sports authority
-
‘అర్జున’ జ్యోతి ఆవేదన
విజయవాడ స్పోర్ట్స్: స్పోర్ట్స్ అథారిటీ (శాప్), కోచ్‌లు తనకు రావాల్సిన నజరానాలను అడ్డుకుంటున్నారని అర్జున అవార్డు గ్రహీత, విలువిద్య క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ ఆరోపించింది. తన స్వగృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అర్జున అవార్డు పొందిన తర్వాత సీఎం చంద్రబాబు రూ.కోటి నజరానా ప్రకటించినా ఇప్పటివరకు అందలేదని తెలిపింది. సహాయం చేయకపోగా అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నెల 3న ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో తనకు కోచ్‌గా చెరుకూరి సత్యనారాయణను చూపిస్తూ రూ.15 లక్షల మంజూరు చేయడాన్ని ఖండించింది. తనకు ఏనాడు ఆయన కోచ్‌గా వ్యవహరించలేదని స్పష్టం చేసింది. తన కోచ్‌లు జె.రామారావు, జీవన్‌జ్యోత్‌సింగ్ అని స్పష్టం చేసింది. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా చెరుకూరి సత్యనారాయణ అడ్డుకున్నారని దీంతో పెట్రోలియం స్పోర్ట్స్ బోర్డ్ తరఫున ఆడాల్సి వచ్చిందని తెలిపింది. 2013లోనే ఓల్గా ఆర్చరీ అకాడమీ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పింది. ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఇంటి స్థలం, గ్రూపు–1 ఉద్యోగాన్ని ఇవ్వాలని కోరింది. ప్రభుత్వం స్పందించకపోతే సోమవారం నుంచి నిరాహార దీక్షకు దిగుతానని పేర్కొంది. బేసిక్ కోచ్‌ను నేనే: చెరుకూరి సత్యనారాయణ జ్యోతి సురేఖకు నేను, నా కుమారుడు లెనిన్ శిక్షణ ఇచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చాం. నేనే బేసిక్ కోచ్‌ని. క్రీడా పాలసీ ప్రకారం బేసిక్ కోచ్‌లకు గౌరవ ఇన్సెంటివ్‌లు ఇస్తారు. అదే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చింది. నేను కోచ్‌ను కాదని సురేఖ తండ్రి చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ రాష్ట్రంలో ఆర్చరీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది నా కుమారుడు లెనిన్. శాప్ నా కుమారుడిని అర్జున, ద్రోణాచార్య అవార్డులకు రిఫర్ చేయడం లేదు. -
రియో ఒలింపిక్స్‌కు రాహుల్ ఎంపిక
బాపట్ల : వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్ 2016లో జరిగే రియో ఒలింపిక్స్‌కు ఎంపికైనట్టు స్పోర్ట్స్ అథారిటీ ఆదివారం ప్రకటించింది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో 85 కిలోల విభాగంలో స్వర్ణపతకాల వేటలో ఉన్న రాహుల్‌ను ఒలింపిక్స్ ఎంపిక చేయటంతోపాటు, ఈ నెల 16 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు వరకు పంజాబ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. రాహుల్ ఎంపిక కావటంతో ఆయన స్వగ్రామైన బాపట్ల మండలం స్టువర్టుపురంలో సందడి వాతావరణం నెలకొంది. రాహుల్ బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ ముప్పలనేని శేషగిరిరావు, ప్రిన్సిపాల్ శారానివేదిత అభినందనలు తెలిపారు. రాహుల్ తల్లిదండ్రులు మధు, నీలిమా తన బిడ్డ ఒలింపిక్స్‌లో కూడా స్వర్ణపతకాలు సాధిస్తాడని ఆశాభావం వ్యక్తంచేశారు. -
స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్‌కు 200 మంది హాజరు
హుడాకాంప్లెక్స్: రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో బుధవారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కోసం సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. 2014-15 విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతిలో అడ్మిషన్ల కొరకు సెలక్షన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి సుమారు 200 మంది బాలబాలికలు ఇందులో పాల్గొన్నారని జిల్లా క్రీడాధికారి ఇ.వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ సెలక్షన్ ట్రయల్స్‌లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామని ఆయన చెప్పారు. రంగారెడ్డి జిల్లా నుంచి 20 మంది చొప్పున బాలబాలికలను ఎంపిక చేసి వచ్చే నెలలో హకీంపేటలో నిర్వహించే రాష్ట్ర స్థాయి సెలక్షన్స్‌కు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. గురువారం కూడా సెలక్షన్ ట్రయల్స్ జరుగుతాయి. -
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అడ్రస్ ఎక్కడ?
కాగితాలకే పరిమితమైన ఉద్యోగుల విభజన ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర విజభన జరిగినప్పటికీ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్)లో మాత్రం కాగితాల మీదే విభజన జరిగింది. శాప్ గత ఆరు నెలలుగా ఒక పద్ధతి ప్రకారం ఉద్యోగులను విభజించలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వానికి కొందరు అధికారులు తమ పదవుల కోసం తప్పడు సమాచారం అందించారు. దాదాపు 72 మంది తాత్కాలిక కోచ్‌లను గ్రేడ్-3 కోచ్‌లుగా ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఇందులో తెలంగాణకు 34 మందిని కేటాయించగా మరో 38 మందిని ఆంధ్రకు కేటాయించారు. ‘శాప్’ ప్రస్తుత ఆఫీస్‌ను తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయంగా, అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ఎల్బీస్టేడియంలోని ఇండోర్ టెన్నిస్ స్టేడియాన్ని కార్యాలయంగా మార్చారు. అయితే కనీసం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీని సూచించే బోర్డును కూడా ఇప్పటిదాకా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. దీంతో సంబంధిత అధికారులపై క్రీడాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈనెల 2వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు అధికారికంగా జరిగినప్పటికీ ఇక్కడ మాత్రం అలాంటి వేడుకలేవీ జరగకపోవడం క్రీడావర్గాలను విస్మయపరిచింది. ఇదిలా ఉండగా రెండు రాష్ట్రాల అధికారులు ప్రస్తుతం శాప్ కార్యాలయంలోనే పని చేయడం ఇబ్బందిగా ఉందని ఉద్యోగులు అంటున్నారు. తెలంగాణకు చెందిన చంద్రారెడ్డి (సైక్లింగ్ కోచ్), శ్రీకాంత్‌రెడ్డి (బాక్సింగ్ కోచ్)తో పాటు దాదాపు 57 మంది ఉద్యోగులు, కోచ్‌లను ఏపీకి బదిలీ చేయడాన్ని తప్పుబడుతున్నారు. ఆంధ్రాకు చెందిన అనంతపురం అథ్లెటిక్ కోచ్ శ్రీనివాస్, చిత్తూరు క్రికెట్ కోచ్ ఉమా శంకర్, విజయవాడ హాకీ కోచ్ మహేష్ బాబు, విశాఖపట్నంకు చెందిన ఫుట్‌బాల్ కోచ్ మరియా జోజిలను తెలంగాణకు కేటాయించడంపై ‘టి’ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాప్ చరిత్రలో లేని రెండు జూయింట్ మేనేజింగ్ డెరైక్టర్ పోస్టులను సృష్టించడాన్ని ఇరు రాష్ట్రాల ఉద్యోగుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. శాప్‌లో ఉద్యోగుల విభజనలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. -
క్రీడలకూ ప్రాధాన్యమివ్వాలి
రాయదుర్గం, న్యూస్‌లైన్: చదువుతోపాటు క్రీడలకు కూడా ప్రతీ విద్యార్థి ప్రాధాన్యత ఇవ్వాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) వైస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ రాహుల్ బొజ్జా సూచించారు. గచ్చిబౌలిలోని నాసర్ బాయ్స్ స్కూల్లో శనివారం 15వ వార్షిక క్రీడోత్సవాలను ఆయన ప్రారంభించారు. విద్యార్థులను అగ్ని, ఆకాష్, పృథ్వి, సూర్య హౌజ్‌లుగా విభజించి వారి మధ్య అథ్లెటిక్స్, అబ్స్టాకిల్ రేస్, రిలే రేస్, జిమ్నాస్టిక్స్, కరాటే, రైడింగ్ బాస్కెట్‌బాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చాటిన సూర్య హౌజ్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బేగమ్ అనీస్ ఖాన్, డెరైక్టర్ కుత్బుద్దీన్‌ఖాన్, ప్రిన్సిపల్ హఫీజుద్ధీన్ అహ్మద్ పాల్గొన్నారు. -
వర్ధమాన క్రీడాకారులకు సాయం
సాక్షి, హైదరాబాద్: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న వర్ధమాన ఆటగాళ్లను మరింతగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్) ముందుకు వచ్చింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) పాలసీలో భాగంగా రాష్ట్ర క్రీడా జ్యోతి పథకం కింద 16 మంది క్రీడాకారులను ఎంపిక చేసింది. వీరికి రాష్ట్ర గనుల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎన్డీసీ) సౌజన్యంతో మొత్తం రూ.26 లక్షల మేర నగదు పురస్కారాలను అందించారు. గురువారం జీఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ చేతుల మీదుగా క్రీడాకారులు చెక్‌లను అందుకున్నారు. ఇదీ క్రీడా జ్యోతి పురస్కారాల జాబితా రూ. 2 లక్షలు: సుంకరి లావణ్య, కె.జ్యోతి సురేఖ(ఆర్చరీ), అచ్యుత కుమారి (అథ్లెటిక్స్), ఎస్.మారతమ్మ, నిఖత్ జరీన్ (బాక్సింగ్), బి.ప్రత్యూష (చెస్), మాదరి కమల్ రాజ్ (ఫెన్సింగ్), బి.అరుణ (జిమ్నాస్టిక్స్), సయీదా ఫలక్(కరాటే), ఎం.సంతోషి (వెయిట్ లిఫ్టింగ్). రూ. 1 లక్ష: ఆర్.రాజా రిత్విక్ (చెస్), డి.ప్రేరణ షీతల్, ఎం.రవీనా (ఫెన్సింగ్),షేక్ జఫ్రీన్ (మూగ, చెవిటి-టెన్నిస్), శాంభవి దీక్షిత్ (టెన్నిస్), తేజా సింగ్ దేవీ సింగ్ ఠాకూర్ (వెయిట్ లిఫ్టింగ్). -
క్రీడా సమాఖ్యలకు సీఈఓలు
న్యూఢిల్లీ: దేశంలోని జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లను ప్రొఫెషనల్‌గా నడిపించేందుకు భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) నడుం బిగిస్తోంది. ఈ మేరకు సమాఖ్యలకు సీఈఓలను నియమించాలని భావిస్తోంది. కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన గవర్నింగ్ బాడీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ‘సాయ్’ మౌలిక వసతులను ఉపయోగించుకుని మాజీ ఆటగాళ్లు శిక్షణ ఇవ్వడానికి ముందుకొస్తే వారి భాగస్వామ్యంతో (ఆదాయం పంచుకునే పద్ధతి) ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. గిరిజన, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య మారుమూల, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సాహించాలని, ఇందుకోసం ప్రత్యేక ప్రాంత క్రీడల (ఎస్ఏజీ) కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. -
ఎస్సీఆర్, సాయ్ జట్ల గెలుపు
సాక్షి, హైదరాబాద్: ‘ఎ’ లీగ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్), భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) క్రీడా శిక్షణ కేంద్రం (ఎస్టీసీ) జట్లు విజయాలు నమోదు చేశాయి. హైదరాబాద్ కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో ఎస్సీఆర్ 23-18తో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)పై గెలుపొందింది. ఆట అర్ధభాగం ముగిసే సమయానికి ఎస్సీఆర్ జట్టు 13-8తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. రైల్వే జట్టు తరఫున అమీర్, రవి అద్భుతంగా రాణించగా, ఎస్బీఐ తరఫున మల్లేశ్ చక్కని ప్రదర్శన కనబరిచాడు. రెండో లీగ్‌లో ‘సాయ్ ఎస్టీసీ’ జట్టు 57-14తో ఏపీఎస్ఆర్టీసీ జట్టుపై ఘన విజయం సాధించింది. తొలి అర్ధభాగంలోనే సాయ్ జట్టు 21-2 ఆధిక్యంతో ఆర్టీసీపై విజయాన్ని ఖాయం చేసుకుంది. సాయ్ జట్టులో షఫీ, కోటి అసాధారణ ఆటతీరుతో రెచ్చిపోయారు. ఆర్టీసీ జట్టు తరఫున రాజలింగం మెరుగ్గా ఆడాడు. మూడో మ్యాచ్‌లో హెచ్ఏఎల్ జట్టు నుంచి ఆంధ్రాబ్యాంక్‌కు వాకోవర్ లభించింది. తెలంగాణ బంద్ నేపథ్యంలో గురువారం జరగాల్సిన లీగ్ మ్యాచ్‌లు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. -
ధ్యాన్‌చంద్‌కూ ‘భారతరత్న’!
సంగ్రూర్ (పంజాబ్): ప్రతిష్టాత్మక పౌరపురస్కారం ‘భారతరత్న’ను హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌కూ ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం వెల్లడించారు. ఇక్కడి వార్ హీరోస్ స్టేడియంలో రూ. 6.87 కోట్లతో నిర్మించనున్న సింథటిక్ ట్రాక్ శంకుస్థాపన కోసం వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వచ్చే ఒలింపిక్స్‌లో తమ అథ్లెట్లు భారత జాతీయ జెండా కిందనే పోటీల్లో పాల్గొంటారన్నారు. బర్నాలలోని ఎస్డీ కాలేజి క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఎక్స్టెన్షన్ సెంటర్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలున్న ఇలాంటి సెంటర్లను ప్రతీ రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసేందుకు మంత్రి చొరవ చూపాలని స్థానిక కాంగ్రెస్ ఎంపీ విజయ్ ఇందర్ సింగ్లా కోరారు. -
సాయ్, ఎస్సీ రైల్వే శుభారంభం
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర ఇంటర్ డిపార్ట్మెంట్స్ ‘ఎ’ డివిజన్ లీగ్ కబడ్డీ టోర్నమెంట్లో స్పోర్ట్స్ ఆథారిటీ (సాయ్) హాస్టల్, సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్) జట్లు శుభారంభం చేశాయి. హైదరాబాద్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన లీగ్ పోటీల్లో సాయ్ హాస్టల్ జట్టు 22-10 స్కోరుతో అవలీలగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) జట్టుపై విజయం సాధించింది. తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి సాయ్ హాస్టల్ జట్టు 14-8తో ఆధిక్యాన్ని సాధించింది. సాయ్ జట్టులో మల్లేష్, టి.వరప్రసాద్ దూకుడుగా ఆడి విజయాన్ని అందించారు. ఎస్బీఐ జట్టులో ఎం.నర్సింగ్ రావు, విజయ్ కుమార్ యాదవ్ రాణించారు. రెండో లీగ్ మ్యాచ్‌లో ఎస్సీ రైల్వే జట్టు 45-24తో రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) జట్టుపై గెలిచింది. ఈపోటీలను హైదరాబాద్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కె.జగదీశ్వర్ యాదవ్ లాంఛనంగా ప్రారంభించారు. -
సచిన్ ‘విజన్’ బుట్టదాఖలు
న్యూఢిల్లీ: దేశంలో క్రీడాభివృద్ధి కోసం సూచనలు చేయాలని కోరే భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) వాటిని పట్టించుకోవడం అంతంత మాత్రమే. అయితే సాక్షాత్తూ క్రికెట్ దిగ్గజం, పార్లమెంట్ సభ్యుడు సచిన్ టెండూల్కర్ ‘విజన్’కు కూడా అదే దుస్థితి ఎదురైంది. ఒలింపిక్స్‌లో పతకాల భారత్‌ను చూడాలనుకున్న సచిన్ టెండూల్కర్ కలల్ని కేంద్ర క్రీడా, మానవ వనరుల అభివృద్ధి శాఖలు, క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) మొగ్గలోనే తుంచేశాయి. ‘మాస్టర్ బ్లాస్టర్’ అందజేసిన ‘విజన్-2020’ పేరుతో ప్రతిపాదించిన డాక్యుమెంట్‌ను బుట్టదాఖలు చేశాయి. వెటరన్ బ్యాట్స్‌మన్ సచిన్ రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన కొన్ని రోజులకే భారత్‌లో క్రీడల ప్రాముఖ్యత, పతకాల సాధనకై విలువైన సూచనలు చేశాడు. రెండు పేజీల ఈ లేఖతో పాటు 25 స్లైడ్లతో కూడిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను అప్పటి మానవ వనరుల మంత్రి కపిల్ సిబాల్, క్రీడాశాఖ మంత్రి అజయ్ మాకెన్లకు అందజేశాడు. నాలుగు ముఖ్యాంశాలతో సచిన్ ఇచ్చిన విజన్ డాక్యుమెంట్‌ను పరిశీలించాలని మొదట క్రీడాశాఖ సాయ్‌కి పంపితే, మానవ వనరుల శాఖ సంబంధిత అధికారులకు నివేదించింది. అలా మొదట్లో హడావుడి చేసిన ఈ శాఖలు తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదు.