మరణాలు @ 33 వేలు | COVID-19: Lifeless toll in US crosses 30000 | Sakshi
Sakshi News home page

మరణాలు @ 33 వేలు

Published Fri, Apr 17 2020 3:07 AM | Last Updated on Fri, Apr 17 2020 7:57 AM

COVID-19: Lifeless toll in US crosses 30000 - Sakshi

పెరూలోని అరెక్విపా నగరంలో వీధులను శుభ్రం చేస్తున్న సిబ్బంది

వాషింగ్టన్‌/లండన్‌: అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్‌–19 మరణాలు 33 వేల మార్కును దాటేసింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారితో 33,490 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. ఇందులో బుధవారం ఒక్క రోజే 6,185 మంది చనిపోగా, గురువారం మరో 2,763 మంది మృతి చెందారు. ఒక్క న్యూయార్క్‌లోనే ఇప్పటి వరకు 16,251 మంది చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. దేశం మొత్తమ్మీద కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య గురువారానికి 6,54,343కు చేరుకుంది.

అయితే, కోవిడ్‌ తీవ్రత తగ్గుముఖం పట్టిందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గినందున అమెరికన్లంతా తిరిగి పనుల్లోకి రావడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ నెలలోనే తిరిగి మార్కెట్లను ప్రారంభిస్తామని వెల్లడించారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లతో మాట్లాడిన అనంతరం కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఎప్పుడు ప్రారంభించాలో అధ్యక్షుడే నిర్ణయిస్తాడంటూ రాష్ట్రాల గవర్నర్లతో విభేదించిన ట్రంప్‌ ఇప్పుడు వెనక్కి తగ్గారు.

ఈ విషయంలో అధ్యక్షుడి కంటే గవర్నర్లకే అధికారాలు ఎక్కువగా ఉన్నాయని అంగీకరించారు. మే 1వ తేదీ నుంచి అమెరికాలో మార్కెట్లు తిరిగి తెరవాలని తొలుత భావించారు. కానీ, కొన్ని రాష్ట్రాల్లో కేసులు, మృతుల సంఖ్య భారీగా తగ్గడం వల్ల, అంతకంటే ముందే ఆయా రాష్ట్రాలు పనులు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనాపై పోరా టాన్ని కొనసాగిస్తామని చెబుతున్న ట్రంప్‌ కొన్ని రాష్ట్రాల్లో వాణిజ్య కార్యకలాపాలు మొదలైతే అమెరికా ఆర్థిక రంగా న్ని నిలబెట్టవచ్చునని ధీమా వ్యక్తం చేశారు. కోవిడ్‌ మరణాల సంఖ్యను కొన్ని దేశాలు దాచి పెట్టడం వల్లే అమెరికా జాబితాలో ముందుందని వ్యాఖ్యానించారు.

యూరప్‌లో కరోనా ఉగ్రరూపం  
యూరప్‌లో కరోనా కేసులు 10 లక్షల 50 వేలు దాటిపోయాయి. మృతుల సంఖ్య 90 వేలు దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మరణాల్లో 65 శాతానికి పైగా యూరప్‌లో సంభవించాయి. ఈ పరిణామంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్నాళ్లూ వైరస్‌ వణికించిన ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్‌ వంటి దేశాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ ఉంటే మరికొన్ని కొత్త దేశాలకు వైరస్‌ పాకిందని డబ్ల్యూహెచ్‌వో యూరప్‌ రీజనల్‌ డైరెక్టర్‌ హన్స్‌ క్లుగె అన్నారు. బ్రిటన్, టర్కీ, ఉక్రెయిన్, బెలారస్, రష్యాలలో వైరస్‌ తీవ్రరూపం దాలుస్తోందన్నారు. యూరప్‌కి ముప్పు ఇంకా తొలగిపోలేదని అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.  

తోట చుట్టూ వంద సార్లు
రెండో ప్రపంచ యుద్ధంలో భారత్‌ తరఫున పోరాడిన సైనిక వీరుడు కెప్టెన్‌ టామ్‌ మూరె ఇప్పుడు 99 ఏళ్ల వయసులో కరోనాని ఎదుర్కోవడానికి తన పోరాటపటిమను ప్రదర్శించారు. తన ఇంట్లో గార్డెన్‌ చుట్టూ వందసార్లు తిరిగారు. దీంతో 1.2 కోట్ల పౌండ్లు యూకే హెల్త్‌కేర్‌ చారిటీకి సంపాదించారు. వాకర్‌ సాయంతో ఆయన తనకు ఇచ్చిన టాస్క్‌ని పూర్తి చేశారు. మిలటరీ దుస్తుల్లో తనకు వచ్చిన మెడల్స్‌ అన్నీ డ్రెస్‌కి తగిలించుకొని ఆయన తోట చుట్టూ తిరగడం ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది. విరాళాలు వెల్లువెత్తాయి.  

మహీంద్రా పీపీఈల తయారీ
భారత ఆటోమొబైల్స్‌ పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా అమెరికాలోని డెట్రాయిట్‌ యూనిట్‌లో వ్యక్తిగత రక్షణ పరికరాలు (పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌–పీపీఈ) తయారీకి సన్నాహాలు చేస్తోంది. అమెరికాలో ఆరోగ్య సిబ్బందికి అవసరమైన సర్జికల్‌ మాస్కులు, గౌన్లతో పాటుగా వెంటిలేటర్లను కూడా భారీ సంఖ్యలో తయారు చేయనుంది. ‘ప్రస్తుతం కోవిడ్‌పై పోరాటానికి అవసరమైనవి తయారు చేయడమే అందరి లక్ష్యం కావాలి. మా దగ్గర నిరంతరం పని చేసే సిబ్బంది ఉన్నారు’అని ఆ సంస్థ ఉత్తర అమెరికా సీఈవో ఒక ప్రకటనలో తెలిపారు.  

టీకాతోనే సాధారణ పరిస్థితులు
కోవిడ్‌ నివారణకు టీకా అభివృద్ధి చేస్తేనే ప్రపంచంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అవకాశముందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెరెస్‌ స్పష్టం చేశారు. ‘టీకా ఒక్కటే ప్రపంచంలో  సాధారణ పరిస్థితులున్న భావనను తీసుకురాగలదు. దీంతో కోటానుకోట్ల డాలర్ల మొత్తం ఆదా అవడమే కాకుండా విలువైన ప్రాణాలు మిగుల్చుకోవచ్చు’’అని ఆయన ఆఫ్రికాదేశాలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు.కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రెండు లక్షల కోట్ల డాలర్ల విరాళాలు సేకరించాలని తాను మార్చి 25న పిలుపునివ్వగా ఇప్పటివరకూ ఇందులో 20 శాతం మొత్తం అందిందని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులను తట్టుకునేందుకు ఆఫ్రికన్‌ దేశాలు, ప్రభుత్వాలు చేస్తున్న కృషిని కొనియాడారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement