దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన ఎన్నికల ప్రచారసభకు మాస్కులతో హాజరైన ప్రజలు
హూస్టన్/మాడ్రిడ్/న్యూయార్క్/బీజింగ్: అమెరికాలో కోవిడ్–19తో అతలాకుతలమవుతున్న న్యూయార్క్ నగరం కేసుల సంఖ్యలో ఇప్పుడు చైనాను మించిపోయింది. ఒక్క న్యూయార్క్ నగరంలోనే లక్షకు పైగా కోవిడ్–19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చైనా, బ్రిటన్‌ల కంటే కూడా ఇవి ఎక్కువ. అధికారుల గణాంకాల ప్రకారం.. ఆదివారం ఒక్కరోజే న్యూయార్క్ నగరంలో 5,695 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసులు 1,04,410 కాగా మరణాల సంఖ్య 6,898కు చేరుకుంది. అదేవిధంగా, అమెరికా వ్యాప్తంగా 5,57,300 పాజిటివ్ కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య 22 వేలకు చేరుకుంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మే నెలలో ఆంక్షలను దశలవారీగా సడలించవచ్చని భావిస్తున్నారు. అయితే, ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడం అంత తేలిక కాదని పరిశీలకులు అంటున్నారు.
స్పెయిన్‌లో సోమవారం 517 మంది కోవిడ్–19తో చనిపోయారు. దీంతో మరణాలు 17,489కు చేరుకోగా పాజిటివ్ కేసులు 1,69,496కు పెరిగాయి. దాదాపు మూడు వారాల తర్వాత కోవిడ్ మరణాలు తగ్గుముఖం పట్టడంతో స్పెయిన్ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టే ప్రయత్నాలపై దృష్టిసారించింది. రెండు వారాల తర్వాత నిర్మాణరంగ కార్మికులు సోమవారం నుంచి పనుల్లో చేరారు. ఇరాన్‌లో సోమవారం ఒక్కరోజే 111 మంది మృతి చెందడంతో కోవిడ్–19 మరణాలు 4,585కు చేరుకున్నాయి. అదేవిధంగా, పాజిటివ్ కేసులు 73 వేలు అయ్యాయి. పాకిస్తాన్‌లో కోవిడ్ మృతులు 93, పాజిటివ్ కేసుల సంఖ్య 5,374కు చేరుకున్నాయి. ఇందులో సోమవారం ఒక్క రోజే 334 కేసులు బయటపడ్డాయి.
తిరగబెడుతున్న కోవిడ్–19
కోవిడ్–19 మహమ్మారికి కేంద్ర స్థానమైన చైనాలో మళ్లీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం 108 కోవిడ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో ఇప్పటి వరకు 82,160 పాజిటివ్ కేసులు వెలుగులోకి రాగా మరణాల సంఖ్య 3,341కు చేరుకుంది.
బ్రిటన్‌లో కోవిడ్–19తో సోమవారం మరో717 మంది చనిపోవడంతో మొత్తం మరణాలు 11,329కు చేరుకున్నాయి.. కోవిడ్ నుంచి కోలుకుని సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ విశ్రాంతి కోసం బకింగ్‌హామ్‌షైర్ ఎస్టేట్‌కు వెళ్లిపోయారు.
మొరాకోలో 28 వేల మంది అరెస్టు
మొరాకోలో కోవిడ్–19 సోకి 120 మంది చనిపోగా 1,746 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొరాకోలో కోవిడ్–19 కారణంగా విధించిన ఆంక్షలను ధిక్కరించినందుకు మార్చి 19వ తేదీ నుంచి ఇప్పటి వరకు పోలీసులు 28,701 మందిని అదుపులోకి తీసుకున్నారు.
దుబాయ్ ఎయిర్‌పోర్టులో 19 మంది భారతీయులు
దుబాయ్ ఎయిర్‌పోర్టులో 19 మంది భారతీయులు మూడు వారాలుగా చిక్కుకుపోయి ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఇతర దేశాల నుంచి వస్తున్న వీరంతా భారత ప్రభుత్వం విమాన సర్వీసులు రద్దు చేయడంతో అక్కడే ఉండిపోయారు. అక్కడి అధికారులు నిర్వహించిన పరీక్షల్లో వీరందరికీ కోవిడ్ నెగిటివ్ అని తేలింది. దీంతో వారిని ఎయిర్‌పోర్టు హోటల్‌లో బస కల్పించారు.
కోలుకుంటున్న భారతీయ అమెరికన్లు
కోవిడ్–19 బారినపడి తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురు భారతీయ అమెరికన్లు ప్లాస్మా థెరపీతో కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు.
స్వైన్ ఫ్లూ కంటే 10 రెట్లు డేంజర్: డబ్ల్యూహెచ్‌వో
స్వైన్ ఫ్లూ(హెచ్1ఎన్1) వైరస్ కంటే కరోనా వైరస్ 10 రెట్లు అధిక ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కరోనా అనేది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే వైరస్ అని తెలిపింది. కరోనా నియంత్రణ చర్యలను ఒకేసారి కాకుండా, దశల వారీగా ఎత్తివేయడమే సరైందని సూచించింది. కరోనా మహమ్మారిని సమూలంగా అంతం చేయాలంటే శక్తివంతమైన వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత త్వరగా కనిపెట్టాల్సి ఉందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment