కరోనా సోకితే ఆస్పత్రిలో బెడ్ దొరకాలంటే గగనం. బెడ్ దొరికినా సరైన చికిత్స అందదు. దురదృష్టం వెంటాడి ప్రాణాలు కోల్పోతే ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని తీసుకురావడానికి గంటల తరబడి వేచి చూడాలి. శ్మశానంలో అంతిమ సంస్కారానికి మరో ఆరు గంటలు క్యూలో ఉండాలి. ఇదంతా ఏ సౌకర్యాలు లేని చోట కాదు. సాక్షాత్తూ దేశ రాజధాని ఢిల్లీలో దుస్థితి...
న్యూఢిల్లీ: ఢిల్లీలో చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనాకి కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఈ ఒక్క వారంలోనే ఢిల్లీలో కోవిడ్ మృతులు 156% పెరిగిపోయాయి. ఇప్పటివరకు 1,271 మంది మరణించారు. కేసుల సంఖ్య 39 వేలకు చేరుకుంది. జూలై 31 నాటికి కేసుల సంఖ్య 5 లక్షలు దాటిపోతుందని, అప్పటికి లక్ష పడకలు కావాలని ఢిల్లీలోని ఆప్ సర్కార్ అంచనా వేస్తోంది. కోవిడ్ రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. నగరం మొత్తమ్మీద ప్రభుత్వ ఆస్పత్రుల్లో 10 వేల వరకు పడకలు ఉన్నాయి. అవన్నీ దాదాపుగా నిండిపోవడంతో కోవిడ్ రోగులు పడరాని పాట్లు పడుతున్నారు.
ప్రతీ ముగ్గురిలో ఒకరికి వైరస్ !
ఢిల్లీలో కరోనా నెమ్మది నెమ్మదిగా విస్తరిస్తోంది. . సగటున ముగ్గురికి పరీక్షలు చేస్తే ఒక కేసు పాజిటివ్‌గా నమోదు అవుతోందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కన ఢిల్లీవ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తే మూడింట ఒక వంతు మందికి కోవిడ్ నిర్ధారణ అవుతుందని తేలుతోంది. ముంబై, చెన్నై వంటి నగరాలతో పోల్చి చూస్తే ఢిల్లీ అత్యంత తక్కువగా పరీక్షలు నిర్వహిస్తోంది. గత నెలలో రోజుకి 7 వేల పరీక్షలు నిర్వహించే రాజధానిలో హఠాత్తుగా వాటి సంఖ్య గతవారంలో 5 వేలకు తగ్గిపోయింది. దీంతో సుప్రీంకోర్టు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఢిల్లీలో పరిస్థితి భయంకరంగా, బీభత్సంగా, అత్యంత దయనీయంగా మారిందని వ్యాఖ్యానించిన సుప్రీం వైరస్ కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రతీ ముగ్గురిలో ఒకరికి వైరస్..!
Published Mon, Jun 15 2020 4:44 AM | Last Updated on Mon, Jun 15 2020 8:38 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment