అంబవేద్కర్ అంబేద్కర్ అయ్యాడు | Ambavedkar's name changes as ambedkar | Sakshi
Sakshi News home page

అంబవేద్కర్ అంబేద్కర్ అయ్యాడు

Published Sun, Oct 13 2013 3:09 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM

అంబవేద్కర్ అంబేద్కర్ అయ్యాడు

అంబవేద్కర్ అంబేద్కర్ అయ్యాడు

సాక్షి, హైదరాబాద్: ‘‘రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అంత గొప్పవాడు అయ్యేందుకు ఆయన గురువు చేసిన చిన్న మార్పే కారణం. అంబవేద్కర్‌గా ఉన్న ఆయన ఇంటి పేరును అంబేద్కర్‌గా మార్చారు. ఎందుకంటే అంబవేద్కర్ అనే ఇంటి పేరు ఆయన కులాన్ని వెంటనే గుర్తించేలా చేస్తుంది. ఆ ఇంటి  పేరే ఉంటే ఆయన పట్ల వివక్ష చూపి ఆయనను అడ్డుకునే ప్రమాదాన్ని అంబేద్కర్ గురువు ముందుగానే పసిగట్టారు. అప్పట్నుంచీ ఇప్పటిదాకా నిమ్నజాతులపై వివక్ష కొనసాగుతూనే ఉంది’’ అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ అన్నారు. అభివృద్ధి చెందే అవకాశం సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఉండాలని, అయితే స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు గడుస్తున్నా అసమానతలు, అవినీతి కారణంగా అన్ని వర్గాలు అభివృద్ధి చెందడం లేదని, ఇందుకు కులం, పేదరికం అడ్డంకిగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 
  శనివారం బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన జస్టిస్ వంగాల ఈశ్వరయ్యను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ... అల్పులమనే భావన నుంచి బడుగు, బలహీన వర్గాల ప్రజలు విముక్తులు కావాలని పిలుపునిచ్చారు. పల్లకీలు, జెండాలు మోసే కార్యకర్తల మనస్తత్వం నుంచి బయటపడి దేశాన్ని పాలించాలనే భావనకు వచ్చినప్పుడే బీసీల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని, ఈ దిశగా కృషి జరగాలని కోరారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... బీసీలంతా ఐకమత్యంతో కృషి చేసి రాజ్యాధికారాన్ని సాధించుకోవాలన్నారు. పేదరికం కారణంగా బడుగు, బలహీన వర్గాల పట్ల సాంఘిక అసమానతలు కొనసాగుతున్నాయని వాటిని అధిగమించాలన్నారు.
 
 మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధాకృష్ణయ్య.. మాట్లాడుతూ బీసీల్లో ఎన్నో కులాలున్న కారణంగా ఐకమత్యం లోపించిందని, ఈ అనైక్యతను అగ్రవర్ణాలు వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల అభివృద్ధి కోసం జాతీయ, రాష్ట్రస్థాయిల్లో నియమించిన కమిషన్ల సిఫారసులను అమలు చేయలేదని బీజేపీ జాతీయ నాయకుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. బీసీ నాయకుడు పాలూరు రామకృష్ణయ్య అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి గంగాధర్, జస్టిస్ సి.వి.రాములు, అఖిల భారత పద్మశాలీ సంఘం అధ్యక్షుడు రామ్మూర్తి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుందర్‌కుమార్, వివిధ బీసీ సంఘాల నేతలు శ్యాంసుందర్‌గౌడ్, దేవర కరుణాకర్, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, అరుణ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
 
 ఒత్తిళ్లకూ లొంగకుండా పనిచేస్తా: జస్టిస్ ఈశ్వరయ్య
 జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య మాట్లాడుతూ... బీసీల సమస్యలను పరిష్కరించేందుకు తన శాయశక్తులా, ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేస్తానని చెప్పారు. బీసీ కమిషన్లకు చట్టబద్ధత కల్పించినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని, బీసీల సంక్షేమానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. కుల వ్యవస్థపై ఆధారపడిన దేశ రాజకీయాల్లో బీసీలు ఐక్యంగా ఉండి రాజ్యాధికారం సాధించుకోవాలని అన్నారు. 2011 జనాభా లెక్కల్లో భాగంగా సేకరించిన కులాల వారీ జనాభా వివరాలను వెల్లడించాలంటూ జాతీయ స్థాయిలో ఉద్యమం నిర్మించాలని సూచించారు. సమావేశంలో భాగంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. రాష్ట్రానికి చెందిన కాపులను బీసీల్లో చేర్చేందుకు అంగీకరించవద్దని జస్టిస్ ఈశ్వరయ్యను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement