మాట్లాడుతూ పారిశ్రామికీకరణతో అభివృద్ధి జరుగుతున్నప్పటికీ దాని వెనుక అడవులు కోల్పోతూ పరోక్షంగా పర్యావరణానికి హాని కలిగిస్తున్నామన్నారు.
నేడు అనేకచోట్ల తాగునీరు సైతం కొని తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. అడవులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. సుబ్బనరసయ్య మాట్లాడుతూ ప్రకృతిని ప్రేమించడంతో పాటు వాటి పరిరక్షణకు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. సదస్సు కన్వీనర్ డాక్టర్ ఎం. రవికుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ పట్ల సామాజిక దృక్పథం అవసరమని తెలిపారు. కర్నాటక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ ఎం. డేవిడ్ పర్యావరణ అసమతుల్యత, అరుదైన పక్షిజాతుల ఆవశ్యకత, క్రిమిసంహారక మందులను వినియోగించడం ద్వారా కలిగే అనర్థాలను వివరించారు.
చెన్నై వేల్స్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ దినకరన్ మాట్లాడారు. రిమ్స్ డెరైక్టర్ సిద్దప్ప గౌరవ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతోనే దేశప్రగతి సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు, పెళ్లిరోజుల్లో ఒక మొక్కను నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషిచేయవచ్చన్నారు. వైవీయూ భూగర్భశాస్త్ర విభాగాధిపతి ఆచార్య రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే విపరీతమైన పరిణామాలు చోటుచేసుకుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వైవీయూ అధ్యాపకులు డాక్టర్ శ్రీధర్‌రెడ్డి, రఘుబాబు, రిటైర్డ్ అధ్యాపకులు వెంకటసుబ్బయ్య, ఎస్.ఎం. బాషా, యుగంధర్‌రాజు, సుశీల, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉదయశ్రీ, పీఆర్‌ఓ చెండ్రాయుడు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.