కులమే పెద్ద జాతివ్యతిరేకి!
లండన్: భారత్‌లో వేళ్లూనుకుని ఉన్న కుల వ్యవస్థనే నిజమైన జాతి వ్యతిరేకతకు ఉదాహరణ అని నోబెల్ పురస్కార గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త ఆమర్త్య సేన్ పేర్కొన్నారు. ‘కులమే నిజమైన జాతి వ్యతిరేకి. ఎందుకంటే అది వర్గాల వారీగా దేశాన్ని విడదీస్తుంది. జాతీయవాదమంటే కులాలను, అన్ని విభజనలను నిర్మూలించడమే’ అని తేల్చి చెప్పారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్(ఎల్‌ఎస్‌ఈ)లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో గురువారం అమర్త్యసేన్ ప్రసంగించారు. ఎల్‌ఎస్‌ఈ పూర్వ విద్యార్థి అయిన అంబేడ్కర్‌ను గొప్ప సామాజిక విప్లవవాదిగా సేన్ అభివర్ణించారు. విద్య ద్వారానే ప్రపంచంలో మనం కోరుకున్న మార్పును సాధించగలమని అంబేడ్కర్ విశ్వసించారన్నారు.