లక్డీకాపూల్ (హైదరాబాద్): కుల వ్యవస్థను నిర్మూలిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ లో తెలంగాణ దళిత దండు, తెలంగాణ మాల మహానాడు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, తెలంగాణ మాదిగ దండోరా, మాదిగ జేఏసీ, రిపబ్లిక్ పార్టీలు సంయుక్తంగా రాజ్యాంగ గర్జన సమావేశం నిర్వహించాయి. తెలంగాణ దళిత దండోరా అధ్యక్షుడు బచ్చలి కూర బాలరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ.. రాజ్యాంగా న్ని మార్చాల్సిన అవసరం లేదని, పాలకుల మనసు మార్చాలని అన్నారు.
మారుతున్న సమాజానికి తగ్గట్టు ఏదైనా కొత్త అంశాన్ని చేర్చాలంటే రాజ్యాంగ సవరణలు చేసే అవకాశం ఉందన్నారు. ఎస్సీ/ఎస్టీ/బీసీల కోసం రాజ్యాంగాన్ని సవరించాలన్నారు. ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు పెట్టడానికి.. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీల కోటా ప్రవేశపెట్టడానికి రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో 75 కోట్ల జనాభా కలిగిన బీసీలకు ఇంతవరకు రాజకీయ రిజర్వేషన్లు లేవన్నారు. విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతం పెంచాలన్నారు.
ఈ రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్ నిబంధన తొలగించాలన్నారు. బీసీలకు సాంఘిక భద్రత కల్పించడానికి బీసీల అత్యాచార నిరోధక చట్టం ప్రవేశపెట్టాలన్నారు. బహుజనుల అభివృద్ధి, వికాసం కోసం రాజ్యాంగాన్ని సవరించాలి తప్ప బానిసత్వం పునరుద్ధరించడానికి రాజ్యాంగాన్ని మార్చరాదని కృష్ణయ్య స్పష్టం చేశారు. సమావేశంలో తెలంగాణ దళిత దండోరా ఉపాధ్యక్షుడు మొగిలయ్య, టీఎం ఎస్‌ఎస్ అధ్యక్షుడు యాదయ్య, మహా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మత్స్య పాద నరసింహారావు, మాదిగ జేఏసీ అధ్యక్షుడు కిరణ్, ఆర్‌పీఐ నాయకుడు బాల స్వామి ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment