‘టీఎస్‌పీఎస్సీ’పై హైకోర్టు జడ్జితో..న్యాయ విచారణ! | Telangana Govt Mulls Judicial Probe Into Recruitment Exam Leaks Unemployment Crisis in Focus | Sakshi
Sakshi News home page

‘టీఎస్‌పీఎస్సీ’పై హైకోర్టు జడ్జితో..న్యాయ విచారణ!

Published Sat, Dec 16 2023 4:44 AM | Last Updated on Sat, Dec 16 2023 1:56 PM

Telangana Govt Mulls Judicial Probe Into Recruitment Exam Leaks Unemployment Crisis in Focus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణస్టేట్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ)లో ప్రశ్నపత్రాల లీకేజీ కోణంలోనే కాకుండా ప్రతి విభాగంలో నెలకొన్న లోపాలపై నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయముర్తికి లేఖ రాయనున్నారు.

విచారణకు ప్రత్యేకంగా సిట్టింగ్‌ జడ్జిని నియమించాలని ఆ లేఖలో కోరనున్నట్టు సమాచారం. టీఎస్‌పీఎస్సీ వ్యవహారంపై గత ప్రభుత్వం సిట్‌ (స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌) ఏర్పాటు చేయగా, ఆ దర్యాప్తు కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక టీఎస్‌పీఎస్సీ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. మరోవైపు తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ చైర్మన్‌ పదవికి బి.జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేయగా, సభ్యులుగా కొనసాగిన ఐదుగురు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ మేరకు శుక్రవారం సభ్యులంతా గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌కు రాజీనామా పత్రాలు పంపించారు. గవర్నర్‌ను అపాయింట్‌మెంట్‌ కోరినా, ఆమె సమయం ఇవ్వకపోవడంతో రాజీనామాలు పంపించినట్టు ఓ సభ్యుడు తెలిపారు. దీంతో కమిషన్‌లో చైర్మన్‌తో సహా సభ్యుల స్థానాలు ఖాళీ అయ్యాయి. 

ఇతర విభాగాల పనితీరు, లోపాలపై దృష్టి  
టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా జనార్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలోని ‘కోరం’వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 30 వేలకు పైబడి ఉద్యోగాల భర్తీకి 23 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో 19 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు పూర్తి కాగా, గ్రూప్‌–2, గ్రూప్‌–3, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. గ్రూప్‌–1 ప్రిలిమినరీ పూర్తి చేసిన కమిషన్‌ మెయిన్‌ పరీక్షలు చేపట్టాల్సి ఉంది.

ఇవి కాకుండా వివిధ ప్రభుత్వ కాలేజీల్లో జూనియర్, డిగ్రీ లెక్చరర్‌ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో నాలుగు పరీక్షలను రద్దు చేసి రెండుసార్లు నిర్వహించారు. మరికొన్నింటిని వాయిదాలు వేస్తూ పూర్తి చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీయే ఇందుకు కారణం. అయితే టీఎస్‌పీఎస్సీలోని ఇతర విభాగాల్లో పనితీరు, లోపాలు గుర్తించాలని రాష్ట్రం ప్రభుత్వం భావిస్తోంది.

ప్రతి విభాగంలో అధికారులు, ఉద్యోగుల పనితీరు, విధి నిర్వహణ, సమాచార వ్యవస్థ, గోప్యత తదితరాలను లోతుగా పరిశీలించనుంది. ప్రశ్నపత్రాల లీకేజీతో ఇతర విభాగాల అలసత్వం, అధికారుల ఉదాసీనతపై సమగ్రంగా విచారించనున్నారు. అక్రమాలకు పాల్పడిన, విధినిర్వహణలో అలసత్వం వ్యవహరించిన వారిపై  కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సీఎం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ దిశగా హైకోర్టు సిట్టింగ్‌ జడ్జిని నియమించాలని సీజేకు లేఖ రాయనున్నారు. 

కొత్త కమిషన్‌ కొలువుదీరేలోపు... 
టీఎస్‌పీఎస్సీలో పదవులన్నీ ఖాళీ అయ్యాయి. సాధారణంగా కమిషన్‌లో సభ్యుల నిర్ణయం తప్పనిసరి. కనీసం ఇద్దరు సభ్యులున్నా అందు­లో సీనియర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎవ­రూ లేకపోవడంతో ఏ నిర్ణయమూ తీసుకునే అవకాశం లేదు. కొత్త కమిషన్‌ కొలువుదీరేలోపు విచారణ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావి­స్తోంది.

విచారణకు ముందుగానే కొత్త కమిషన్‌ ఏర్పాటైతే తాజాగా చేపట్టదలచిన సమగ్ర విచారణకు ఆటంకాలు ఎదురవుతాయని, కొత్త కమిషన్‌కు నిర్ణయాధికారంలోనూ ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణు­లు చెబుతున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ దర్యాప్తు వేగవంతం చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టీఎస్‌పీఎస్సీ, సిట్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. వీలైనంత వేగంగా విచారణ చేపడితే ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అడుగులు పడతాయన్న ఆశలో నిరుద్యోగులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement