
న్యూఢిల్లీ: పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో వివరణ ఇచ్చేందుకు భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ మంగళవారం బీసీసీఐ అంబుడ్స్‌మన్–నైతిక విలువల అధికారి జస్టిస్ డీకే జైన్ ఎదుట హాజరయ్యారు. మూడు గంటలకు పైగా వీరిద్దరూ తమ వాదన వినిపించారు. ఈ అంశం లేవనెత్తిన మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజీవ్ గుప్తా సైతం విడిగా జస్టిస్ జైన్‌ను కలిసి వివరణ ఇచ్చాడు. వాదనలన్నిటినీ లిఖితపూర్వంగా సమర్పించాలని జస్జిస్ జైన్ వీరిని ఆదేశించారు.
బీసీసీఐ నియమిత క్రికెట్ సలహా మండలి సభ్యులుగా ఉన్న సచిన్, లక్ష్మణ్... ఐపీఎల్ ఫ్రాంచైజీలు ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లకు మెంటార్లుగా వ్యవహరిస్తున్నారు. తాము స్వచ్ఛందంగానే ఈ సేవలు అందిస్తున్నామని ఇద్దరూ చెబుతున్నారు. గతంలో తాను సమర్పించిన వివరణలోనూ బీసీసీఐ ఇదే విషయం స్పష్టం చేసింది. కాగా, ఇదే అంశంపై సచిన్, లక్ష్మణ్ మే 20న మరోసారి అంబుడ్స్‌మన్‌ను కలవనున్నారు.