‘మాస్టర్’ దైవ పుత్రుడు
న్యూఢిల్లీ: సచిన్‌తో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు. అతను దైవ తనయుడని... మైదానంలో ఏదైనా సాధించే సత్తా తనకే ఉందని చెప్పుకొచ్చాడు. ప్రపంచంలో ఇంకెవరూ అతను సాధించిన రికార్డులను చెరిపేయలేరన్నాడు. ఇంత చేసినా... మాస్టర్ బ్యాట్స్‌మన్ ఏనాడు ఆటకంటే తనే గొప్పనుకోలేదని, ఎంత ఎదిగినా ఒదిగేతత్వం ‘ముంబైకర్’దని వీవీఎస్ కొనియాడాడు.
ముఖ్యంగా యువ ఆటగాళ్లంతా నేర్చుకోవాల్సిందిదేనని చెప్పాడు. ‘కేవలం క్రికెటర్లకే కాదు... యావత్ క్రీడాకారులందరికీ రోల్‌మోడల్ సచిన్. అతనిలో ప్రత్యేక ప్రతిభ ఉంది. గేమ్ స్పిరిట్‌తో ఆడే ఆటగాడు టెండూల్కర్. ఎంత సీనియర్ అయినా... జట్టు అవసరాలకే ప్రాధాన్యతనిచ్చే క్రికెటర్. అందుకే ఇవన్నీ సచిన్‌కు ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి’ అని లక్ష్మణ్ వివరించాడు. భారత్‌లో చాలా మంది క్రికెటర్లు సచిన్‌ను చూసే పెరిగారని చెప్పాడు. ‘కెరీర్ తొలినాళ్లలో... అదీ 16 ఏళ్ల ప్రాయంలోనే అరివీర భయంకర బౌలర్లను ఎదుర్కోవడం మాటలు కాదు. ఇదో విషయమైతే... రెండున్నర దశాబ్దాలు కెరీర్‌ను కొనసాగించడం మరో గొప్ప విషయం.
ఇలా అనితర సాధ్యమైన రికార్డులన్నీ సచిన్‌కే సాధ్యం. అందుకే అతను భారత అభిమానులకు దేవుడయ్యాడు. ప్రపంచ క్రికెట్‌కు వరమయ్యాడు’ అని మాస్టర్ ఘనతల్ని వీవీఎస్ లక్ష్మణ్ కొనియాడాడు. అతనితో తన 16 ఏళ్ల అనుబంధంలో ఎన్నో తీపిగుర్తులు ఉన్నాయన్నాడు. ఇందులో ఏ ఒక్కటీ ప్రత్యేకమని చెప్పలేనని, అవన్నీ తనకు మధురానుభూతులే అని అన్నాడు. పార్లమెంట్ సభ్యుడిగా నామినేట్ అయ్యాక ఇదెందుకు నీకని అడిగితే క్రీడలకు, క్రీడాకారులకు ఏదైనా చేయాలనుకుంటున్నట్లు సచిన్ చెప్పాడని ఈ హైదరాబాదీ పేర్కొన్నాడు.