సూర్యపేట గ్యాలరీ స్టాండ్ ప్రమాదం: ప్రధాన కారణం ఇదే!
సాక్షి, సూర్యాపేట: జాతీయ స్థాయి కబడ్డీ ప్రారంభోత్సవంలో ప్రేక్షకుల గ్యాలరీ స్టాండ్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 150 మంది గాయాలపాలయ్యారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. నిర్వాహకుల వైఫల్యం వల్లే ఈ ప్రమాదం సంభవించిందంటూ బాధితులు, వారి బంధువులు విమర్శిస్తున్నారు. నాణ్యతా లోపంతో గ్యాలరీ నిర్మాణం జరిగిందని.. అందువల్లే ప్రమాదం చోటుచేసుకుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. గ్యాలరీ స్టాండ్ నిర్మాణంలో ఇనుప పైపులు వాడాల్సిన చోట కర్రలతో పని కానిచ్చారని.. అందవల్లే అది కుప్పకూలిందని విచారణ అధికారులు భావిస్తున్నారు. ప్రమాదానికి ఇదే ప్రధాన కారణమని చెప్తున్నారు.
కాగా, మరో మూడు రోజుల పాటు కబడ్డీ పోటీలు జరుగనుండటంతో గ్యాలరీలతో ప్రమాదమని తెలుసుకున్న నిర్వాహకులు.. వాటిని తొలిగించి.. నేలపై కూర్చునే విదంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సోమవారం గ్యాలరీ ప్రమాదం జరిగిన వెంటనే యుద్ధ ప్రతిపాదికన సహాయక చర్యలు ప్రారంభించారు పోలీసులు. రెండు క్రేన్లు, 50 మంది సిబ్బందితో అక్కడకు చేరుకుని క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. వీరందరికీ ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఇక గ్యాలరీ నిర్మించిన శివసాయి డెకరేషన్స్‌పై కేసు నమోదు చేశారు.
ఎక్కువ మంది రావడంతో...
18 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పుతో ఒకేసారి 1500 మంది వీక్షించేలా గ్యాలరీ స్టాండ్‌ను నిర్మించారు. కానీ పరిమితికి మించి 2000 మంది ప్రేక్షకులు రావడంతో గ్యాలరీ బేస్ అధిక బరువు తట్టుకోలేక కూలిపోయింది. గ్యాలరీ నిర్మాణంలోనూ నాణ్యత ప్రమాణాలు పాటించలేదని స్పష్టమవుతోంది. ఇనుప రాడ్లు వాడాల్సిన చోట కర్రలు కట్టడమే దీనికి నిదర్శనం.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: కుప్పకూలిన గ్యాలరీ స్టాండ్.. 100 మందికి గాయాలు