పాట్నా: బీహార్‌లో ఇటీవల జరిగిన కులగణనకు వ్యతిరేకంగా సోమవారం కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో కులగణన చేసే అధికారం కేంద్రానికి మాత్రమే ఉంటుందని పేర్కొంది. కానీ అంతలోనే పొరపాటు జరిగిందని చెబుతూ అఫిడవిట్‌లో కేంద్రానికి తప్ప ఇతర సంస్థలకు కులగణన, సర్వే చేసే అధికారం లేదన్న మాటను తొలగించి మరోసారి అఫిడవిట్ దాఖలు చేసింది.
కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌లో సవరణలపై బీహార్‌లోని రాజకీయ వర్గాల్లో అగ్గి రాజుకుంది. బీహార్ ప్రభుత్వం కులగణన చేయడం కేంద్రానికి ఇష్టం లేదని దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలన్న వారి కుటిలబుద్ధి మరోసారి బట్టబయలైందని చెబుతూ విమర్శలు చేశారు జేడీయు,ఆర్జేడీ నేతలు.
ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా మాట్లాడుతూ.. ప్రజల హక్కులను హరించాలన్న బీజేపీ, సంఘ్ పరివార్ వక్రబుద్ధికి ఇది నిదర్శనమని, ఇది అనుకోకుండా జరిగింది కాదని ఉద్దేశ్యపూర్వకంగా చేసిందేనని.. ఇదే కొనసాగితే అగ్నిపర్వతం బద్దలవుతుంది జాగ్రత్తని హెచ్చరించారు.
ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మాట్లాడుతూ బీజేపీ అసలు రంగు బయటపడింది. బీజేపీకి అసలు కులగణన చేయాలన్న ఉద్దేశ్యమే లేదని దీన్ని బట్టి అర్థమవుతోందని అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జేడీయు నేత విజయ్ కుమార్ చౌదరి స్పందిస్తూ బీహార్ ప్రభుత్వం ఎప్పటినుంచో తాము చేస్తోంది కులగణన కాదని సర్వే అని చెబుతూనే ఉంది. అయినా కేంద్రం దీన్ని వివాదాస్పదం చేయడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు.
దీనిపై బీహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ తాము కులగణనకి వ్యతిరేకమని ఏనాడూ చెప్పలేదని, మేము కోరుతుంది ఒక్కటేనని.. ఒకవేళ కులగణన పూర్తయితే ఆ వివరాలను 24 గంటల్లో ప్రకటించాలని మాత్రమే కోరుతున్నామన్నారు. చివరిగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందిస్తూ.. మేము మొదటి నుంచీ సర్వే మాత్రమే చేస్తున్నామని చెబుతూనే ఉన్నాము. ఆయా కులాల్లో ఎంతమంది ఉన్నారన్నది మేము లెక్కపెట్టడం లేదు. వారి ఆర్థిక స్థితిగతులను మాత్రమే లెక్కపెడుతున్నామని.. దీనివలన అర్హులైనవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే అవకాశముంటుందని అన్నారు.
ఈ సర్వేపై మొదట అభ్యంతరం వ్యక్తం చేసిన పాట్నా హైకోర్టు బీహార్ ప్రభుత్వం సర్వేలో సేకరించిన డేటా భద్రతపై హామీ ఇచ్చిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందే తడవు బీహార్ ప్రభుత్వం కులగణనను పూర్తిచేసింది.
ఇది కూడా చదవండి: ఎయిర్‌పోర్టులో కోట్లు విలువచేసే మాదకద్రవ్యాలు పట్టివేత
Comments
Please login to add a commentAdd a comment