అంబేద్కర్ గొప్ప దార్శనికుడు
రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకల్లో సీజే జస్టిస్ సేన్‌గుప్తా
హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాణంలో బీఆర్ అంబేద్కర్ పాత్రను జాతి ఎన్నటికీ మరువదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా అన్నారు. అధ్యయనం, చర్చల తర్వాతే రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప దార్శనికుడని కొనియాడారు. రాష్ట్ర బార్ కౌన్సిల్, హైకోర్టు న్యాయవాదుల సంఘం సంయుక్తంగా సోమవారం హైకోర్టు ప్రాంగణంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని నిర్వహించాయి. ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ జస్టిస్ సేన్‌గుప్తా మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ మీద మరో వ్యవస్థ పెత్తనం చేయకుండా ఉండేలా రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు.
ఘనత ప్రధానంగా అంబేద్కర్‌కే దక్కుతుందన్నారు. కొన్ని అంశాల్లో రాష్ట్రాలపై కేంద్రానికి అజమాయిషీ ఉన్నప్పటికీ, న్యాయవ్యవస్థకు మాత్రం రాజ్యాంగం పూర్తిస్థాయి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించిందని వివరించారు. న్యాయమూర్తులు, విద్యావంతులు తప్ప మిగిలినవారు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్ట నిబంధనల గురించి ఆలోచించట్లేదన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎ.వి.శేషసాయి, దామా శేషాద్రినాయుడు, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.గిరిధరరావు, అదనపు ఏజీ కె.జి.కృష్ణమూర్తి, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వేణుమాధవ్, కార్యదర్శులు పాశం కృష్ణారెడ్డి, డి.ఎల్.పాండు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బార్ కౌన్సిల్, న్యాయవాదుల సంఘం ప్రతినిధులను సీజే ప్రత్యేకంగా అభినందించారు.