న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ అంశాలపై అధికంగా ఆధారపడనున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా మరోసారి ఆటుపోట్లను చవిచూడవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే అధిక శాతం సానుకూలంగా ట్రేడయ్యే అవకాశమున్నట్లు అత్యధికులు అంచనా వేశారు. దేశీయంగా చెప్పుకోదగ్గ అంశాలు లేకపోవడం దీనికి కారణంకాగా.. రష్యా– ఉక్రెయిన్ మధ్య కొద్ది రోజులుగా నడుస్తున్న యుద్ధం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మరోపక్క ఇటీవల చైనాలో తలెత్తిన కోవిడ్–19 కొత్త వేరియంట్ కొన్ని యూరోపియన్ దేశాలకూ విస్తరించనున్న అంచనాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేయవచ్చని తెలియజేశారు. ఈ నెల 14న ప్రారంభమైన బడ్డెట్ రెండో దశ చర్చలకూ ప్రాధన్యమున్నట్లు తెలియజేశారు.
ఎఫ్‌పీఐల ఎఫెక్ట్
గత కొద్ది రోజులుగా అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) తిరిగి ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపనున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఈ వారం మార్కెట్లు ర్యాలీ బాటలో సాగవచ్చని చెబుతున్నారు. దేశీయంగా ప్రధాన అంశాలు కొరవడిన నేపథ్యంలో ప్రపంచ సంకేతాలే మార్కెట్లను నడిపించవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, చైనాలో కరోనా పరిస్థితులు, చమురు ధరల కదలికలు వంటివి కీలకమని వ్యాఖ్యానించారు. యుద్ధ పరిస్థితులు ముదరడం, కోవిడ్–19 సవాళ్లు పెరగడం వంటి అంశాలు సెంటిమెంటును దెబ్బతీయవచ్చని తెలియజేశారు.
చమురు కీలకం
రష్యా– ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కొద్ది రోజులుగా ముడిచమురు ధరలు మండుతున్నాయి. బ్రెంట్, నైమెక్స్ చమురు ధరలు 110 డాలర్ల స్థాయికి చేరాయి. ఈ నెల మొదటి వారంలో 130 డాలర్లను అధిగమించి 2008 తదుపరి గరిష్టాలను తాకిన సంగతి తెలిసిందే. దీనికితోడు డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడుతోంది. 75.5–76 స్థాయిలో కదులుతోంది. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లను దేశీ ఇండెక్సులు అనుసరించవచ్చని శామ్‌కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యెషా షా పేర్కొన్నారు. దేశీ ఆర్థిక పరిస్థితులను చమురు ధరలు ప్రభావితం చేయగలవని, దీంతో వీటి కదలికలను ఇన్వెస్టర్లు సునిశితంగా పరిశీలించే వీలున్నదని వివరించారు.
భారత్ భేష్
వర్థమాన మార్కెట్లతో పోలిస్తే దేశీ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉన్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. ఇప్పటికే కనిష్ట స్థాయిల నుంచి పటిష్ట ర్యాలీ చేశాయని, దీంతో ఎఫ్‌పీఐలు తిరిగి కొనుగోళ్లవైపు దృష్టిపెట్టే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇది మార్కెట్లు మరింత పురోగమించేందుకు దారిచూపవచ్చని విశ్లేషించారు. అంతేకాకుండా మార్కెట్లు ఇప్పటికే యుద్ధ భయాలను డిస్కౌంట్ చేశాయన్నారు.. కాగా.. సమీపకాలంలో దేశీ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగవచ్చన్నది కొటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ ఈక్విటీ హెడ్ హేమంత్ అంచనా.
గత వారం స్పీడ్
గత శుకవ్రారం(18న) హోలీ సందర్భంగా సెలవుకావడంతో 17తో ముగిసిన వారంలో దేశీ స్టాక్ మార్కెట్లు 4 శాతం జంప్‌చేశాయి. సెన్సెక్స్ 2,314 పాయింట్లు దూసుకెళ్లి 57,864 వద్ద ముగిసింది. నిఫ్టీ 657 పాయింట్లు జంప్‌చేసి 17,287 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ సైతం 2 శాతంపైగా ఎగశాయి.
యుద్ధం, కోవిడ్–19పై మార్కెట్ దృష్టి
Published Mon, Mar 21 2022 3:41 AM | Last Updated on Mon, Mar 21 2022 7:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment