ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర క్రీడాసంఘాల్లో కీలకమైన అధ్యక్ష, కార్యదర్శుల పదవుల్లో ఉన్న గెజిటెడ్ అధికారుల వివరాలను శాప్ సేకరించే పనిలో నిమగ్నమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తూ క్రీడాసంఘాల్లో కొనసాగుతున్న అధికారుల వివరాలను తెలియజేయాలని కోరుతూ ఈ మేరకు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్)... రాష్ట్ర ఒలింపిక్ సంఘాని (ఏపీఓఏ)కి లేఖ రాసింది.
ఈ నేపథ్యంలో ఏపీఓఏ వర్గాలు ఆ ఉన్నతాధికారుల జాబితాను సిద్ధం చేస్తున్నాయి. ముఖ్యంగా గెజిటెడ్ అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్‌లు పలు క్రీడా సంఘాలకు సారథ్యం వహించడం వల్ల ఆర్థిక లావాదేవీల్లో ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయముంటుంది. అలా క్రీడా సంఘాల్లోని సదరు ఉన్నతాధికారులు తమ పలుకుబడిని ఉపయోగించి నిధులను అక్రమంగా వెనకేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
తమ సంఘానికి చెందిన ఆటలకు, ఆటగాళ్లకే ఎక్కువ నిధులు కేటాయించుకుంటున్నారని పలువురు క్రీడాకారులు వాపోతున్నారు. తమ పరపతిని ఉపయోగించి శాప్ నుంచి వచ్చే గ్రాంటులనూ త్వరగా పొందే వెసులుబాటు లేకపోలేదు. అంతేకాదు కీలకమైన విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ప్రైవేటు సంస్థల నుంచి కూడా క్రీడల నిర్వహణ పేరిట వసూళ్లకు పాల్పడే ప్రమాదం ఉందని క్రీడా వర్గాలు ఆరోపిస్తున్నాయి.
అయితే భారత ఒలింపిక్ సంఘం, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రీడా సంఘాల్లో కొనసాగుతున్న ఉన్నతాధికారులు తాము పని చేస్తున్న సంబంధిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. అంతేకాదు వాళ్లంతా ఒక విడత మాత్రమే పదవుల్లో కొనసాగాలి. అయితే ఈ నిబంధనలను ఏ ఒక్కరూ పాటించడం లేదనేది బహిరంగ సత్యం. ఈ నేపథ్యంలో శాప్ ఆ అధికారుల వివరాలను సేకరిస్తోంది.
అధికారుల వివరాలను సేకరిస్తున్న శాప్
Published Fri, Jan 31 2014 11:58 PM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement