న్యూఢిల్లీ: భారత బ్యాటింగ్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మన్‌గానే సుపరిచితుడు. మైదానంలో, వెలుపల ఎక్కడా ఆగ్రహించిన దాఖలాలు లేవు. సహనం కోల్పోయిన సందర్భాలు లేవు. అలాంటి లక్ష్మణ్ బీసీసీఐ అంబుడ్స్‌మన్‌కు రాసిన సంజాయిషీ లేఖలో పరిపాలక కమిటీ (సీఓఏ) వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ)లో తమ బాధ్యతలేంటో ఇప్పటికీ తమకే తెలియదని వెల్లడించాడు. అంబుడ్స్‌మన్, ఎథిక్స్ అధికారి రిటైర్డ్ జస్టిస్ జైన్ పంపిన నోటీసుకు స్పందనగా రాసిన లేఖలో ఈ విషయాలన్నీ పేర్కొన్నాడు. అసలు పరిధి, పదవీకాలం తెలియని సీఏసీ సభ్యుడిని అవడం, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సలహాదారుగా ఉండటం ఏ రకంగా పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందో చెప్పాలన్నాడు. ఇందులో అసలు ప్రయోజనాలే ఉంటే ఏ సవాలుకైనా సిద్ధమన్నాడు. ‘సీఏసీ సభ్యులుగా మా బాధ్యతలేమిటి, పరిధేంటి, ఇంతకీ మా సభ్యుల పదవీ కాలమెంతో చెప్పాలని మేం గతేడాది డిసెంబర్ 7న సీఓఏ చీఫ్ వినోద్ రాయ్‌కి లేఖ రాశాం.
అయితే ఇప్పటివరకు దీనిపై స్పందనే లేదు. కేవలం సీఏసీ అనేదొకటి ఉందని, అది పనిచేస్తుందిలే అనే విధంగానే వ్యవహారం నడుస్తోంది. దురదృష్టమేంటంటే అది ఎంతవరకు కొనసాగుతుందో ఎవరికీ తెలియదు’ అని లేఖలో తీవ్రస్థాయిలో లక్ష్మణ్ ప్రస్తావించాడు. తన అనుభవం, ఆలోచనలతో భారత క్రికెట్‌కు అర్థవంతమైన మేలుచేయగలననే నమ్మకంతో కమిటీ సభ్యుడయ్యేందుకు అంగీకరించానని... భారత క్రికెట్ సూపర్‌పవర్‌గా వెలుగొందాలనే లక్ష్యంతోనే బాధ్యతలు స్వీకరిస్తూ ప్రతిఫలాన్ని నిరాకరించానని వివరించాడు. నోటీసులపై ముందుగా సచిన్ ఆదివారం సంజాయిషీ లేఖ పంపాడు. ముంబై ఇండియన్స్ సలహాదారుగా తాను ఎలాంటి లబ్ధి పొందనపుడు విరుద్ధ ప్రయోజనాలెలా అవుతాయన్నాడు. తమపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, అసంబద్ధమైనవని చెప్పాడు. నిజానికి సీఓఏ మహిళా జట్టు కోచ్ ఎంపిక క్రతువులో తమ ముగ్గురు సభ్యులకు అసలు సమయమే ఇవ్వలేదని లక్ష్మణ్ అన్నాడు.
మాకే తెలియదు మా పాత్రేమిటో!
Published Tue, Apr 30 2019 12:40 AM | Last Updated on Tue, Apr 30 2019 12:40 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment