అమెరికాలోని టేలర్స్‌విల్లేలో ఆహారం కోసం కార్లలో బారులుతీరిన జనం
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 విధ్వంసం కొనసాగుతోంది. చాలా దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బుధవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 1.30 లక్షలు దాటింది. అమెరికాలో ఒకే రోజు 2,129 మంది మరణించడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇక న్యూయార్క్‌లో మరణాలు 11 వేలకి చేరువలో ఉన్నాయి. సోమవారం మృతులు, కేసుల సంఖ్య కాస్త తగ్గినట్టుగా అనిపించినా మళ్లీ ఒక్కరోజులోనే అన్నీ ఎక్కువైపోవడం ఆందోళన పుట్టిస్తోంది.
వెయ్యి పడకల ఆస్పత్రిని మూసేసిన చైనా
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి వూహాన్‌లో యుద్ధప్రాతిపదికన పది రోజుల్లోనే నిర్మాణం పూర్తిచేసిన వెయ్యి పడకల ఆస్పత్రిని చైనా మూసేసింది. వూహాన్‌లో వైరస్ పూర్తిగా అదుపులోకి రావడంతో ఆస్పత్రిని మూసివేసినట్టుగా అధికారులు వెల్లడించారు. హుబై ప్రావిన్స్‌లో ఉన్న ఈ ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స అందించడానికి దేశం నలుమూలల నుంచి వేలాది మంది వైద్య సిబ్బందిని తీసుకువచ్చారు. తమకు అప్పగించిన మిషన్ పూర్తి కావడంతో వారంతా ఎవరి ఊళ్లకు వారు తిరిగి వెళ్లిపోయినట్టు అధికారులు తెలిపారు.
కరోనాను ఎదుర్కోవడానికి ఫిబ్రవరిలో పది రోజుల్లోనే రేయింబగళ్లు శ్రమించి నిర్మించిన ఈ ఆస్పత్రి అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. బ్రెజిల్‌లో 99 ఏళ్ల వయసున్న వృద్ధుడు కోవిడ్‌ను జయించారు. ఆయన రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ధీరుడు. లెఫ్ట్‌నెంట్ ఎర్మాండో పివెటా బ్రెజిల్ సైన్యంలో ఉండి రెండో ప్రపంచ యుద్ధంలో పోరాటం చేశారు. ఆస్పత్రి నుంచి విడుదలయ్యే సమయంలో ఆర్మీ గ్రీన్ క్యాప్ పెట్టుకొని చేతులు గాల్లో ఊపుతూ ఉత్సాహంగా ఆయన బయటకి వచ్చారు. ‘కోవిడ్‌పై చేసిన పోరాటం చాలా అద్భుతమైనది. ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నప్పుడు చావో బ్రతుకో అనుకొని పోరాడం. ఈ సారి బతకాలన్న ఆకాంక్షతో పోరాటం చేశా’ అని ఎర్మాండో చాలా ఉద్విగ్నంగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment