సచిన్ ‘విజన్’ బుట్టదాఖలు
న్యూఢిల్లీ: దేశంలో క్రీడాభివృద్ధి కోసం సూచనలు చేయాలని కోరే భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) వాటిని పట్టించుకోవడం అంతంత మాత్రమే. అయితే సాక్షాత్తూ క్రికెట్ దిగ్గజం, పార్లమెంట్ సభ్యుడు సచిన్ టెండూల్కర్ ‘విజన్’కు కూడా అదే దుస్థితి ఎదురైంది. ఒలింపిక్స్‌లో పతకాల భారత్‌ను చూడాలనుకున్న సచిన్ టెండూల్కర్ కలల్ని కేంద్ర క్రీడా, మానవ వనరుల అభివృద్ధి శాఖలు, క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) మొగ్గలోనే తుంచేశాయి.
‘మాస్టర్ బ్లాస్టర్’ అందజేసిన ‘విజన్-2020’ పేరుతో ప్రతిపాదించిన డాక్యుమెంట్‌ను బుట్టదాఖలు చేశాయి. వెటరన్ బ్యాట్స్‌మన్ సచిన్ రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన కొన్ని రోజులకే భారత్‌లో క్రీడల ప్రాముఖ్యత, పతకాల సాధనకై విలువైన సూచనలు చేశాడు. రెండు పేజీల ఈ లేఖతో పాటు 25 స్లైడ్‌లతో కూడిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను అప్పటి మానవ వనరుల మంత్రి కపిల్ సిబాల్, క్రీడాశాఖ మంత్రి అజయ్ మాకెన్‌లకు అందజేశాడు. నాలుగు ముఖ్యాంశాలతో సచిన్ ఇచ్చిన విజన్ డాక్యుమెంట్‌ను పరిశీలించాలని మొదట క్రీడాశాఖ సాయ్‌కి పంపితే, మానవ వనరుల శాఖ సంబంధిత అధికారులకు నివేదించింది. అలా మొదట్లో హడావుడి చేసిన ఈ శాఖలు తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదు.