సాక్షి ప్రతినిధి, కడప: ‘యథా రాజా తథా ప్రజా’ అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి తగ్గట్టుగానే యంత్రాంగం నడుచుకుంటోంది. జిల్లాలో నలుచెరుగులా పరుగిడిన అభివృద్ధి ఒక్కసారిగా నిలిచిపోయింది. ప్రభుత్వ విధివిధానాలను నిక్కచ్చిగా అమలు చేయాల్సిన అధికారులు అక్రమ ఆదాయమే ధ్యేయంగా మసులుకుంటున్నారు. మొత్తంగా చేనేత జౌళి, ఎక్సైజ్‌శాఖల్లో అవినీతి అడ్డూఅదుపూ లేకుండా సాగిపోతోంది. ఈ పరిస్థితిని ఆ శాఖల మంత్రివర్యులు కొల్లు రవీంద్ర అయినా ఫుల్‌స్టాప్ పెట్టగలరా అని జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు.
రాష్ట్ర చేనేత, జౌళి, ఎక్సైజ్, బిసీ సంక్షేమశాఖ మాత్యులు కొల్లు రవీంద్ర శనివారం జిల్లాకు రానున్నారు. ఆయా శాఖల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా జిల్లా యంత్రాంగం నడుచుకుంటోంది. అక్రమ సంపాదనకు నిలువుటద్దంగా చేనేత సహకార సంఘాలు నిలుస్తున్నాయి. కార్మికుల పేర్లతో దోపిడీ చేస్తున్నా నిలువరించే స్థితిలో చేనేత జౌళి శాఖ కన్పించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నారుు. చేనేత కార్మికుల ముసుగులో కోట్లాది రుపాయాలు కొల్లగొడుతున్నారు. ఈ పరిస్థితిని నిలువరించాలనే ప్రయత్నాన్ని ఉన్నతస్థాయి యంత్రాంగం చేస్తున్నా ఆశించిన మేర స్పందన కనిపించడం లేదు.
రూ.20 కోట్ల స్వాహాకు రంగం సిద్ధం....
అప్పనంగా ప్రభుత్వ సొమ్మును ఆర్జిస్తున్న చేనేత సహకార సంఘాలు రూ.20కోట్లు స్వాహా చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. గత ఏడాది చేనేత సంఘాలకు రుణమాఫీలో భాగంగా జిల్లాకు రూ.37 కోట్లు వర్తించింది. ఈమొత్తం కేవలం నలుగురైదుగురి బొక్కసంలోకి వెళ్లిందనేది జగమెరిగిన సత్యం. అందుకు కారణం ఖాజీపేట, కమలాపురం, సిద్ధవటం, ప్రొద్దుటూరు మండలాల పరిధిలోని బోగస్ సంఘాలేనని చేనేత కార్మికులు అంటున్నారు. ఈవిషయం రాష్ట్ర ప్రభుత్వ స్థాయికి చేరడంతో అప్పటి చేనేత జౌళిశాఖ డెరైక్టర్ కెవి సత్యనారాయణ విజిలెన్సు విచారణ చేపట్టాల్సిందిగా సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది. అయితే మంత్రిత్వశాఖ పరిధిలోని ముఖ్యులు ఆ సిఫార్సులను తొక్కిపెట్టినట్లు సమచారం.
చేనేత సహకార సంఘాల ముసుగులో కోట్లాది రుపాయాలు అక్రమంగా దండుకుంటున్నా నిలువరించలేని దుస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం ఉండిపోయింది. ఖాజీపేట పరిధిలోని ఓ నాయకుని పరిధిలో సుమారు 600 మగ్గాలు ఉన్నట్లు రికార్డులు రూపొందించారు. లింగంపల్లెలో మరో నాయకుడు పరిధిలో 200 మగ్గాలు ఉన్నట్లు రికార్డులు ఉన్నాయి. ఇవన్నీ రికార్డులకు మాత్రమే పరిమితం. అక్కడ ఆస్థాయిలో కార్మికులు లేరు, మగ్గాలు అసలే లేవన్న విమర్శలు ఉన్నారుు. చేనేత యంత్రాంగానికి సైతం ఈ విషయం తెలిసిందే. అయితే స్థాయిని బట్టి పంపకాలు ఉండడంతో పక్కాగా స్వాహా అవుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
జిల్లాలో ఎమ్మార్పీ రేట్లుకు మంగళం...
మంత్రి కొల్లు రవీంద్ర నిర్వహిస్తున్న ఎక్సైజ్ శాఖలో కొందరు మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పెడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్పీ రేట్లకు మంగళం పలికి అక్రమ ఆదాయానికి తెరలేపింది. జిల్లా కేంద్రంలో ఎక్సైజ్‌శాఖ, డిప్యూటి కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నిత్యం అందుబాటులో ఉంటారు. అలాంటి చోట సైతం ఎమ్మార్పీ రేట్ల కంటే అధికంగా విక్రరుుస్తున్నారు. అనేక పర్యాయాలు పత్రికల్లో వార్తలు పతాక శీర్షికన వచ్చినా కనీస స్పందన లేదు. జిల్లాలో కడప పరిధిలో ఎమ్మార్పీపై రూ.15 అధికంగాను, ప్రొద్దుటూరు పరిధిలో రూ.10 అధిక రేట్లుకు విక్రయాలు నిర్వహిస్తున్నారు. దీని వల్ల ఒక్కో మద్యం షాపు పరిధిలో లక్షల్లో అదనపు ఆదాయం వస్తోంది. తుదకు ఎక్సైజ్‌శాఖ సొంతంగా నిర్వహిస్తున్న దుకాణాల్లో సైతం అదనపు రేట్లకే విక్రరుుస్తున్నారు.
లక్ష్యం చేరని బిసీ సంక్షేమం...
చేనేత జౌళి, ఎక్సైజ్ శాఖల పరిధిలో అక్రమార్జనే ధ్యేయంగా యంత్రాంగం నడుచుకుంటుంటే బిసీ సంక్షేమ శాఖలో లక్ష్యం నెరవేరడం లేదు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడేందుకు తీసుకోవాల్సిన చర్యల్లో ప్రభుత్వం వెనుకబడింది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి రుణాలు అందించలేదు. 2014-15 సంబందించి 6197 యూనిట్లుకు రుణపరపతి 50శాతం సబ్సిడీ కింద ఇవ్వాల్సి ఉండగా అందుకు రూ.38.5 కోట్లు అవసరం ఉంది. నిధులు ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. దీంతో బిసీలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మంత్రి ప్రత్యేక దృష్టి సారించి రుణ పరపతిని అర్హులందరికి ప్రజాస్వామ్యబద్దంగా అందించాల్సిన ఆవశ్యకత ఉంది.
‘కొల్లు’శాఖల్లో అవినీతి ఫుల్లు!
Published Sat, Feb 7 2015 1:35 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement