ప్రేమి'కులం'... | 44th anniversary celebrates 'Elimination of the community' | Sakshi
Sakshi News home page

ప్రేమి'కులం'...

Published Tue, Jan 27 2015 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM

ప్రేమి'కులం'...

ప్రేమి'కులం'...

అభివృద్ధిలో ఎంత ముందున్నా... భారత సమాజాన్ని తిరోగమింపజేస్తున్నవి నిచ్చనమెట్ల కులవ్యవస్థ, మతఛాందసత్వం. ఈ రెంటినీ ధిక్కరిస్తూ ఏర్పడిన ‘కుల నిర్మూలన సంఘం’ కొన్ని వందల వివాహాలు చేసింది. సంఘం 44వ వార్షికోత్సవం సందర్భంగా ఇందిరాపార్క్‌లో జరిగిన గెట్ టు గెదర్ కి కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలు హాజరయ్యాయి. తమ కష్టసుఖాలను కలబోసుకున్నాయి.
 - శ్రావణ్‌జయ
 
మనదేశంలో పెళ్లికి ప్రతి మతంలో ఓ సంప్రదాయం, ప్రతి కులానికి  ఓ కట్టుబాటు ఉంది. ఇక ప్రేమ పెళ్లి అంటే కుల, మత కుమ్ములాటలు సర్వసాధారణమే. ఇలాంటి అవరోధాలకు బలైనవారు ఎందరో. పరాయి కుల, మతస్తులను పెళ్లి చేసుకుంటే అప్రతిష్ట అన్న భావన, ప్రేమించి పెళ్లి చేసుకుంటే కొంత కాలానికి విడిపోతారనే అభిప్రాయం, కారణాలేమైనా...  కులవ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నాయి. ఈ జాఢ్యాన్ని పూర్తిగా రూపుమాపాలని ఏర్పడ్డదే ‘కుల నిర్మూలన సంఘం’.
 
 మనుషులందరిదీ ఒక్కటే కులమని, అది మానవత్వమేనని చెబుతూ 1971లో జాగర్లమూడి వీరస్వామి అధ్యక్షతన మొదలైంది. ‘రక్తమార్పిడి జరిగితేనే కులం అంతమవుతుంద’న్న అంబేద్కర్ మాటలను నిజం చేస్తూ... కుల, మత, జాతి అనే భేదాలకు అతీతంగా ఇప్పటి వరకు 1,500 జంటల్ని కలిపింది. పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డా, సహజీవనంలో కష్టనష్టాలె న్ని ఎదురైనా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్న జంటల అభిప్రాయాలు వారి మాటల్లోనే..
 
 ఐదు రోజుల్లోనే పెళ్లి

 ఇద్దరం టీచర్లు కావడంతో మా భావాలు కలిశాయి. కాకపోతే మా వారు హైదరాబాదీ, మాది రాజస్థానీ కుటుంబం. ఆయన పెళ్లి ప్రస్తావన తెచ్చిన ఐదోరోజే మా పెళ్లి జరిగింది. ఇద్దరి కులాలు వేరు, భాషలు వేరు, కట్టుబాట్లు వేరు కానీ ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఇప్పటికి 14 వసంతాలు పూర్తయ్యాయి. పల్లెల్లో మాత్రమే కాదు, చదువుకున్న వారిలోనూ కుల జాఢ్యం చాలా ఉంది. వారిలో మార్పు వస్తే దేశం సగం మారినట్టే.
 - కారుమంచి జయప్రకాష్, శాంతా రాథోడ్ దంపతులు
 
 డైరీల్లో రాసి చెప్పుకుంటాం
 రెడ్డి సామాజిక వర్గానికి నేను దళిత వ్యక్తిని పెళ్లాడినందుకు మా వాళ్లు చేసిన గొడవ అంతా ఇంతాకాదు. పోలీసుస్టేషన్లో కేసులు పెట్టారు. మా ఇంట్లో వాళ్లే కాదు బంధువులు, స్నేహితులు కూడా దూరమయ్యారు. మా పెళ్లప్పుడు తను సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు. ఎలాగైనా జీవితంలో నెట్టుకు రాలవాలన్న పంతంతో ఇద్దరం కష్టపడ్డాం.
 
  ప్రస్తుతం మాకు సొంతంగా హాస్టల్స్ ఉన్నాయి. పెళ్లయి 14 ఏళ్లు. మా ఇద్దరిలో నచ్చని విషయాలు ఏమైనా ఉంటే డైరీల్లో రాస్తాం. అవి చదివి ఇద్దరం మార్చుకునేందుకు ప్రయత్నిస్తాం. అంతేగానీ గొడవల్లేవు. పిల్లల్ని బాగా చదివిస్తున్నాం. ఒకప్పుడు మా పెళ్లిని అడ్డుకున్నవాళ్లే ఇప్పుడు ఆదర్శంగా చూస్తుంటే వారిస్తున్న విలువ మాకా? మేం సంపాదించిన డబ్బుకా? అన్న అనుమానం వస్తుంది.                
 - డి.మల్లేష్ , అలివేలుమంగ దంపతులు
 
 పోలీసు, నక్సలైట్ కలిసి చేసిన పెళ్లి
 ‘మాకు పెళ్లయి 23 ఏళ్లు. మూడు సార్లు పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించి విఫలమై నాల్గోసారి అప్పటి అడిషనల్ డీజీపీ మల్లెల బాబురావు , ఓ మాజీ నక్సలైట్, ప్రముఖ కవి శివసాగర్ (కలంపేరు) సహాయంతో ఇద్దరం ఒక్కటయ్యాం. బహుశా పోలీసు, నక్సలై ట్ కలిసి చేసిన పెళ్లి మాదేనేమో. మతాంతర వివాహం కావడంతో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాం.
 
 ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్నాం. కుల, మతాలకు అతీతంగా 70 జంటలను కలిపాం. కులవ్యవస్థను మార్చాలంటే ముందు రాజకీయాలు మారాలి. ఏ పార్టీ మేనిఫెస్టోలోనూ కులనిర్మూలన ప్రస్తావనే లేదు.   
 - మహమ్మద్ వహీద్, జ్యోతి దంపతులు
 
అందరూ ఒకచోట చేరాలి
 దళిత వర్గానికి చెందిన వాడిని కావడంతో బ్రాహ్మిణ్ అయిన తనను పెళ్లి చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రెండు కుటుంబాలూ ధనవంతులైనప్పుడు కులం అనేది అడ్డు కావట్లేదు. ఒకరు పేద, మరొకరు ధనికులైనప్పుడే మరింత ఇబ్బంది ఎదురవుతోంది. గతంలో కంటే ఇప్పుడు మార్పు వస్తోంది. పదేళ్ల కిందట సభకు చాలా తక్కువ మంది వచ్చేవారు. ఇప్పుడు కొన్ని వందల మంది వస్తున్నారు. ఇది శుభసూచకం. త్వరలోనే కులవ్యవస్థ నిర్మూలన కోసం ఓ టీవీ షోను ప్లాన్ చేస్తున్నా. మన రాష్ర్టంలోనే కాదు, దేశం మొత్తంలో కులమతాలకు అతీతంగా వివాహాలు చేసుకున్న వారు ఒక చోట చేరాలన్నది నా ఆకాంక్ష!.
 - ఇ.సూర్యనారాయణ, సూర్యసుధ దంపతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement