కేలండర్‌ను ఆవిష్కరిస్తున్న ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలు, సామాజిక వర్గాలకు జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో అవకాశాలు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య క్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం కోసం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గురువారం బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.
గడిచిన 75 ఏళ్లలో ఏ రంగంలోనూ బీసీలకు కనీస వాటా కూడా లభించలేదని విమర్శించారు. ఏపీలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు అన్ని రంగాలలో జనాభా ప్రకారం వాటా ఇచ్చారని, రాజకీయ రంగంలో బీసీలకు 50 శాతం వాటాను అన్ని స్థాయిల్లో కల్పించారన్నారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనాభా గణనలో బీసీ కులగణన చేపట్టాలన్నారు. పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్‌లను 34 శాతం నుంచి 52 శాతానికి పెంచాలని కోరారు. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జకృష్ణ, బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ రాజ్‌కుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్, రాష్ట్ర కార్యదర్శి నరసింహగౌడ్, బీసీ వి ద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment