సాక్షి, హైదరాబాద్: ‘ఎ’ లీగ్ ఇంటర్ డిపార్ట్‌మెంటల్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్), భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) క్రీడా శిక్షణ కేంద్రం (ఎస్‌టీసీ) జట్లు విజయాలు నమోదు చేశాయి. హైదరాబాద్ కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో ఎస్‌సీఆర్ 23-18తో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)పై గెలుపొందింది. ఆట అర్ధభాగం ముగిసే సమయానికి ఎస్‌సీఆర్ జట్టు 13-8తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. రైల్వే జట్టు తరఫున అమీర్, రవి అద్భుతంగా రాణించగా, ఎస్‌బీఐ తరఫున మల్లేశ్ చక్కని ప్రదర్శన కనబరిచాడు. రెండో లీగ్‌లో ‘సాయ్ ఎస్‌టీసీ’ జట్టు 57-14తో ఏపీఎస్‌ఆర్‌టీసీ జట్టుపై ఘన విజయం సాధించింది.
తొలి అర్ధభాగంలోనే సాయ్ జట్టు 21-2 ఆధిక్యంతో ఆర్‌టీసీపై విజయాన్ని ఖాయం చేసుకుంది. సాయ్ జట్టులో షఫీ, కోటి అసాధారణ ఆటతీరుతో రెచ్చిపోయారు. ఆర్‌టీసీ జట్టు తరఫున రాజలింగం మెరుగ్గా ఆడాడు. మూడో మ్యాచ్‌లో హెచ్‌ఏఎల్ జట్టు నుంచి ఆంధ్రాబ్యాంక్‌కు వాకోవర్ లభించింది. తెలంగాణ బంద్ నేపథ్యంలో గురువారం జరగాల్సిన లీగ్ మ్యాచ్‌లు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.
ఎస్‌సీఆర్, సాయ్ జట్ల గెలుపు
Published Wed, Dec 4 2013 11:32 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement