కాగితాలకే పరిమితమైన ఉద్యోగుల విభజన
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర విజభన జరిగినప్పటికీ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్)లో మాత్రం కాగితాల మీదే విభజన జరిగింది. శాప్ గత ఆరు నెలలుగా ఒక పద్ధతి ప్రకారం ఉద్యోగులను విభజించలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వానికి కొందరు అధికారులు తమ పదవుల కోసం తప్పడు సమాచారం అందించారు. దాదాపు 72 మంది తాత్కాలిక కోచ్‌లను గ్రేడ్-3 కోచ్‌లుగా ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఇందులో తెలంగాణకు 34 మందిని కేటాయించగా మరో 38 మందిని ఆంధ్రకు కేటాయించారు. ‘శాప్’ ప్రస్తుత ఆఫీస్‌ను తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయంగా, అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ఎల్బీస్టేడియంలోని ఇండోర్ టెన్నిస్ స్టేడియాన్ని కార్యాలయంగా మార్చారు. అయితే కనీసం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీని సూచించే బోర్డును కూడా ఇప్పటిదాకా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. దీంతో సంబంధిత అధికారులపై క్రీడాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈనెల 2వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు అధికారికంగా జరిగినప్పటికీ ఇక్కడ మాత్రం అలాంటి వేడుకలేవీ జరగకపోవడం క్రీడావర్గాలను విస్మయపరిచింది. ఇదిలా ఉండగా రెండు రాష్ట్రాల అధికారులు ప్రస్తుతం శాప్ కార్యాలయంలోనే పని చేయడం ఇబ్బందిగా ఉందని ఉద్యోగులు అంటున్నారు. తెలంగాణకు చెందిన చంద్రారెడ్డి (సైక్లింగ్ కోచ్), శ్రీకాంత్‌రెడ్డి (బాక్సింగ్ కోచ్)తో పాటు దాదాపు 57 మంది ఉద్యోగులు, కోచ్‌లను ఏపీకి బదిలీ చేయడాన్ని తప్పుబడుతున్నారు.
ఆంధ్రాకు చెందిన అనంతపురం అథ్లెటిక్ కోచ్ శ్రీనివాస్, చిత్తూరు క్రికెట్ కోచ్ ఉమా శంకర్, విజయవాడ హాకీ కోచ్ మహేష్ బాబు, విశాఖపట్నంకు చెందిన ఫుట్‌బాల్ కోచ్ మరియా జోజిలను తెలంగాణకు కేటాయించడంపై ‘టి’ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాప్ చరిత్రలో లేని రెండు జూయింట్ మేనేజింగ్ డెరైక్టర్ పోస్టులను సృష్టించడాన్ని ఇరు రాష్ట్రాల ఉద్యోగుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. శాప్‌లో ఉద్యోగుల విభజనలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అడ్రస్ ఎక్కడ?
Published Fri, Jun 13 2014 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 8:42 AM
Advertisement