
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అంబుడ్స్‌మన్ ముందుకు అవసరమైతే బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్, లక్ష్మణ్‌లు హాజరయ్యే అవకాశాలున్నాయి. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కేసు విచారణలో అంబుడ్స్‌మన్ కమ్ ఎథిక్స్ ఆఫీసర్ రిటైర్డ్ జస్టిస్ డీకే జైన్ వారిద్దరినీ వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరుతూ సమన్లు పంపితే... అప్పుడు బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రి, లీగల్ టీమ్ కూడా హాజరవుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అంబుడ్స్‌మన్ నోటీసులకు భారత విఖ్యాత క్రికెటర్లిద్దరూ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు.
క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యులుగా ప్రతిఫలం ఆశించకుండా పనిచేస్తున్నామని, అలాంటపుడు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సలహాదారులుగా ఉంటే పరస్పర విరుద్ధ ప్రయోజనాలను ఎలా ఆపాదిస్తారని ముంబై ఇండియన్స్ మెంటార్ సచిన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటార్ లక్ష్మణ్ తమ సంజాయిషీ లేఖలో తెలిపారు. సహజ న్యాయసూత్రాల ప్రకారం గంగూలీ అంబుడ్స్‌మన్ ముందుకు వచ్చినట్లే వాళ్లిద్దరు రావాల్సిన అవసరముంటుందని బీసీసీఐ భావిస్తోంది. అప్పుడు బోర్డు సీఈఓ కూడా విచారణకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. వివాదాస్పద పేసర్ శ్రీశాంత్ విచారణలోనూ సీఈఓ హాజరయ్యారని ఆ అధికారి తెలిపారు.