state sports authority
-
సింధుకు ఘన సత్కారం
విజయవాడ: ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తెలుగు తేజం, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికారిత సంస్థ ఘనంగా సత్కరించింది. శుక్రవారం తుమ్మల పల్లి కళాక్షేత్రంలో సింధును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబులతో పాటు రాష్ట్ర తెలుగు భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, సింధు తల్లి దండ్రులు వెంకట రమణ, విజయలు హాజరయ్యారు. వీరితో పాటు పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె ప్రవీణ్ కుమార్, శాప్ స్పోర్ట్స్ ఎండీ కాటంనేని భాస్కర్, జాయింట్ కలెక్టర్ కె మాధవీలత తదితరులు సింధు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. పీవీ సింధు సాధించిన విజయం తెలుగు ప్రజల విజయంగా అభివర్ణించారు. ఆమెకు భవిష్యత్ ప్రయత్నాలలో మరిన్ని విజయాలు సమకూరాలన్నారు ఒదిగి ఎదిగితే సింధు అవుతారు.. సింధు ఎన్నో త్యాగాలు, కష్టాలు ఫలితమే ప్రపంచ చాంపియన్ రూపంలో కనబడిందని మంత్రి కురసాల కన్నబాబు కొనియాడారు. తెలుగు వారి కీర్తిని విశ్వ విఖ్యాతం చేసిన సింధు గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుందన్నారు. ఒక తెలుగు అమ్మాయి ఏది అనుకుంటే అది సాధించగలరని సింధు నిరూపించారన్నారు. ఈ సందర్భంగా పీవీ సింధు తల్లి దండ్రులకు మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. పీవీ సింధులు ఎంతోమంది ఉన్నారని, భవిష్యత్తులో మరిన్ని పథకాలు రావాలని కోరుకుంటున్నానని కురసాల తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రోత్సహించే విధంగా మౌలిక వసతుల కల్పించాలని సీఎం ఆదేశించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. -
అధికారుల వివరాలను సేకరిస్తున్న శాప్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర క్రీడాసంఘాల్లో కీలకమైన అధ్యక్ష, కార్యదర్శుల పదవుల్లో ఉన్న గెజిటెడ్ అధికారుల వివరాలను శాప్ సేకరించే పనిలో నిమగ్నమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తూ క్రీడాసంఘాల్లో కొనసాగుతున్న అధికారుల వివరాలను తెలియజేయాలని కోరుతూ ఈ మేరకు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్)... రాష్ట్ర ఒలింపిక్ సంఘాని (ఏపీఓఏ)కి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఏపీఓఏ వర్గాలు ఆ ఉన్నతాధికారుల జాబితాను సిద్ధం చేస్తున్నాయి. ముఖ్యంగా గెజిటెడ్ అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్‌లు పలు క్రీడా సంఘాలకు సారథ్యం వహించడం వల్ల ఆర్థిక లావాదేవీల్లో ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయముంటుంది. అలా క్రీడా సంఘాల్లోని సదరు ఉన్నతాధికారులు తమ పలుకుబడిని ఉపయోగించి నిధులను అక్రమంగా వెనకేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. తమ సంఘానికి చెందిన ఆటలకు, ఆటగాళ్లకే ఎక్కువ నిధులు కేటాయించుకుంటున్నారని పలువురు క్రీడాకారులు వాపోతున్నారు. తమ పరపతిని ఉపయోగించి శాప్ నుంచి వచ్చే గ్రాంటులనూ త్వరగా పొందే వెసులుబాటు లేకపోలేదు. అంతేకాదు కీలకమైన విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ప్రైవేటు సంస్థల నుంచి కూడా క్రీడల నిర్వహణ పేరిట వసూళ్లకు పాల్పడే ప్రమాదం ఉందని క్రీడా వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే భారత ఒలింపిక్ సంఘం, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రీడా సంఘాల్లో కొనసాగుతున్న ఉన్నతాధికారులు తాము పని చేస్తున్న సంబంధిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. అంతేకాదు వాళ్లంతా ఒక విడత మాత్రమే పదవుల్లో కొనసాగాలి. అయితే ఈ నిబంధనలను ఏ ఒక్కరూ పాటించడం లేదనేది బహిరంగ సత్యం. ఈ నేపథ్యంలో శాప్ ఆ అధికారుల వివరాలను సేకరిస్తోంది. -
శాప్ మాజీ కోచ్ సూర్యనారాయణ మృతి
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ప్రముఖ అంతర్జాతీయ వెటరన్ అథ్లెట్ వి.సూర్యనారాయణ(91) శుక్రవారం రాత్రి మృతి చెందారు. గతంలో ఆయన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్) అథ్లెటిక్స్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రంలో పలువురు జాతీయ, అంతర్జాతీయ అథ్లెట్లను తీర్చిదిద్దిన ఘనత సూర్యనారాయణది. ఆయన శిష్యరికంలో అంతర్జాతీయ అథ్లెట్ ఎస్.ఎ.నాయుడు వెలుగులోకి వచ్చాడు. అతను 110 హర్డిల్స్‌లో భారత్ తరఫున అనేక అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్‌ల్లో పాల్గొన్నాడు. అథ్లెటిక్స్‌లో చిన్నారులను ప్రోత్సహించేందుకు ఆయన చిల్డ్రన్ ఒలింపియాడ్, లిమ్కా రేసు, ఒలింపిక్ రన్లను 30 ఏళ్ల పాటు నిర్వహించారు. 1970 నుంచి 2000 వరకు ఈ పోటీలను కొనసాగించారు. రాష్ట్ర వెటరన్ అసోసియేషన్‌లో పలు పదవులు చేపట్టిన సూర్యనారాయణ భారత వెటరన్ అథ్లెటిక్స్ సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన మృతి పట్ల హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ (హెచ్‌డీఏఏ) ప్రధా న కార్యదర్శి డాక్టర్ రాజేష్ కుమార్, కోశాధికారి భాస్కర్‌రెడ్డి, భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేష్‌లు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే బీఎస్ఎన్ఎల్ జాతీయ మాజీ అథ్లెట్ తారావతి సింగ్ (52) మృతి పట్ల ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తారావతి జాతీయ అథ్లెటిక్స్ టెక్నికల్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు.